ETV Bharat / city

అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లండి: చంద్రబాబు

author img

By

Published : Jul 6, 2021, 5:57 AM IST

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే.. నీటి వివాదాన్ని అడ్డు పెట్టుకుని సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని తెలుగుదేశం ధ్వజమెత్తింది. లేఖలతో సమయం వృథా చేయకుండా.. ప్రధాని, జలశక్తి మంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలని డిమాండ్ చేసింది. నీటి హక్కుల్ని కాపాడుకోలేక, పుట్టిన గడ్డ రాయలసీమకు జగన్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని విమర్శించింది.

tdp leaders fire on government
అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లండి: చంద్రబాబు

అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లండి: చంద్రబాబు

శ్రీశైలంలో నీటి హక్కుల్ని కాపాడలేక చేతులెత్తేసిన జగన్‌ రెడ్డి పుట్టిన గడ్డకే ద్రోహం చేస్తున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. ఆయన అసమర్థత వల్లే రాయలసీమలో పారాల్సిన కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ శ్రీశైలం రిజర్వాయర్‌ను ఖాళీ చేస్తుంటే మన సీఎం ఉత్తుత్తి లేఖలతో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జల వివాదంపై సీఎం వెంటనే అఖిలపక్షాన్ని దిల్లీ పెద్దల వద్దకు సీఎం తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యనేతలు మాట్లాడారు.

‘ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు ఉత్తుత్తి లేఖలతో జగన్‌ నాటకమాడుతున్నారు. తెలంగాణలోని అక్రమాస్తులను కాపాడుకునేందుకు నదీజలాల్లో రాష్ట్రానికి ఉన్న న్యాయబద్ధమైన హక్కులను వదిలి.. రైతులను రోడ్డున పడేస్తున్నారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన హక్కుల్ని, లోయర్‌ రైపేరియన్‌ స్టేట్‌ హక్కుల్ని, అపెక్స్‌ కౌన్సిల్‌లో చేసుకున్న ఉమ్మడి తీర్మానాన్ని రక్షించాల్సిన బాధ్యత జగన్‌ ప్రభుత్వానికి ఉంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు తెదేపా ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ.13 వేల కోట్లు ఖర్చు చేయగా.. ఈ ప్రభుత్వం అందులో సగం కూడా వెచ్చించలేదు. రాయలసీమ ప్రాజెక్టులపై తెదేపా ప్రభుత్వం అయిదేళ్లలో 9,500 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్లలో జగన్‌ ఎంత ఖర్చు పెట్టారో చెప్పే ధైర్యం ఉందా? గండికోట, పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఇవ్వకుండా.. వారిని నీట ముంచారు. పురుషోత్తపట్నం ట్రైబ్యునల్‌లో ఆగిపోవడానికి కారణమెవరు? ధనయజ్ఞాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని వైఎస్‌ ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు లేఖ ఇచ్చి రాయలసీమకు ద్రోహం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం జ్యోతి బసు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల కమిటీ ఏర్పాటు చేయించి ఆల్మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకుంది’ అని పేర్కొన్నారు.

చంద్రబాబు కృషికి ఫలితం లేకుండా చేశారు.


కృష్ణా బోర్డు.. ఏపీ ఫిర్యాదులను పట్టించుకోకుండా తెలంగాణకు అనుకూలంగా ఉందని లేఖలో సీఎం ప్రస్తావించారని, దీనికి కారణం ఆయనేనని నేతలు దుయ్యబట్టారు. ‘చంద్రబాబు కృషి వల్ల కృష్ణా బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడ తరలించడానికి అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చకు పెట్టారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. బోర్డు కూడా సంసిద్ధత తెలిపింది. ఛైర్మన్‌ విజయవాడ వచ్చి, కార్యాలయానికి అనువైన భవనాలను పరిశీలించి వెళ్లారు. దీన్ని జగన్‌ వేరే చోటికి తరలించడానికి ప్రయత్నించడంతో అది హైదరాబాద్‌లో ఉండిపోయింది. కృష్ణా బోర్డు విజయవాడకు వచ్చి ఉంటే ఈ దుస్థితి తలెత్తేదా?’ అని నిలదీశారు.

