ETV Bharat / city

కృష్ణా జలాలపై కేసీఆర్‌ది వితండవాదం: మాజీ ఎంపీ ఉండవల్లి

author img

By

Published : Jul 8, 2021, 9:06 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కృష్ణా జలాలపై వితండవాదం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆంధ్రా వ్యతిరేకతను అస్త్రంగా మార్చుకుని.. ఏపీకి రావాల్సిన నీటి వాటాపై సంకుచితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాయలసీమ లాంటి దుర్భిక్షమైన ప్రాంతంపై కక్ష కట్టడం తగదిని వ్యాఖ్యానించారు.

undavalli on krishna water
undavalli on krishna water

కృష్ణా జలాల్లో సగం వాటా మాది అంటూ కేసీఆర్‌ వితండవాదం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నీటివాటాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకుచితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆంధ్రా వ్యతిరేకతను కేసీఆర్‌ అస్త్రంగా మార్చుకున్నారన్నారు. 2018 ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలే కేసీఆర్‌ను గెలిపించారని అభిప్రాయపడ్డారు. రాయలసీమ లాంటి దుర్భిక్షమైన ప్రాంతంపై కక్ష కట్టడం కేసీఆర్‌కు తగదన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై జగన్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను పరిష్కరించుకోలేక పోయారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో నిర్వాసితుల సంక్షేమం కూడా అంతే అవసరమని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో నిర్వాసితుల నష్టపరిహారం కలిసి ఉండాలన్నారు. నవరత్నాలకు జగన్‌ ఎంత విలువ ఇస్తున్నారో నిర్వాసితులకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నిర్వాసితుల సమస్యను జగన్‌ అంత తీవ్రంగా పరిగణించడం లేదన్నారు. నిర్వాసితులకు రూ.10 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం దాన్ని విస్మరించారని తెలిపారు. పోలవరం పూర్తి చేసిన ఘనత కంటే నిర్వాసితుల ఉసురు శాశ్వత అపకీర్తి తెస్తుందన్నారు. కరోనా రెండోదశ ఉద్ధృతికి ప్రధాన కారణం మతం, రాజకీయాలేనని వ్యాఖ్యానించారు. జగన్‌, రఘురామకృష్ణరాజు మధ్య అహం వల్లే విభేదాలు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: బకాయిలు ఇవ్వకుండా ప్రకటనలు ఇస్తే రైతుల కడుపు నిండదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.