ETV Bharat / city

అమరావతి సౌధంలో.. పెను విధ్వంసం..!

author img

By

Published : Jun 4, 2022, 5:10 AM IST

Updated : Jun 4, 2022, 8:08 AM IST

నవ్యాంధ్ర ఆశల సౌధం అమరావతి కుప్పకూలి మూడున్నరేళ్లు దాటింది..! అప్పటి వరకూ రాష్ట్రానికి సరికొత్త వెలుగులు పంచేలా కనిపించిన రాజధానిని.. ఓ గ్రహణం మింగేసింది..! అంతే.. నాటి నుంచి నేటి వరకూ రాష్ట్రం అభివృద్ధి ప్రసరించని అంధకారంలోనే మగ్గిపోతోంది..! భవిష్యత్ కనిపించక దారీతెన్నూలేని ప్రయాణం కొనసాగిస్తోంది..! ఈ పరిస్థితిని మార్చేందుకు.. అమరావతిని నిలుపుకునేందుకు.. అలుపెరగక.. వెనుదిరగక.. రాజీలేని పోరాటం సాగిస్తున్నారు రైతులు..! అమరావతిలో సృష్టించిన పెను విధ్వంసాన్ని తలుచుకుంటూ.. బాధను పంటి బిగువున భరిస్తూ.. ఉద్యమిస్తున్నారు. ఈ మహా ఉద్యమానికి నేటితో 900 రోజులు నిండాయి..! న్యాయస్థానంలో దక్కిన విజయంతో.. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్న ఉద్యమకారులు.. రాష్ట్రానికి పట్టిన గ్రహణాన్ని వదిలించేంత వరకూ విశ్రమించేది లేదని శపథం చేస్తున్నారు.

అమరావతి ఉద్యమానికి 900 రోజులు.. 'హైకోర్టు తీర్పు-సర్కార్‌ తీరు' పేరిట నేడు సదస్సు
అమరావతి ఉద్యమానికి 900 రోజులు.. 'హైకోర్టు తీర్పు-సర్కార్‌ తీరు' పేరిట నేడు సదస్సు

సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం.. రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి.. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న రాష్ట్ర రాజధాని నగరంలో చిన్న స్థలమో, ఫ్లాటో ఉంటే బాగుండునని ఎందరో ఆకాంక్షిస్తున్నారు. ఆ సమయంలో రాజధానిలో ‘హ్యాపీనెస్ట్‌’ ప్రాజెక్టును సీఆర్‌డీఏ ప్రకటించింది. 2018 నవంబరు 9న 300 ఫ్లాట్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు నిర్వహించింది. ఆశావహులంతా ఉదయం నుంచే కంప్యూటర్లు ఆన్‌ చేసి పెట్టుకున్నారు. అటు సీఆర్‌డీఏ కార్యాలయానికీ జనం పోటెత్తారు. 300 ఫ్లాట్లకు ఒకానొక సమయంలో 1.10 లక్షల మంది పోటీపడటంతో సర్వర్‌ కూడా డౌనైపోయింది. హ్యాపీనెస్ట్‌లో ఫ్లాట్లు బుక్‌ చేసుకున్నవారిలో తెలుగు రాష్ట్రాలవారే కాదు ప్రవాసాంధ్రులూ ఎక్కువ మందే ఉన్నారు. 2018 డిసెంబరులో మిగతా 900 ఫ్లాట్లకు బుకింగ్‌ నిర్వహిస్తే.. అవీ కొన్ని గంటల్లోనే బుక్‌ అయిపోయాయి. రాజధాని నిర్మాణ పనులు మొదలయ్యాక అక్కడ తలపెట్టిన తొలి ప్రాజెక్టు హ్యాపీనెస్టే. అయినా అంత డిమాండ్‌ వచ్చింది.

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాల ధరలు 2018 నాటికి చదరపు గజం రూ.25-30 వేలు పలుకుతున్నాయి. నేలపాడు వంటి ప్రాంతాల్లోనూ చ.గజం ఒక దశలో రూ.39 వేల వరకు వెళ్లింది. లేఅవుట్‌ను అభివృద్ధి చేయకముందే వాటిలో స్థలాలు కొనేందుకు అంత తీవ్రమైన పోటీ నెలకొంది.

