ETV Bharat / city

'మా బడి.. మాకు కావాలి'.. పాఠశాల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు

author img

By

Published : Jul 7, 2022, 2:27 PM IST

SCHOOLS PROTEST: ప్రాథమిక స్కూళ్లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. సమీపంలోని స్కూళ్లను తీసేయడం వల్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు తమ పిల్లల్ని పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనివల్ల తమ పిల్లలు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని చదువుకు దూరం చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తోందని చెబుతున్నారు.

SCHOOLS PROTEST
SCHOOLS PROTEST

'మా బడి.. మాకు కావాలి'.. పాఠశాల విలీనంపై కొనసాగుతున్న ఆందోళనలు

SCHOOLS PROTEST: ప్రాథమిక స్కూళ్లను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంపై ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. అంతకుముందు సొంతూళ్లో బడికి వెళ్లిన చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలోని బడులకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరు: పాఠశాలలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజయరాయి, ముత్తనవీడులో విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. పాఠశాలలు విలీనంతో.. చిన్నపిల్లలకు చదువు భారంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. 3, 4, 5వ తరగతి పిల్లలు దూరంగా ఉన్న స్కూలుకు వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోయారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే 3,4,5వ తరగతులు కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

పల్నాడు: 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ.. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు, క్రోసూరు మండలం అనంతవరం గ్రామంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వేల్పూరులో సత్తెనపల్లి రహదారిపై బైఠాయించి.. పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా రాస్తారోకో చేశారు. సమీపంలోని పాఠశాలను.. సుదూర ప్రాంతానికి తరలించడాన్ని నిరసిస్తూ తరగతి గదులకు తాళాలు వేశారు. 3,4,5 తరగతులు ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయోద్దని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని మొగిలిపాడు, ఉదయపురం పాఠశాలలను.. పలాస జడ్పీ హైస్కూల్​లో విలీనం చేయడంపై.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిరసన చేపట్టారు. ఆందోళనతో పలాసలోని రహదారిపై.. సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఊళ్లోని పాఠశాలలను వేరే చోట విలీనం చేస్తే.. తమ పిల్లలను ఎక్కడ చదివించాలని తల్లిదండ్రులు ప్రశ్నించారు. విలీనం నిర్ణయాన్ని మార్చుకోకుంటే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.

అల్లూరి సీతారామరాజు: మౌలిక సదుపాయాలు లేవంటూ.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం సీతాపురంలో.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎయిడెడ్ పాఠశాల విలీనం కావడంతో.. విద్యార్థుల సంఖ్య పెరిగిందని.. 140 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధ్యాపకుల కొరతతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు అందడం లేదని వాపోయారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులను కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

నెల్లూరు: అనంతసాగరం మండల కేంద్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉర్దూ పాఠశాల వద్ద వినూత్నంగా ఆందోళన చేపట్టారు. విద్యార్థులు తమ పలకలపై జగన్ మామయ్య మేము ఎక్కడికి వెళ్లము, మా పాఠశాలను ఎక్కడికి మార్చవద్దని రాసి నిరసన తెలిపారు. విలీనం పేరుతో ఉర్దూ పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలపడంపై నిరసన తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి ఆందోళన వ్యక్తం చేశారు.

నంద్యాల: జిల్లాలోని గడివేముల మండలం బిలకలగూడూరు ప్రత్యేక ప్రాథమిక పాఠశాలను యూపీ స్కూల్‌లో విలీనం చేయటంపై స్థానికులు మండిపడ్డారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు.

కర్నూలు: జిల్లాలోని ఆలూరు ఇందిరానగర్ కాలనీలోని ఆది ఆంధ్ర పాఠశాలను.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేయటాన్ని నిరసిస్తూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కిలోమీటరుకుపైగా దూరం ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే.. జాతీయ రహదారి దాటి వెళ్లాలని, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఇక్కడే చదివే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

అనకాపల్లి: పాఠశాలల విలీనంపై అనకాపల్లి జిల్లా నాథవరం మండల చినగొలుగొండపేట గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాలను మరోచోటకు తరలించడం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటుందని చెబుతున్నారు. తమ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు.

సత్యసాయి జిల్లా: గాండ్లపెంట మండలం తూపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. గ్రామంలో కాకుండా 2కిలోమీటర్ల దూరంలోని ఉన్న ఉన్నత పాఠశాలకు తమపిల్లలను పంపలేమని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులను కిలోమీటర్ల దూరం నడిపించలేమని..అలాగని..ఆటోల్లో పంపే స్థోమత తమకు లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. గ్రామంలోనే పాఠశాల ఉంటే పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. విద్యార్థుల బదిలీ సర్టిఫికెట్లు రాయద్దని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.