ETV Bharat / city

రాజధానిపై పార్లమెంటుకే అధికారం: చంద్రబాబు

author img

By

Published : Sep 10, 2020, 10:54 PM IST

Updated : Sep 11, 2020, 7:15 AM IST

ఆన్​లైన్​లో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఖరి, వైఫల్యాలను ఎండగట్టాలని తెదేపా అధినేత సూచించారు.

tdp-chief-chandrababu
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు

రాజధాని అంశం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలోకి రానప్పుడు పార్లమెంటుకే అధికారం ఉంటుందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 248 ప్రకారం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వెల్లడించారు. విద్యుత్తు కొనుగోళ్లలో జోక్యం చేసుకున్నట్లే రైతులతో జరిగిన ఒప్పందంపై కూడా కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రానికి జరిగే నష్టాన్ని నివారించాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో రైతులెవరూ ప్రభుత్వానికి భూములు ఇవ్వరన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిపై వైకాపా ఆడుతున్న మూడు ముక్కలాటను ఎండగట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఆన్‌లైన్‌లో జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైకాపా దుర్మార్గ పాలనను జాతీయస్థాయిలో ఎండగట్టాలన్నారు. పార్లమెంటు జరిగే 18 రోజుల్లో ఆరు అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని చెప్పారు. ఆలయ రథాలకు నిప్పు, తితిదే భూముల అమ్మకానికి ప్రయత్నం, మాన్సాస్‌ ట్రస్టుకు తూట్లు, ధార్మిక సంస్థలను దెబ్బతీయడం తదితర అంశాలను ప్రస్తావించాలన్నారు. దళితులు, గిరిజనులపై అఘాయిత్యాలు, బీసీలు, మైనార్టీలపై అక్రమ కేసులు, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్నారు. కరోనా నియంత్రణలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని పార్లమెంటులో నిలదీయాలన్నారు. రాజధానిపై వైకాపా మూడు ముక్కలాటతో రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రశ్నించాలని కోరారు. తెదేపాకు తక్కువ మంది సభ్యులున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా పోరాడుతుందనే భావన ప్రజల్లో ఉందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఎంపీలకు సూచించారు.

'రాజధాని రైతుల త్యాగాలను గుర్తించి కేంద్రం అప్పట్లో కేపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపులు ఇచ్చింది. నిర్మాణానికి సహకరిస్తామని చెప్పింది. రాజధాని ఎంపికకు కమిటీ వేసిన కేంద్రానికి ఇప్పుడు అధికారం లేదనడం అసమంజసం. సర్వే మ్యాప్‌లో కూడా రాజధానిగా అమరావతిని కేంద్రం గు్తించింది. ఏపీలో రాజధానిని మూడు ముక్కలు చేస్తే రేపు మరో రాష్ట్రంలో నాలుగైదు ముక్కలు చేసే పరిస్థితి తలెత్తుతుంది. ఇది కందిరీగల తుట్టెను కదిలించడమే. సీఎం మారినప్పుడల్లా రాజధానిని మార్చితే రాష్ట్ర ప్రయోజనాల మాటేమిటి?' - చంద్రబాబు

నేరగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు

‘రాష్ట్రంలో ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వరుస ఘటనలు జరుగుతున్నా నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే నేరగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి’ అని సూచించారు. ‘దళిత యువకుడు వరప్రసాద్‌ శిరోముండనంపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ఆదేశాలు జారీ చేసినా ప్రధాన నిందుతున్ని అరెస్ట్‌ చేయకపోవడాన్ని నిలదీయాలి. దళితులపై వైకాపా దమనకాండను రాజ్యాంగ పెద్దలు, కేంద్ర మంత్రులు, ఎస్సీ కమిషన్‌, మానవహక్కుల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలి’ అని చెప్పారు.

నరేగా నిధుల స్వాహాపై ఫిర్యాదు...

ఇళ్ల స్థలాల అభివృద్ధి పేరుతో వైకాపా ప్రభుత్వం చేసిన నరేగా నిధుల దుర్వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు. ‘పెండింగ్‌ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే విడుదల చేసేలా ఒత్తిడి పెంచాలి. బకాయిలను చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. 14వ, 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు. 15 నెలల్లో రూ. 1.03 లక్షల కోట్లు అప్పులు తేవడం..తదితర అంశాలను నిలదీయాలి’ అని చంద్రబాబు కోరారు.

ఇదీ చదవండి:

గొల్లప్రోలులో బుల్లితెర నటి శ్రావణి అంత్యక్రియలు

Last Updated : Sep 11, 2020, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.