హైకోర్టు ఆగ్రహం.. నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ

author img

By

Published : Jun 21, 2022, 7:49 PM IST

హైకోర్టు

Government Agree: నీరు-చెట్టు కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యకం చేయటంతో రూ.200 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Highcourt fire - Government Agree: తెదేపా హయాంలో నీరు-చెట్టు కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బిల్లులు చెల్లించాలని హైకోర్టు పలు దఫాలుగా ఆదేశించినప్పటికీ.. బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు కోర్టు ధిక్కార పిటిషన్లు వేస్తున్నారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు.. తమ ఆదేశాలను ధిక్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. బిల్లుల చెల్లింపునకు రూ.200 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ జీవో 3301 జారీ చేశారు. తక్షణమే ఈ నిధులను రైతాంగానికి చెల్లించాలని స్పష్టం చేశారు.

అయితే రూ.168.18 కోట్ల బిల్లులు చెల్లించాలంటూ గతంలో ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోకే దిక్కులేదని.. మళ్లీ కొత్తగా రూ.200 కోట్లు విడుదల చేస్తున్నామంటూ కొత్త ఉత్తర్వులు ఇవ్వడంపై సాగునీటి వినియోగ సంఘాల సమాఖ్య ఆసహనం వ్యక్తం చేసింది. రైతులు హైకోర్టులో ధిక్కార పిటిషన్లు వేయడంతో ఈ నెల 6న రూ.45.74 కోట్లు.. రూ.122.44 కోట్లను చిన్న, మధ్యతరహా నీటి విభాగానికి విడుదల చేస్తూ రావత్‌ ఉత్తర్వులిచ్చారు. అయితే నిధులు చెల్లింపుపై ట్రెజరీ, మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ మధ్య ఇంకా స్పష్టత లేకపోవటంతో.. రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని సాగునీటి వినియోగ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు ఆక్షేపించారు.

2017లో తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోగా.. విజిలెన్స్‌ విచారణలంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తాము చేసిన పనులు సక్రమంగా ఉన్నాయని చిన్న, మధ్యతరహా నీటిపారుదల శాఖ, నిఘా విభాగం నివేదికలు ఇచ్చినందున తమకు తక్షణమే బిల్లులు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా ఆదేశించింది. అయినా చెల్లించకపోవడంతో రైతులు కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.