ETV Bharat / city

రాష్ట్రంలో రెండేళ్లుగా రాయితీ రుణాలకు మంగళం

author img

By

Published : Jul 30, 2021, 7:08 AM IST

పేదరికాన్ని జయించి.. సొంత కాళ్లపై నిలబడాలన్న ఆకాంక్షతో లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారికి కార్పొరేషన్లు ఇచ్చే రాయితీ రుణాలు సువర్ణావకాశం. ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో వేల కుటుంబాలు తలెత్తుకుని జీవిస్తున్నాయి. ఇలాంటి రాయితీ రుణ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసింది. ఇలాంటి పథకాలను ప్రభుత్వం నిలిపేయడం వేలాది నిరుపేదలకు అశనిపాతంగా మారుతోంది.

subsidized loans
రాయితీ రుణాలు

తరాలుగా అనుభవిస్తున్న పేదరికాన్ని జయించి.. సొంత కాళ్లపై నిలబడాలన్న ఆకాంక్షతో లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారికి కార్పొరేషన్లు ఇచ్చే రాయితీ రుణాలు సువర్ణావకాశం. ప్రభుత్వం వివిధ పథకాల కింద ఆర్థిక సాయం, ఆరోగ్య పథకాలు, వృద్ధులకు సామాజిక భద్రతా పింఛన్లు, విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్నా.. రాయితీ రుణాలు తిరుగులేని ఆర్థిక దన్ను అందిస్తాయి. వాటిని పొందిన కుటుంబాల దశ తిరిగినట్టే. ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో వేల కుటుంబాలు తలెత్తుకుని జీవిస్తున్నాయి. ఇలాంటి రాయితీ రుణ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసింది. 2019-20 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాల జారీని నిలిపేసిన ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ)లు అందించే రుణాలకూ మోకాలడ్డింది. కేంద్రం ఇచ్చే నిధులకు తన వంతు వాటా కలిపి రుణాలివ్వకుండా.. దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళం పాడింది.ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీలు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలిస్తాయి. ఇవి లబ్ధిదారులకు త్వరగా అందుతాయి. ఇలాంటి పథకాలను ప్రభుత్వం నిలిపేయడం వేలాది నిరుపేదలకు అశనిపాతంగా మారుతోంది.

వేల కుటుంబాలకు నష్టం
ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీలు 2015-16 నుంచి 2018-19 వరకూ రాష్ట్రంలో దాదాపు 23 వేల ఎస్సీ, ఎస్టీలకు రూ.515 కోట్లకు పైనే సాయం అందించాయి. రెండేళ్ల నుంచి వీటిని నిలిపేయడంతో ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వేల మంది మంచి అవకాశాలను కోల్పోతున్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి రూ.200 కోట్ల వరకూ సాయం వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఇప్పుడది అందని ద్రాక్షగా మారింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎన్‌టీఎఫ్‌డీసీ టర్ము రుణాల కింద రాష్ట్రానికి రూ.6.54 కోట్లు కేటాయించింది. ఈ నిధులకు రాయితీ సొమ్ము కలిపి రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ట్రైకార్‌) రుణాలుగా ఇవ్వాలి. బడ్జెట్‌లో రాయితీ చెల్లింపులకు ప్రభుత్వం నిధులు కేటాయించనందున రుణాన్ని 90%కు పెంచుతూ ట్రైకార్‌ ఎండీ జిల్లా అధికారులకు సర్క్యులర్‌ జారీ చేశారు. లబ్ధిదారు వాటాను 5 నుంచి.. 10 శాతానికి పెంచారు. రాయితీ లేకపోవడం, రుణం పెరగడంతో యూనిట్ల ఏర్పాటుకు గిరిజనులు ముందుకు రాలేదు. దీంతో ప్రక్రియనే నిలిపేయాల్సి వచ్చింది. గత ఐదేళ్లలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీలు కేటాయించిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఏటా చెల్లించాల్సిన సొమ్ము రూ.100 కోట్లకు మించి ఉండదని, ఈ వ్యయాన్ని భరించలేక ప్రభుత్వం పథకాలను నిలిపేస్తోందని ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

...

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సాయమెక్కడ?
గతంలో ఎస్సీ, ఎస్టీలకు ఇతర అన్ని వర్గాలకు ఇచ్చే పథకాలతో పాటు.. మరింత ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక పథకాలు ఉండేవి. కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, భూమి కొనుగోలు పథకం, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌, విదేశీవిద్య, సివిల్స్‌ ఉచిత శిక్షణ వంటి పథకాల ద్వారా మరింత దన్ను ఉండేది. ప్రస్తుతం ఆ స్థాయి భరోసా కరవైంది. అన్ని వర్గాలకు ఉన్న పథకాలే తప్ప.. ప్రత్యేకించి ప్రభుత్వ చేయూత కరవైంది. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ మినహా ప్రత్యేక పథకాలు అమలుకావట్లేదు.

దశాబ్దాల రుణ చరిత్ర
ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక చేయూత అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం 1989లో జాతీయ ఎస్సీ, ఎస్టీ ఆర్థికాభివృద్ధి సంస్థను (ఎన్‌ఎస్‌సీఎస్‌టీఎఫ్‌డీసీ) ఏర్పాటు చేసింది. దీన్ని 2001లో రెండుగా విభజించి వేర్వేరుగా రుణాలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 2012-13, 2013-14లో వీటిని అమలు చేయలేదు. ఫలితంగా అప్పట్లో రుణాలివ్వలేకపోయారు. 2015-16 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణ ప్రక్రియను పునరుద్ధరించింది.

