ETV Bharat / city

కరోనాను జయించి విధుల్లో చేరుతున్న పోలీసులు

author img

By

Published : Jun 30, 2020, 12:51 PM IST

పోలీసులు కరోనాను జయిస్తున్నారు. ఇటీవల వైరస్‌ బారినపడిన సిబ్బంది క్రమంగా కోలుకొని తిరిగి విధుల్లో చేరుతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలై ఉండే పోలీసులు గుండెనిబ్బరంతో వైరస్‌ను అధిగమించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ts-police-who-conquered-corona-and-joined-the-line-of-duty
వైరస్​ను జయించిన విజేతలు

కరోనా ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వైరస్‌ బారిన పడుతున్నారు. లాక్‌డౌన్ అమలు చేసినప్పటి నుంచి నిరంతరాయంగా శ్రమిస్తున్న పోలీసుల్లో కొంతమంది వైరస్ బారినపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆ సంఖ్య ఎక్కువగా ఉంది. 62 పోలీస్‌స్టేషన్లతోపాటు మిగతా విభాగాల్లో కలుపుకొని దాదాపు 10 వేల మందికి పైగా గత మూడున్నర నెలల నుంచి లాక్‌డౌన్ విధుల్లో పాల్గొంటున్నారు. వారిలో దాదాపు 400 మందికి వైరస్‌ సోకింది.

మళ్లీ విధుల్లోకి...

తెలంగాణ రాష్ట్రంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలువురు ట్రాఫిక్ పోలీసులకు వైరస్‌ నిర్ధరణ అయ్యింది. వారంతా గాంధీ ఆసుపత్రితో పాటు ప్రకృతి చికిత్సాలయం, ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది కానిస్టేబుళ్లు, ఏఎస్​ఐలు మళ్లీ విధుల్లో చేరుతున్నారు. 55 ఏళ్లు పైబడినవారు సైతం త్వరగా కోలుకొని విధుల్లో చేరుతుండటం పోలీస్‌ ఉన్నతాధికారులను ఆనందానికి గురి చేస్తోంది.

ఐదుగురు మృతి

స్టేషన్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు సహా ట్రాఫిక్ పోలీసులు, ప్రముఖులకు భద్రతను పర్యవేక్షించే అంగరక్షకులూ మహమ్మారి బారిన పడుతున్నారు. దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించే సమయంలో స్టేషన్లలో ఉండే పోలీసులకు, వాహనాల తనిఖీల వేళ ట్రాఫిక్ పోలీసులకు వ్యాధి సోకుతోంది. వైరస్‌తో ఐదుగురు సిబ్బంది చనిపోగా.. మిగిలిన వాళ్లంతా క్రమంగా కోలుకుంటున్నారు.

పోలీసుల హర్షం

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4 రోజుల్లో సుమారు 50 మంది తిరిగి విధుల్లో చేరారు. వారందర్నీ ప్రోత్సహించేలా సీపీ అంజనీకుమార్ ప్రశంసా పత్రంతోపాటు ప్రత్యేకంగా బహుమతి అందించి విధుల్లోకి ఆహ్వానించారు. ఉన్నతాధికారులు అందిస్తున్న సహకారంపై పోలీసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

నేరశోధనలో ముందుండే పోలీసులు కరోనాను జయించడంలోనూ ముందు వరుసలో ఉండి ప్రజాసేవలో మేమున్నామంటూ విధుల్లో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి: పాక్ స్టాక్ మార్కెట్​పై దాడి- బలూచ్ ముష్కరుల పనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.