ETV Bharat / city

వైకాపా మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు: చంద్రబాబు

author img

By

Published : Oct 12, 2022, 4:42 PM IST

Updated : Oct 12, 2022, 5:23 PM IST

Chandrababu Comments on YSRCP: ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైకాపాకు వ్యతిరేకంగా పోరాడాలని తెదేపా నేతలను చంద్రబాబు సూచించారు. మరోవైపు విశాఖలో తన ఆస్తులపై విజయసాయిరెడ్డి వివరణపై తెదేపా నేతల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖలో వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన, బొత్సలు భూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. వైకాపా నేతలు రాష్ట్ర విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

Chandrababu
చంద్రబాబు

Chandrababu Comments on YSRCP: విశాఖను మింగేసి.. ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైకాపా మూకకు వ్యతిరేకంగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖను కొల్లగొట్టి... కంపెనీలను వెళ్లగొట్టిన వాళ్లు అక్కడి ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సేవ్ ఉత్తరాంధ్ర' పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తెదేపా నిలబడాలని సూచించారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్​లు, ముఖ్య నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ముందే ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతో నేతలు సిద్ధం కావాలని, నియోజకవర్గంలో గెలుస్తామనే నమ్మకం కల్పించాల్సింది స్థానిక నాయకులే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే తన నిర్ణయాలు ఉంటాయని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో వైకాపా పాలనతో నష్టపోని వర్గం అంటూ లేదని... ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను పార్టీ అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. మూడు రాజధానులు అంటూ జగన్ మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు సాధ్యం కాదని కోర్టులు స్పష్టంగా చెపుతున్నా... ఉత్తరాంధ్ర, రాయలసీమలలో రాజధానులు అంటూ జగన్ జనాన్ని మోసం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇంచార్జ్​లు గట్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

బోల్డ్​గా ఉండే బాలకృష్ణ శైలి కారణంగానే టాక్‌ షో అంత హిట్ అయ్యిందని పేర్కొన్నారు. నాటి అధికార మార్పిడి విషయంలో వాస్తవంగా జరిగింది ఏంటి అనేది ఆ షోలో చర్చకు వచ్చిందని తెలిపారు. దశాబ్దాలుగా బురద వేస్తున్న అంశంలో ఓపెన్​గా పలు విషయాలు మాట్లాడానని నేతలకు చంద్రబాబు చెప్పారు.

కూన రవికుమార్: ఉత్తరాంధ్ర భూముల్ని తాను కబ్జా చేద్దామనుకుంటే విజయసాయిరెడ్డి అంతా దోచేశారనే ఫ్రస్టేషన్​లో ధర్మాన ఉన్నారని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ విమర్శించారు. అందుకే అసహనంతో రాష్ట్ర విచ్ఛిన్నం కోసం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పే ధర్మాన, బొత్సలకు రోజుకో రంగు పులుముకుని, పూటకోమాట మాట్లాడమని రాజ్యాంగం చెప్పిందా అని నిలదీశారు. గత మూడు దశాబ్దాలుగా ధర్మాన, బొత్స, తమ్మినేని సీతారాం కుటుంబాలే ఉత్తరాంధ్రను ఏలుతున్నాయని అన్నారు. వీరంతా సుదీర్ఘకాలం పదవులు అనుభవించి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయకుండా కుటుంబాలను మాత్రం ఆర్థికంగా బలపరుచుకున్నారని మండిపడ్డారు.

బండారు సత్యనారాయణమూర్తి: విజయసాయి ప్రలోభం లేకుండానే భూ ఒప్పందాలు జరిగాయా? అని తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. అడ్డదారిలో కుమార్తె, అల్లుడికి ఆస్తులు అప్పగించారని ధ్వజమెత్తారు. విశాఖ శ్రీరామ్ ప్రాపర్టీస్‌లో నిర్మిస్తున్న ఇల్లెవరిదని ప్రశ్నించారు. కూర్మన్నపాలెంలో విజయసాయి చెప్పిన భూములపై విచారణ చేయాలని డిమాండ్​ చేశారు.

పల్లా శ్రీనివాసరావు: భూముల్లో తన ప్రమేయం లేదని విజయసాయి ప్రమాణం చేయగలరా? అని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. 2019కి ముందే 22ఏలో భూములు పెట్టి కాపాడామన్నారు. ఇప్పుడు 22ఏ నుంచి చాలా భూములు డిలీట్ చేశారని ఆరోపించారు. దసపల్లా భూములు గ్రీన్ బెల్ట్ భూములని తెలిపారు. విజయసాయి కుమార్తె, అల్లుడిపై విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. విశాఖ డెయిరీ నుంచి రూ.300 కోట్లు కొట్టేశారని ఆరోపించారు.

విజయసాయి భూఅక్రమాలపై తెదేపా నేతలు

కిమిడి నాగార్జున: వైకాపా నాయకులు ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని కిమిడి నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. మూడేళ్లలో ఉత్తరాంధ్రలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. వైకాపా నేతలు విశాఖ పరిసరాల్లో భూములు కొంటున్నారని ఆరోపించారు. దసపల్లా భూములును చౌకగా ఇచ్చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి బొత్స తన జిల్లాలో ఏమైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. తోటపల్లి కాలవలో పూడిక కూడా తీయలేకపోతున్నారని విమర్శించారు. రైతుల వద్ద సరైన మద్దతు ధరకు కొనలేకపోతున్నారని మండిబట్టారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 12, 2022, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.