ETV Bharat / city

రేపే తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఇవి తెలుసుకున్నారా?

author img

By

Published : Oct 15, 2022, 12:46 PM IST

Group1 preliminary exam to be held tomorrow: రేపు తెలంగాణలో జరిగే గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లను టీఎస్​పీఎస్సీ పూర్తి చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్​ అమల్లో ఉంటుందని కమిషన్​ సూచించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చేసిన మార్పులను గ్రహించాలని కోరారు. జిరాక్సు, ప్రింటర్‌, ఇంటర్నెట్‌ కేంద్రాలను మూసివేయనున్నట్లు వెల్లడించింది.

Group1 preliminary exam
గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్ష

Group1 preliminary exam to be held tomorrow: తెలంగాణలో ఈ నెల 16న(ఆదివారం) నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. తెలంగాణ తొలి గ్రూప్‌-1 అయిన ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న 503 పోస్టులకు దాదాపు 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాల ఏర్పాటుతో పాటు, పకడ్బందీ చర్యలు చేపట్టాలని యంత్రాంగానికి కమిషన్‌ సూచించింది. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌తో పాటు జిరాక్సు, ప్రింటర్‌, ఇంటర్నెట్‌ కేంద్రాలను మూసివేయనున్నట్లు వెల్లడించింది.

ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో కీలక మార్పులు చేసిన కమిషన్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరి బయోమెట్రిక్‌ వివరాలు నమోదు చేయనుంది. ఆ సమయంలో రద్దీ తలెత్తకుండా ఉదయం 8.30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తున్నామని, చివరి నిమిషం వరకు వేచిచూడకుండా ముందుగానే రావాలని కమిషన్‌ ఇప్పటికే సూచించింది. ప్రిలిమ్స్‌ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద టీఎస్‌పీఎస్సీ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. పరీక్షకు వచ్చే అభ్యర్థులనే అక్కడ అనుమతించాలని నిర్ణయించింది.

సూచనలు.. చెప్పులే ధరించాలని, గోరింటాకు, టాటూలతో అలంకరణలు వద్దని ఇప్పటికే హాల్‌టికెట్‌లో పలు సూచనలు చేసింది. చేతికి వాచీలు పెట్టుకురావద్దని సూచించింది. పరీక్ష కేంద్రంలో ప్రతి అరగంటకు గంట మోగిస్తారని, తద్వారా అభ్యర్థులు సమయం తెలుసుకోవచ్చని తెలిపింది. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే కమిషన్‌ నిర్వహించే పరీక్షలు రాయకుండా డీబార్‌ చేస్తామని టీఎస్‌పీఎస్సీ హెచ్చరించింది. ఓఎంఆర్‌ షీట్లో గడులు నింపేటప్పుడు, జవాబుల సర్కిళ్లు బబ్లింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. హాల్‌టికెట్‌ నంబరు, పరీక్ష పత్రం, పరీక్ష కేంద్రం కోడ్‌ల తాలూకూ గడులు నింపకున్నా, సంతకం చేయకపోయినా సదరు ఓఎంఆర్‌ను మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

భూపాలపల్లి కలెక్టర్‌కు కమిషన్‌ ఛైర్మన్‌ అభినందన.. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులకు 41 పేజీలతో కూడిన నిబంధనలను టీఎస్‌పీఎస్సీ అందించింది. వీటిపై ఆన్‌లైన్‌ క్విజ్‌ ప్రశ్నావళిని భూపాలపల్లి కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా రూపొందించారు. దాని సాయంతో తమ జిల్లాలోని చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లకు అవగాహన కల్పించారు. కలెక్టర్‌ ప్రయత్నం తెలుసుకున్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. మిగతా కలెక్టర్లకు ఆన్‌లైన్‌ క్విజ్‌ ప్రశ్నావళిని పంపించారు.

ఇప్పటికీ 59వేల మంది దూరం.. గ్రూప్‌-1 పరీక్షకు 3.8లక్షల మంది దరఖాస్తు చేయగా, అభ్యర్థుల హాల్‌టికెట్లను కమిషన్‌ వెబ్‌సైట్లో ఉంచింది. శుక్రవారానికి 3.21లక్షల మంది వీటిని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇంకా 59వేల మంది దూరంగా ఉన్నారు. వీరికి ఇప్పటికే పరీక్ష సంబంధిత సమాచారాన్ని కమిషన్‌ పంపించింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ఆరంకెల కోడ్‌తో బహుళ సిరీస్‌ ప్రశ్నపత్రాలు ఇవ్వనుంది. వీటిలోని జవాబులు ఒకేలా కాకుండా జంబ్లింగ్‌ అవుతాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.