ETV Bharat / city

తెలంగాణలో కాంగ్రెస్ ఆందోళన ఉద్రిక్తం.. రేవంత్ సహా పలువురి అరెస్ట్!

author img

By

Published : Jun 16, 2022, 2:22 PM IST

congress protest at raj bhavan : కాంగ్రెస్‌ రాజ్‌భవన్‌ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు కొనసాగిస్తోంది. ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్‌భవన్ ముట్టడించేందుకు... నేతలు ప్రయత్నించగా... నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డుపై వాహనాలకు నిప్పు పెట్టిన కాంగ్రెస్ నేతలు... కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నేతలు ర్యాలీగా... కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి... ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

congress protest at raj bhavan
తెలంగాణ రాజ్​భవన్ వద్ద రణరంగం

congress protest at raj bhavan : రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం నుంచే ఆందోళనలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులు... రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు. ఖైరతాబాద్‌ వద్ద ఆందోళనలకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు... భాజపా సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసి.. ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టారు. బస్సు పైకి ఎక్కి మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఖైరతాబాద్ కూడలి వద్దకు భారీగా కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరావడంతో... రాకపోకలు స్తంభించాయి. అనంతరం అధిక సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు... రాజ్‌భవన్‌ వైపు నేతలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు- నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాగ్వాదంలో పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. భాజపా సర్కార్‌ కుట్రపూరితంగానే... రాహుల్‌గాంధీని ఈడీ విచారిస్తోందని... నేతలు ఆరోపించారు.

తెలంగాణ రాజ్‌భవన్‌ వైపు ర్యాలీగా వెళ్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి, సునీతారావు, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డిని గోషామహల్ పీఎస్‌కు తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మహేష్ కుమార్‌ను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అరెస్టు సమయంలో పోలీసులు, కాంగ్రెస్‌ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాహనంలోకి ఎక్కించేటపుడు భట్టి విక్రమార్కను వెస్ట్‌జోన్‌ డీసీపీ నెట్టివేశారు. డీసీపీని అదే స్థాయిలో నేత భట్టి తిరిగి నెట్టారు. మరోవైపు కాంగ్రెస్ మహిళా నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసు కాలర్ పట్టుకుని లాగారు. అనంతరం ఆమెను పోలీసులు వాహనంలో పోలీస్ స్టేషన్​కు తరలించారు.

'మహిళా కాంగ్రెస్ నేతలపై పోలీసుల తీరు సక్రమంగా లేదు. ప్రజాస్వామ్యం కంఠం నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. నాపై చేయి వేస్తే పార్లమెంట్ వరకు ఈడ్చుకెళ్తా. రాజ్‌భవన్ రహదారిపై వెళ్లే హక్కు నాకు ఉంది.' రేణుకా చౌదరి

రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని తప్పుపట్టిన నేతలు... తమ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రేపు రాష్ట్రంలోని అన్ని కేంద్ర కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.