ETV Bharat / city

వ్యక్తిత్వమే కృష్ణంరాజును ఉన్నత స్థితికి చేర్చింది.. సంస్మరణ సభలో కేంద్రమంత్రులు

author img

By

Published : Sep 16, 2022, 7:11 PM IST

Central Minister Rajnath singh on Krishnamraju: కృష్ణంరాజు వ్యక్తిత్వమే ఆయనను ఉన్నతస్థాయిలో నిలబెట్టిందని హైదరాబాద్​లో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారన్న రాజ్‌నాథ్‌.. కృష్ణంరాజు వివాదరహితుడిగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు దివంగత కృష్ణంరాజు నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.

krish
krish

షాపులో పని చేసే ఓంకార్​తో పాటు...

Central Minister Rajnath singh Condolence Krishnamraju: రెబల్‌స్టార్‌గా సినీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణంరాజు దశాబ్దాలుగా తమకు ఆత్మీయ మిత్రులని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్​సింగ్​ తెలిపారు. దిల్లీలో ఎప్పుడు కలిసినా అన్నగారు అంటూ ఆప్యాయంగా పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజు వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా.. ఇంకా ఎంతో మిగిలే ఉంటుందన్నారు. హైదరాబాద్ జేఆర్​సీ కన్వెన్షన్‌లో కృష్ణంరాజు సంస్మరణ సభకు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, కిషన్‌ రెడ్డి, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. కృష్ణంరాజు చిత్రపటానికి నివాళి అర్పించిన రాజ్‌నాథ్‌.. ఆయన సేవలను స్మరించుకున్నారు.

'కృష్ణంరాజు నటుడు, రాజకీయవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాది. 130 చిత్రాల్లో నటించడం చాలా గొప్ప విషయం. సామాజిక, కుటుంబ కథ, చారిత్రక, పౌరాణిక పాత్రలు వేసి అన్ని వర్గాల ప్రజలను మెప్పించారు. అసమాన ప్రతిభ, అపార నటనా కౌశల్యం వల్ల అనేక అవార్డులు కృష్ణంరాజును వరించాయి. రాష్ట్రపతి పురస్కారం, ఫిల్మ్‌పేర్‌, నంది అవార్డులను సొంతం చేసుకున్నారు.'-రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర రక్షణ మంత్రి

చివరివరకు రాజుగానే బతికారు..: కృష్ణంరాజు సినిమా, రాజకీయాల్లో మంచి పేరు సంపాదించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడా వివాదాలు లేని వ్యక్తి అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా అందరితో స్నేహంగా మెలిగిన గొప్ప వ్యక్తి కృష్ణంరాజు అని స్మరించుకున్నారు. భిన్నమైన పాత్రలతో మెప్పించిన కృష్ణంరాజు.. చివరివరకు రాజుగానే బతికారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కృష్ణంరాజు మంచి నడవడికతో ఆకాశమంత ఎత్తు ఎదిగారని చెప్పారు.

కుటుంబసభ్యులకు పరామర్శ..: అంతకుముందు రాజ్​నాథ్​ సింగ్.. కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గం ద్వారా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఆయన.. ప్రభాస్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్​నాథ్​సింగ్​ వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ ఉన్నారు. కృష్ణంరాజు అనారోగ్యానికి కారణం ఏంటి? ఏయే చికిత్సలు అందించారో ఎంపీ లక్ష్మణ్‌ రాజ్‌నాథ్‌కు వివరించారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు నేతలు ధైర్యం చెప్పారు. ప్రభాస్​ను పరామర్శించారు.

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌కు.. రాష్ట్ర భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాజ్​నాథ్​సింగ్​ నేరుగా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి జేఆర్​సీ కన్వెన్షన్​లో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి నగరానికి వస్తున్న అమిత్​షా.. రేపు ప్రభాస్​ను పరామర్శించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.