ముచ్చుమర్రి.. పూర్తి చేయలేరా?

రాయలసీమకు మరో జీవనాడి లాంటి ముచ్చుమర్రి ప్రాజెక్టును రెండేళ్లయినా పూర్తి చేయకుండా జగన్‌ పుట్టిన గడ్డకు ద్రోహం చేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎలాంటి వివాదాల్లేని ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా 792 అడుగుల నుంచి నీరు తీసుకుని.. రాయలసీమలోని అన్ని కాలువలకు నీళ్లివ్వచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ముచ్చుమర్రిలో మూడు తూముల్లో నీటిని విడుదల చేసింది. మిగిలిన 13 తూములను ఈ రెండేళ్లలో పూర్తి చేసి ఉండొచ్చు. ముచ్చుమర్రి నుంచి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేట్‌కు అనుసంధానం అవకాశం కల్పించనున్నారు. దీని ద్వారా హంద్రీనీవా, గాలేరు- నగరి, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్‌, తెలుగు గంగకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. జగన్‌ కేసీఆర్‌తో లాలూచీ పడి రెండేళ్లయినా దీన్ని పూర్తి చేయకుండా నేడు జలజగడం నాటకమాడుతున్నారు. రాయలసీమ ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేని అమాయకులు కాదు’ అని స్పష్టం చేశారు. సమావేశంలో తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, నారా లోకేశ్‌, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, బండారు సత్యనారాయణమూర్తి, కాలవ శ్రీనివాసులు, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, టీడీ జనార్ధన్‌, వర్ల రామయ్య, బీద రవిచంద్ర, కొమ్మారెడ్డి పట్టాభి, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ తెదేపా డిమాండ్లు..

  • నదుల అనుసంధాన ప్రణాళికకు నిధులు కేటాయించి రాయలసీమ, ఉత్తరాంధ్రలకు సాగు, తాగునీరు ఇవ్వాలి.
  • ముంపు రైతులకు, ఆదివాసీలకు పరిహారం, పునరావాసం ఇచ్చి అన్ని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం పెంచాలి.
  • ముచ్చుమర్రి పెండింగ్‌ పనులు పూర్తి చేసి రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకు నీరివ్వాలి.
  • గోదావరి- పెన్నాలో భాగమైన వైకుంఠపురం ప్రాజెక్టు, బొల్లాపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేసి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌తో కలపాలి. గుండ్రేవుల, వేదవతి పూర్తి చేయాలి.
  • తుంగభద్ర హైలెవల్‌ కాలువకు సమాంతరంగా కాలువ నిర్మించాలి.
  • హంద్రీనీవా, గాలేరు-నగరి పెండింగ్‌ పనులకు కేటాయింపులు పెంచాలి.
  • పోలవరం నిర్వాసితుల పరిహారం, పునరావాసానికి రూ.3,150 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
  • తూర్పుగోదావరి- విశాఖ సరిహద్దు మన్యంలో లేటరైట్‌, బాక్సైట్‌ మాఫియా కోసం అటవీ చట్టాలను ఉల్లంఘించిన వైవీ సుబ్బారెడ్డి కుమారుడు, వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలి. రూ.15 వేల కోట్ల కుంభకోణంపై సీబీఐ విచారణ కోరాలి.
  • గృహనిర్మాణదారులకు కేంద్రం ఇచ్చే రూ.1.80 లక్షలతోనే సరిపెట్టకుండా..
  • రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు రాయితీగా ఇవ్వాలి.
  • సీఎం ఇంటి సమీపంలో ఎస్సీ యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులవడం వల్లే అరెస్టు చేయలేదనే అనుమానాలున్నాయి. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి.
  • అమరావతి ఎస్సీ రైతులకు పట్టాదారులతో సమానంగా ప్లాట్లు, కౌలు పెంపు హామీలను వెంటనే నెరవేర్చాలి.
  • ఎస్సీ యువకుడు పూల రవి పేరుతో నకిలీ వీడియో విడుదల చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీలకు క్షమాపణ చెప్పాలి.

ఇదీ చదవండి:

Rayalaseema Lift Irrigation Project: కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Curfew Relaxation: కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. 50 శాతం పరిమితితో వాటికి అనుమతులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.