ETV Bharat / city

గవర్నర్‌ను అడ్డుపెట్టుకునే... రాజ్యాంగ వ్యవస్థలపై దాడి: అచ్చెన్నాయుడు

author img

By

Published : Mar 7, 2022, 4:55 PM IST

Updated : Mar 8, 2022, 5:28 AM IST

గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని రాజ్యాంగ వ్యవస్థలన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అందుకే ఆయన ప్రసంగాన్ని వినాల్సిన అవసరం లేదనే భావనతో బహిష్కరించామని స్పష్టం చేశారు. బొత్స వ్యాఖ్యలపై స్పందించిన అచ్చెన్నాయుడు.. ఏపీ రాజధాని హైదరాబాదే అయితే.. అక్కడికే వెళ్లి పాలించండని మండిపడ్డారు.

Achennaidu
Achennaidu

రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని రాజ్యాంగ వ్యవస్థలన్నింటిపై దాడి చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అందుకే ఆయన ప్రసంగాన్ని వినాల్సిన అవసరం లేదనే భావనతో బహిష్కరించామని స్పష్టం చేశారు. సోమవారం సభ ముగిసిన అనంతరం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘గడిచిన మూడేళ్లుగా ప్రభుత్వం.. న్యాయ వ్యవస్థపై, ఎన్నికల సంఘంపై, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌పై, రాష్ట్ర శాసనమండలిలో ఛైర్మన్‌పై దాడి చేసినా రాష్ట్ర పెద్దగా గవర్నర్‌ సీఎంని గానీ, ప్రభుత్వాన్ని గానీ కనీసం ప్రశ్నించలేదు. గవర్నర్‌ సంతకంతోనే ఆయన పేరు మీద.. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చినా స్పందించలేదు. ఎన్నికల కమిషనర్‌ను తొలగించి ఇష్టానుసారం నియమించినా పట్టించుకోలేదు. రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తే దానిపైనా గవర్నర్‌ మాట్లాడలేదు. రాష్ట్రంలో జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనలను గవర్నర్‌కు వివరించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా అన్ని ప్రయత్నాలు చేశాం. కాళ్లు అరిగేటట్లు ఆయన కార్యాలయానికి తిరిగాం. కలిసేందుకు అవకాశమివ్వకపోతే కార్యాలయ గోడలకు వినతిపత్రాలు అంటించాం. కార్యదర్శికీ ఇచ్చాం. అప్పుడప్పుడూ అవకాశమిస్తే అన్ని ఆధారాలతో వివరించాం. ఇన్ని చేసినా కనీసం ఒక్కసారైనా గవర్నర్‌ సీఎంను పిలిచి మాట్లాడారా? పైగా ఆయన ప్రసంగమంతా అవాస్తవాలతో నింపారు. అందుకే దాన్ని బహిష్కరించి, బయటికి వచ్చాం’ అని వెల్లడించారు.

మేం చేసింది చట్టం కాదా?

‘శాసనసభ అధికారాలు, చట్టాల గురించి వైకాపా నేతలు మాట్లాడుతున్నారు. రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేస్తూ శాసనసభలో మేం చేసింది చట్టం కాదా? సీఆర్‌డీఏ చట్టాన్ని చంద్రబాబు ఇంట్లో చేశామా? మీరు గౌరవిస్తున్నామనే శాసనసభలోనే 5 కోట్ల ఆంధ్రుల సాక్షిగా చట్టం చేశాం కదా? అలాంటి చట్టాన్ని రాత్రికి రాత్రి రద్దు చేస్తే ముఖ్యమంత్రిని కనీసం ప్రశ్నించకుండా గవర్నర్‌ సంతకం పెట్టేస్తారా? మూడు రాజధానుల బిల్లు పెడితే దాన్ని సమర్థిస్తారా? ఈ బిల్లు విషయంలో గవర్నర్‌ కూడా తప్పు చేశారు. మూడు రాజధానుల బిల్లును హైకోర్టు రద్దు చేయడంతో ఆ విషయం స్పష్టమైంది’ అని అన్నారు.

ప్రజల కోసమే బాధను దిగమింగి సభకు వచ్చాం..

‘వైకాపా ప్రజాప్రతినిధుల తీరుతో శాసనసభకు రాకూడదనే అనుకున్నాం. వ్యక్తిగతంగా మమ్మల్ని, మా అధినేత చంద్రబాబును దూషించారు. అయినా భరించాం. కుటుంబాన్ని కూడా దూషించినప్పుడు సభకు రాకూడదనే నిర్ణయించుకున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా 40 ఏళ్లుగా తెదేపా ప్రజల పక్షాన పోరాడుతోంది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ లేవు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, సామాన్యులు.. ఇలా అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల కోసమే.. మా బాధ, ఆవేదన దిగమింగుకుని సభకు వచ్చాం. ప్రజాసమస్యల్ని ప్రస్తావించేందుకు సభలో సమయమివ్వాలని బీఏసీలో అడిగాం. వారు చెప్పిందే మాట్లాడాలనే ధోరణిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తుంటే.. మంత్రులు వత్తాసు పలుకుతున్నారు. 2304 జీవోను తీసుకొచ్చి మీడియాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని ఛానళ్లనే సభలోకి అనుమతిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

బొత్స వ్యాఖ్యలపై మాట్లాడితే సమయం వృథా..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాదేనని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారని విలేకరులు అచ్చెన్నాయుడితో ప్రస్తావించారు. ‘బొత్స గురించి మాట్లాడటమంటే సమయం వృథానే. హైకోర్టు తీర్పు ఇచ్చాక అలా మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. హైదరాబాదే రాజధాని అనుకుంటే వారిని వెళ్లిపోమనండి. ఇప్పటికే అక్కడున్న ఏపీ ఆస్తులన్నీ తెలంగాణకు రాసిచ్చేశారు. మేం మా రాష్ట్రం నుంచి పాలన చేసుకోవాలనే అష్టకష్టాలు పడ్డాం. మళ్లీ హైదరాబాదే రాజధాని అంటే దానికేం చెబుతాం’ అని ఆయన మండిపడ్డారు.

ఆయనేనా పెద్దాయన? చంద్రబాబు కాదా?

‘మేం నిరసన తెలిపితే పెద్దాయనంటూ గవర్నర్‌ వయసు గురించి మాట్లాడుతున్న వైకాపా ప్రజాప్రతినిధులకు...చంద్రబాబు వయసెంతో తెలీదా? 14 ఏళ్లు సీఎంగా.. 40 ఏళ్ల రాజకీయ జీవితమున్న ఆయన్ను నిండు సభలో ఎంతగా అవమానించారో మరిచిపోయారా? చివరికి ఆయన భార్యను కూడా అవహేళన చేసిన విషయం మరిచిపోతే ఎలా? చంద్రబాబు డ్రామా ఆడారని, సభలో ఎక్కడా దూషించలేదని.. సీఎం నుంచి మంత్రుల వరకు అందరూ అంటున్నారు. వైకాపా నేతలు సభలో ఆనాడు మాట్లాడిన మాటల వీడియోల్ని బయటపెట్టాం. చూడలేదా? అవసరమైతే మళ్లీ ఒకసారి స్పీకర్‌కు పంపిస్తాం’ అని పేర్కొన్నారు.

రాజధాని హైదరాబాదే అయితే... వెళ్లిపోమనండి..


ఇదీ చదవండి : Prabhas on Cinema tickets GO : సినిమా టికెట్ల ధరలపై ప్రభాస్ ఏమన్నాడంటే...

Last Updated : Mar 8, 2022, 5:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.