..అప్పట్లో రాజధాని అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ ఏ స్థాయిలో ఉండేదో చెప్పే ఉదాహరణలివి.

.

అదే అమరావతిలో ఇప్పుడు..
* ఇప్పటికే లేఅవుట్‌గా అభివృద్ధి చెందిన అమరావతి టౌన్‌షిప్‌లో 29 స్థలాలు విక్రయించేందుకు సీఆర్‌డీఏ మంగళవారం ఈ-వేలం నిర్వహించింది. చదరపు గజం కనీస ధర రూ.17,800గా నిర్ణయించింది. 15 మంది దీని గురించి వివరాలు తెలుసుకుంటే, అందులో నలుగురు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. చివరికి బిడ్‌ దాఖలు చేసింది ఒక్కరంటే ఒక్కరే.

* అమరావతి టౌన్‌షిప్‌లోనే గతంలో లేఅవుట్‌ వేయని భూముల్లో సీఆర్‌డీఏ జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్‌ పేరుతో ఎంఐజీ లేఅవుట్‌ ప్రాజెక్టు తలపెట్టింది. అక్కడా చ.గ. రూ.17,800గా నిర్ణయించింది. విపరీతమైన డిమాండ్‌ వస్తుందనుకుంది. 528 స్థలాల్ని అమ్మకానికి ఉంచితే 149 మంది మాత్రమే డౌన్‌పేమెంట్‌ చెల్లించారు.

వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతి ఎలా సర్వనాశనం అయ్యిందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు.
మూడేళ్లలో రూ. లక్షకోట్ల సంపద ఎలా ఆవిరైంది?
సీఆర్‌డీఏ ఆదాయానికి ఎలా గండి పడింది?
అమరావతి టౌన్‌షిప్‌లలో లేఅవుట్‌లకు ఆదరణ ఎందుకు పడిపోయింది?

ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అమరావతి ఆశలను చిదిమేయడమే కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకూ శరాఘాతమైంది. కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అమరావతికి ఎంతో కష్టపడి తెచ్చిన బ్రాండ్‌ ఇమేజ్‌ మొత్తం ఒక్కదెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది. అమరావతితోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పూర్తిగా దెబ్బతింది. అమరావతిని శాసన రాజధానిగా చేసి, అక్కడ శాసనసభను మాత్రమే ఉంచుతామని 2019 డిసెంబరులో జగన్‌ చేసిన ప్రకటన... కొన్ని వేల జీవితాల్ని రోడ్డున పడేసింది. అమరావతితో పాటు, విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారికి పక్కనే భారీ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టినవారు, వాటిలో ఫ్లాట్లు కొనుక్కున్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు దిక్కుతోచనివారయ్యారు. వచ్చే ఆదాయంలో రూపాయి రూపాయి కూడబెట్టి, నలుగురైదుగురు కలసి రాజధానిలో చిన్న స్థలం కొనుక్కున్న సామాన్య ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర వర్గాలవారు తీవ్రంగా నష్టపోయారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అమరావతి పనులు నిలిపివేయడం, హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో అమరావతి ఒక శాపగ్రస్తలా మిగిలిపోయింది. ఆ ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్థిరాస్తి రంగం కుదేలయింది. రాజధాని పనులు ముమ్మరంగా సాగుతున్న కాలంతో పోలిస్తే.. గడిచిన రెండేళ్లలో ఈ రెండు జిల్లాల్లో లేఅవుట్‌లు, భవన నిర్మాణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఛార్జీల రూపంలో సీఆర్‌డీఏకి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. ఇక్కడ స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టినవారు, ఇంకా పెట్టుబడులతో వద్దామనుకున్నవారు జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించగానే పెట్టెబేడా సర్దుకుని హైదరాబాద్‌, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులూ నిలిచిపోయాయి. అప్పటికే నిర్మాణాలు పూర్తి చేసినవారు ఫ్లాట్లు అమ్ముకోలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా తంటాలు పడుతున్నారు.