రెండేళ్లుగా విధుల్లేని కార్పొరేషన్లు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా కార్పొరేషన్లు పూర్తిగా విధుల్లేని సంస్థలు మారాయి. జాతీయ సంస్థలు ఇచ్చే రుణాల్ని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు అమలుచేసేవి. సొంతంగానూ రుణాలిచ్చేవి. కేంద్రసంస్థలతో పాటు రాష్ట్ర కార్పొరేషన్లు రుణ జారీని నిలిపేశాయి. ‘2019 నుంచి కార్పొరేషన్‌ తరఫు కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. ఏదైనా పథకానికి సాయం విడుదలయ్యే తేదీకి ముందురోజు నిధులు జమవుతాయి. ఆ మర్నాడే అవి ఖాళీ అవుతాయి. రెండేళ్లుగా రేషన్‌ వాహనాలు, వివిధ పథకాల నిధులు మినహా కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలేవీ నిర్వహించడం లేదు’ అని ఓ కార్పొరేషన్‌ ఎండీ చెప్పారు.

రుణం ఇచ్చే రంగాలు
తోళ్ల శుద్ధి, ఆటోరిక్షా, కారు, పాడి పరిశ్రమ, కుటీర పరిశ్రమలు, బేకరీ వస్తువులు, పచ్చళ్ల తయారీ, కొవ్వొత్తులు, పచ్చళ్ల తయారీ, పిండిమిల్లు, చెప్పుల దుకాణం, ఫర్నిచర్‌ తయారీ, టైలరింగ్‌ దుకాణం, టెంట్‌హౌస్‌, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మందుల షాపు, హార్డ్‌వేర్‌ షాపు, ఇంటర్నెట్‌, డీటీపీ, బ్యూటీపార్లర్‌, చీపుర్ల తయారీ.

ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవాలి

మామిడి సుదర్శన్

రుణాలు నిలిపేయడంతో ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి అవకాశాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాయితీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. లిడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలోని 12 తోళ్ల ఉత్పత్తి పార్కులకు నిధులను కేటాయించి చర్మకారులను ఉపాధి కల్పించాలి. - మామిడి సుదర్శన్‌, దళిత్‌ ఇండస్ట్రియల్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు

రెండేళ్లుగా ఎదురుచూపులే..

నీలం నాగేంద్ర

ర్నిచరు దుకాణం కోసం రెండేళ్ల క్రితం ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా. పూచీకత్తులు, బాండు పేపర్లకు రూ.20 వేల ఖర్చయ్యింది. రుణం కోసం అధికారులను సంప్రదిస్తే బడ్జెట్‌ లేదని చెబుతున్నారు. రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్నా.- నీలం నాగేంద్ర, ఒంగోలు

పథకాలను నిలిపేయడం దుర్మార్గం

ఆండ్ర మాల్యాద్రి

స్సీల అభివృద్ధి కోసం కేంద్రం తెచ్చిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేయడం దుర్మార్గం. ఇది పేదలకు అన్యాయం చేయడమే. ప్రభుత్వం భూమి కొనుగోలు వంటి పథకాలను నిలిపేసింది. జాతీయ ఎస్సీ, ఎస్టీ ఆర్థికాభివృద్ధి సంస్థల రుణాలను అమలు చేయాలి. - ఆండ్ర మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం

ఎస్టీలకు అన్యాయం చేయడమే

పెంచలయ్య

రాయితీ రుణ పథకాలను నిలిపేయడంతో గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. కేంద్రం రుణం ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం సరికాదు. ఇది ఎస్టీలకు అన్యాయం చేయడమే. - పెంచలయ్య, ఏపీ యానాదుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి

గర్వంగా బతుకుతున్నా

రాయితీ రుణపథకం కింద 2018లో ఇన్నోవా కారు మంజూరైంది. కారును ఓ ప్రభుత్వ కార్యాలయంలో బాడుగకు ఇవ్వగా నెలకు రూ.65వేల వరకూ వస్తోంది. వీటితో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నెలవారీగా కారు వాయిదాలు చెల్లిస్తున్నా. గర్వంగా బతుకుతున్నాను. - పి విజయ్‌కుమార్‌, బాపట్ల

చెల్లించాల్సిన వాటా తక్కువే..

ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీలు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా రాయితీ రుణాలు కేటాయిస్తాయి. టర్ములోను పేరుతో గరిష్ఠంగా రూ.50 లక్షలు, సూక్ష్మ రుణం కింద రూ.3 లక్షల వరకూ ఇస్తాయి. రాయితీ గరిష్ఠంగా 50% ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర సంస్థలు ఇచ్చే 60% రుణానికి రాష్ట్రం 35% రాయితీని జోడించి ఇవ్వాలి. లబ్ధిదారుడి వాటా 5% చెల్లించాలి. ఉదాహరణకు పాడి పరిశ్రమ ఏర్పాటుకు రూ.10 లక్షల వ్యయమైతే జాతీయ సంస్థలు రూ.6 లక్షల రుణం ఇస్తాయి. వీటికి రాష్ట్రం రాయితీ కింద రూ.3.5 లక్షలు జోడిస్తుంది. లబ్ధిదారు రూ.50 వేలు చెల్లించాలి. మొత్తం వ్యయంలో లబ్ధిదారుడు జాతీయ సంస్థ ఇచ్చే రుణాన్నే వాయిదాల్లో చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం చెల్లించక్కర్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వకుండా పూర్తిగా పథకాలనే నిలిపేస్తోంది.

...

ఇదీ చదవండి

Jagan bail cancel petition: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.