ETV Bharat / city

ETV BHARAT EFFECT: నాడు పుట్టెడు దుఃఖం.. నేడు పట్టరాని సంతోషం

author img

By

Published : Oct 16, 2021, 1:24 PM IST

మంచి మనసు ఉండి.. మానసికంగా అంగవైకల్యం లేకుంటే.. దేవుడు తనవంతుగా సహకారం అందిస్తాడు అనే విషయం మరోసారి రుజువైంది. 'పుట్టెడు దుఃఖం' పేరిట 'ఈటీవీ- ఈటీవీ భారత్​'లో ప్రసారం చేసిన కథనం.. ఏడాదిలో బాధిత కుటుంబంలో సంతోషం నింపడమే నిదర్శనం. వైకల్యంతో దశాబ్దాలుగా బతుకులు వెళ్లదీస్తున్నారని ధీనగాథని కళ్లకు కట్టడంతో.. వారి కష్టాలను చూసి చలించిన దాతలు కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు. దగ్గరుండి గృహప్రవేశం చేయించారు.

ETV BHARAT EFFECT
నాడు పుట్టెడు దుఃఖం.. నేడు పట్టరాని సంతోషం

తెలంగాణలోని మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన ఓ కుటుంబానికి.. ఈ విజయ దశమి రోజున పట్టలేని సంతోషం కలిగింది. సరిగ్గా ఏడాది క్రితం ఇంటి నిర్మాణానికి పునాది పడగా... ఇప్పుడు గృహ ప్రవేశం చేశారు. గ్రామానికి చెందిన పెంటమ్మ, బూదమ్మ, సత్తెమ్మ జన్యు సమస్యలతో జన్మించారు. తల్లిదండ్రులు వారిని కంటికి రెప్పాలా కాపాడుకుంటుండగా... పెళ్లి చేసుకుని ముగ్గురు అక్కాచెల్లెళ్లను చూసుకుంటానని సమీప బంధువు నమ్మించాడు. తీరా వివాహం అనంతరం వారికి పిల్లలు ఆరోగ్య సమస్యలతో పుట్టగా.. అండగా ఉంటానని చెప్పినవాడు వదిలేసి పారిపోయాడు.

'ఈటీవీ- ఈటీవీ భారత్'​ కథనంపై దాతల స్పందన..

వృద్ధాప్యంతో తల్లిదండ్రులు చనిపోవడం, భర్త కూడా వదిలేసి వెళ్లగా కుటుంబానికి అసరా లేకుండా పోయింది. ముగ్గురు సంతానంలో ఒకరు మాత్రమే.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర్‌కు కూడా అంగవైకల్యమే. మరో కొడుకు రాజుకు రేచీకటి, వినికిడి సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ ఐదుగురు దివ్యాంగులకు భాగ్యలక్ష్మి అమ్మగా మారింది. తల్లి, తోబుట్టువులకు అన్నీతానై.. కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. అయితే ఆ కుటుంబం శిథిలావస్థకు చేరిన ఇంట్లో బిక్కు బిక్కుమంటూ గడిపింది. వీరి దయనీయస్థితిని 'ఈటీవీ- ఈటీవీ భారత్​ '... 'పుట్టెడు దుఃఖం' పేరిట ప్రసారం చేసింది. ఈ కథనానికి దేశ విదేశాల నుంచి దాతలు స్పందించారు. సుమారు 300 మంది తోచిన సాయం అందించారు. అలా మొత్తం రూ.25 లక్షలకు పైగా విరాళాలు అందాయి. వాటితో కొత్త ఇంటి నిర్మించుకున్న ఆ కుటుంబం.. ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తోంది.

చదలవాడ సాయం..

ప్రముఖ సినీ దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు... ఆర్థిక సాయంతోపాటు ఇంటి నిర్మాణానికి సహకారం అందించారు. గత దసరా రోజున స్వయంగా ఆయనే కుటుంబ సభ్యులతో భూమిపూజ చేయించారు. ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ఇప్పుడు ఆయనే గృహప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విజయ దశమి రోజు సొంతింటి కల సాకారం కావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

నాడు పుట్టెడు దుఃఖం.. నేడు పట్టరాని సంతోషం

ఇదీచూడండి: పిల్లి అనుకొని షర్మిల పార్టీ నాయకుడు సాయం చేయబోతే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.