.

లక్షల కోట్ల సంపద ఆవిరి : రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకున్నవారికి... ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న అమరావతి ఆశాకిరణంలా కనిపించింది. రాజధాని ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి దశలోనే పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు... విజయవాడ, గుంటూరు మధ్య జాతీయ రహదారికి అటూ ఇటూ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతమంతా కలసిపోయి ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్న భావనతో అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణం తలపెట్టారు. దీంతో రాజధాని అమరావతితోపాటు, దాని చుట్టుపక్కల 50 కి.మీ.ల దూరం వరకు భూముల ధరలు పెరిగాయి. అప్పటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 80 శాతంపైగా సీఆర్‌డీఏ పరిధిలోనే ఉండటంతో అన్ని ప్రాంతాల్లోనూ స్థలాలకు డిమాండ్‌ పెరిగి.. ఎక్కడికక్కడ కొత్త లేఅవుట్‌లు వచ్చాయి.

* రాజధానిలో రైతులకు ఇచ్చిన 64 వేల స్థలాల్లో సుమారుగా 4.5 కోట్ల చదరపు గజాల స్థలం ఉంది. అప్పటి ధరల ప్రకారం చ.గజం స్థలం ధర రూ.25 వేలు వేసుకున్నా, రైతుల దగ్గరున్న స్థలాల విలువ రూ.1.25 లక్షల కోట్లు. ఇప్పుడు దానిలో నాలుగో వంతు ధర కూడా పలకడం లేదు. అంటే సుమారు రూ.90 వేల కోట్ల సంపద ఆవిరైనట్టే.

* రైతులకు స్థలాలు, ప్రధాన మౌలిక వసతులకు అవసరమైన భూమి తీసేయగా, సీఆర్‌డీఏ దగ్గర మరో 10 వేల ఎకరాలు ఉంది. రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే ఇప్పుడక్కడ ఎకరం కనీస ధర రూ.10 కోట్లయినా ఉండేదని అంచనా. ఆ ప్రకారం చూసినా ఆ భూమి విలువ రూ.లక్ష కోట్లపైనే. దాని విలువా పడిపోయింది.

* రాజధాని చుట్టుపక్కల వివిధ వర్గాలవారు చేపట్టిన నిర్మాణాలు, వేసిన లేఅవుట్లపై పెట్టిన పెట్టుబడి విలువా తరిగిపోయింది. ‘ప్రణాళిక ప్రకారం రాజధాని అభివృద్ధి జరిగితే ఇప్పటికే అక్కడ చ.గజం స్థలం రూ.50 వేలకు చేరేది’ అని వెంకటపాలెం గ్రామానికి చెందిన సుధాకర్‌ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఆర్‌డీఏ ఆదాయానికి భారీగా గండి : రాజధాని పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు సీఆర్‌డీఏ ఒక వెలుగు వెలిగింది. సీఆర్‌డీఏ పరిధిలో కొత్త లేఅవుట్‌ల అభివృద్ధి, భవన నిర్మాణాలు జోరుగా సాగడంతో బాగా ఆదాయం వచ్చేది. 2016 నుంచి పెరుగుతూ వచ్చిన ఆదాయం 2020 నుంచి ఒక్కసారిగా పడిపోయింది. అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణతోనైనా భారీగా ఆదాయం వస్తుందని సీఆర్‌డీఏ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. స్థలాలకు డిమాండే లేకపోవడంతో, వాటిని క్రమబద్ధీకరించుకోవాలన్న ఆలోచననూ చాలా మంది పక్కన పెట్టేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 116, వ్యక్తిగత స్థలాల క్రమబద్ధీకరణకు 5,501 దరఖాస్తులు మాత్రమే వచ్చాయంటే స్పందన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫలితం ఇదీ : మూడు రాజధానుల నిర్ణయం ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ఇప్పుడు ప్రభుత్వానికీ అర్థమవుతోంది. కోర్టు ఆదేశాల మేరకు రాజధానిలో రైతులకు లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు రూ.3 వేల కోట్ల రుణం కావాలని సీఆర్‌డీఏ ఎన్నిసార్లు అడిగినా బ్యాంకులు సానుకూలంగా స్పందించడం లేదు. దీంతో అప్పటి వీజీటీఎం-ఉడా అమరావతి టౌన్‌షిప్‌లో 2000వ సంవత్సరంలో వేసిన లేఅవుట్‌లో ఖాళీగా ఉన్న 331 స్థలాల్ని విక్రయించడం ద్వారా కొంత సొమ్ము సమకూర్చుకోవాలని సీఆర్‌డీఏ భావించింది. రూ.300 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. భారీగా ప్రచారం నిర్వహించి, తొలి లాట్‌లో 29 స్థలాల్ని వేలం వేయగా ఒకే ఒక్కరు బిడ్‌ దాఖలు చేశారు. సీఆర్‌డీఏ చ.గజం కనీస ధర రూ.17,800గా నిర్ణయించింది. కనీసం రూ.100 పెంచి బిడ్‌ దాఖలు చేయాలన్న నిబంధన మేరకు చ.గజం రూ.17,900 చొప్పున ఆ వ్యక్తి స్థలం దక్కించుకున్నారు. వాటిలో మిగిలిన స్థలాలతోపాటు, మరో 25 స్థలాలకు ఈ నెల 6న ఈ-వేలం నిర్వహిస్తున్నారు.

