ETV Bharat / city

45 కంపెనీలతో భేటీ... రాష్ట్రానికి రూ. 4,200 కోట్ల పెట్టుబడులు...

author img

By

Published : May 28, 2022, 9:38 AM IST

45 కంపెనీలతో మంత్రి కేటీఆర్​ భేటీ
45 కంపెనీలతో మంత్రి కేటీఆర్​ భేటీ

KTR: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. విదేశీ పర్యటన ముగిసింది. ఈ నెల 18 లండన్‌కు చేరుకున్న కేటీఆర్ యూకేతో పాటు స్విట్జర్లాండ్‌లో పర్యటించారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో.. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు జరిపారు. ఈ పర్యటనలో 45 కంపెనీలకు చెందిన ప్రతినిధి బృందాలతో జరిగిన ఒప్పందాలతో.. సుమారు 4వేల 200 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టేందుకు ఆయా సంస్థలు ప్రకటించాయి.

KTR: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన శుక్రవారం ముగిసింది. దీని ద్వారా రూ.4200 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించినట్లు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. 45 ప్రసిద్ధ సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. కేటీఆర్‌ చొరవతో దావోస్‌లో తొలిసారిగా ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు దానిని సందర్శించి కేటీఆర్‌తో భేటీ అయ్యారు.కొన్ని సంస్థలు పెట్టుబడులు ప్రకటించగా.. మరికొన్ని విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. ఇంకొన్ని పరస్పర సహకారానికి అంగీకరించాయి.

కేటీఆర్‌ ఈనెల 17న ఆయన విదేశాలకు పయనమయ్యారు. మొదట లండన్‌ వెళ్లారు. బ్రిటన్‌ - భారత్‌ వాణిజ్య మండలి ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. తర్వాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరయ్యారు. వివిధ దేశాల ప్రతినిధులతో, కంపెనీల అధిపతులతో, ఇతర ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, అనుకూలతలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. తమ విదేశీ పర్యటన విజయవంతమైందని శుక్రవారం ట్విటర్‌లో కేటీఆర్‌ తెలిపారు.

ప్రపంచ వేదికపై ప్రభుత్వ విధానాలు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని అన్నారు. దీని ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, యూకే, స్విట్జర్లాండ్‌ దేశాలకు చెందిన ప్రవాసులకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ విస్తరణ... జర్మనీకి చెందిన ప్రసిద్ధ వాహనాల విడిభాగాల తయారీ సంస్థ జెడ్‌ఎఫ్‌ హైదరాబాద్‌లోని తమ కార్యాలయాన్ని ప్రపంచంలో అతిపెద్ద సౌకర్యాల కేంద్రం (ఫెసిలిటీ సెంటర్‌)గా విస్తరిస్తోంది.తమ సంస్థకు ప్రపంచంలో 100 దేశాలు, 18 ప్రధాన అభివృద్ధి కేంద్రాల్లో కార్యాలయాలుండగా... వాటన్నింటికంటే హైదరాబాద్‌ సౌకర్యాల కేంద్రం పెద్దదని జెడ్‌ఎఫ్‌ పేర్కొంది. తాజా విస్తరణ ద్వారా మూడు వేలమందికి అదనంగా ఇది ఉపాధిని కల్పించనుంది. జెడ్‌ఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డిర్క్‌ ఆడమ్‌సి జిక్‌, ఇతర ప్రతినిధులు శుక్రవారం దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ విస్తరణ ప్రణాళికను వివరించారు.

తెలంగాణ ప్రభుత్వ మొబిలిటీ క్లస్టర్‌లో భాగంగా నానక్‌రాంగూడలో భారీ గతిశక్తి (మొబిలిటీ) కేంద్రాన్ని జూన్‌ 1న ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీనికి హాజరు కావాలని కేటీఆర్‌ను వారు ఆహ్వానించారు. జెడ్‌ఎఫ్‌ విస్తరణపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. దీని ద్వారా తెలంగాణలో గతిశక్తి రంగానికి అదనపు బలం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దావోస్‌ తనకు ఎంతో ఇష్టమైన వేదిక అని, ఉత్తమ విధాన రూపకర్తలు, వ్యాపారవేత్తలు, దార్శనిక నాయకులకు అనుసంధానంగా ఉంటుందని తెలిపారు.

తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా దావోస్‌ తీర్చిదిద్దుతోందని, అక్కడ పాల్గొనడం గొప్ప అవకాశమని తెలిపారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ నేతృత్వంలోని తమ బృందం చక్కగా చనిచేసిందని తెలిపారు. దావోస్‌ పర్యటనను ముగించుకొని శుక్రవారం కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ రాజధాని జ్యురిక్‌ చేరుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.