* అమరావతి టౌన్‌షిప్‌ కోసం గతంలో వీజీటీఎం-ఉడా సేకరించిన భూమిలో లేఅవుట్‌ వేయని ప్రాంతాన్ని స్మార్ట్‌టౌన్‌షిప్‌గా సీఆర్‌డీఏ అభివృద్ధి చేస్తోంది. దీని పనుల్ని ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ప్రారంభించారు. ఏపీ సచివాలయానికి 10 కి.మీ.లు, హైకోర్టుకు 15 కి.మీ., ఎయిమ్స్‌కు 5 కి.మీ., ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి 4 కి.మీ.లు, విట్‌కి 12 కి.మీ., ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి 9 కి.మీ., ఆంధ్రా క్రికెట్‌ స్టేడియంకు 500 మీటర్ల స్వల్ప దూరంలోనే ఈ లేఅవుట్‌ ఉందని, ఇక్కడ స్థలం కొనుక్కోవడం అద్భుత అవకాశమని రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు తీసిపోని రీతిలో ప్రభుత్వం ప్రచారం చేసింది. మొత్తం 80.46 ఎకరాల్లో 528 స్థలాలు విభజిస్తే.. దరఖాస్తు చేసినవారిలో 149 మంది మాత్రమే డౌన్‌పేమెంట్‌ కట్టారు.

* వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు నిలిపివేసి.. మంగళగిరి, తాడేపల్లిలను కలిపి కార్పొరేషన్‌గా చేసింది. అమరావతి టౌన్‌షిప్‌ మంగళగిరికి సమీపంలోనే ఉంది. అక్కడేస్థలాలు కొనేందుకు రావడం లేదంటే ఎంత విధ్వంసం జరిగిందో అర్థమవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఈ పరిస్థితి కారణమైన ప్రభుత్వం దిగి వచ్చే వరకూ విశ్రమించేది లేదని అమరావతి రైతులు నినదిస్తున్నారు. ప్రభుత్వం కోర్టు నిర్ణయాన్ని అమలు చేసి, రాజధాని నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు 900వ రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత.. ఉద్యమ పంథా కొత్త రూపు తీసుకొంది. "బిల్డ్ అమరావతి "నినాదంతో రాజధాని ఐకాస ముందుకెళ్తోంది. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తోంది.

.

ఇదీ చూడండి..

విషవాయువు కలకలం.. ఊపిరాడక స్పృహ తప్పిన మహిళలు

Last Updated :Jun 4, 2022, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.