ETV Bharat / city

Affidavit on AP financial calculations సర్కారు లెక్కల్లో మాయాజాలం

author img

By

Published : Aug 20, 2022, 6:50 AM IST

Affidavit on AP financial calculations ఏపీ ఆర్థిక లెక్కలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్ల అప్పులపై కేంద్ర ప్రభుత్వం, కాగ్‌లకు సమాధానం ఇవ్వని ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మాత్రం అంతా బాగుందని సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ వేసింది. దీనిపై ఆర్థిక నిపుణులతో పాటు ఇతర అధికారులు సైతం అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇదంతా ఓ మాయగా ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

financial calculations
సర్కారు లెక్కలు

Affidavit on AP financial calculations 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక లెక్కలపై ఇప్పటికీ అనుమానాలు తేలలేదు. కార్పొరేషన్లు చేసేవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులేనని ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ స్పష్టంగా చెప్పింది. బడ్జెట్‌లో చూపకుండా కార్పొరేషన్ల నుంచి ఎంత రుణం తీసుకున్నారో తెలియజేయాలని కాగ్‌ పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఆ లెక్కలు ఇవ్వట్లేదు. కానీ.. రాష్ట్ర ఆర్థికపరిస్థితి భేషుగ్గా ఉందని, ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను వివేకంగా నిర్వహిస్తోందని సుప్రీంకోర్టులో వైకాపా ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్‌ చర్చనీయాంశమవుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తుది లెక్కలను కాగ్‌ ఇంకా ఖరారు చేయలేదు. ఆ లెక్కల ప్రాతిపదికగా సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘2021-22లో కాగ్‌ విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను చాలా వివేకంగా నిర్వహిస్తూ రెవెన్యూ లోటును 8 వేల 370.51 కోట్ల రూపాయలకు, ఆర్థికలోటును 25 వేల 194.62 కోట్లకు పరిమితం చేశామని.. దానివల్ల రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి 2.10శాతానికి తగ్గిపోయిందని అందులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ రుణభారం అపరిమితమవుతోందని.. సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఇలాంటి అఫిడవిట్‌ చర్చనీయాంశమవుతోంది.

రుణ పరిమితిని కేంద్రం జీఎస్‌డీపీలో 3.5శాతానికి పరిమితం చేస్తోంటే ఎఫ్​ఆర్​బీఎం పరిధిలోకి రాకుండా రుణాలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. బడ్జెట్‌ ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా చేసినవీ ప్రభుత్వ అప్పులేనని కేంద్ర ఆర్థికశాఖ చెప్పింది. అవేవీ అధికారిక లెక్కల్లోకి రావట్లేదు. రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయాన్ని రెండు రకాలుగా కార్పొరేషన్లకు మళ్లిస్తున్నారు. కొంత ఖజానాకు వచ్చిన తర్వాత కార్పొరేషన్లకు చేరుస్తున్నారు. మరో నమూనాలో ప్రభుత్వం వ్యాట్‌ వంటి వాటిని తగ్గించుకుని బెవరేజస్‌ కార్పొరేషన్‌ వంటి వాటికి ప్రత్యేక సుంకం వసూలు చేసుకునే అధికారం కల్పించి అప్పులు తెస్తోంది. భవిష్యత్తు ఆదాయాలను ఎస్క్రో చేసి రుణాలు చేస్తున్నారు. ఆ అప్పులను, అక్కడ చేసే ఖర్చులను లెక్కల్లో చూపడం లేదు.. కాగ్‌కూ ఇవ్వట్లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ చెబుతున్న లెక్కలన్నీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. 18 వేల కోట్ల వ్యయం తగ్గించి చూపడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్‌ ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ సమాధానమేంటో ఇప్పటికీ వెల్లడి కాలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరం అనుబంధ లెక్కలనూ కాగ్‌ బయటకు వెల్లడించినా అనేక అనుమానాలు నివృత్తి కాలేదు. కాగ్‌ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇచ్చిన లెక్కల మధ్య పొంతన లేదు. ఆ లెక్కల ఆధారంగా సమర్పించే అఫిడవిట్లు అందుకే చర్చనీయాంశమవుతున్నాయి.

2021-22లో ఫిబ్రవరి నెలాఖరు నాటి కాగ్‌ నివేదిక ప్రకారం 38 వేల 169.31కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంది. మార్చిలో 20 వేల 471 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి నెల ఖర్చులు కూడా ఉంటాయి. ఆ నెలలోనూ ఎంతో కొంత రెవెన్యూ లోటు ఉంటుంది. కానీ, ఒకేసారి మార్చి నెలాఖరుకు రెవెన్యూలోటు 8 వేల 370.51 కోట్లకు తగ్గిపోయింది. ఆ మాయాజాలం ఏమిటో తేలాల్సి ఉంది. 2022 ఫిబ్రవరి నెలాఖరు వరకు ఖర్చు లక్షా 81 వేల 680 కోట్లయితే మార్చి నెలాఖరుకు 12 నెలల ఖర్చు లక్షా 75 వేల 536 కోట్లకు తగ్గిపోయింది. అప్పులు కూడా తగ్గినట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంటోంది. 2022 ఫిబ్రవరి నెలాఖరు వరకు బహిరంగ మార్కెట్‌ రుణం 52 వేల 164 కోట్లు. అది మార్చి నెలాఖరుకు 25 వేల194 కోట్లకు తగ్గిపోయింది. 2021-22లో కార్పొరేషన్ల ద్వారానే 30 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారనేది ఒక అంచనా. ఒకవేళ బహిరంగ మార్కెట్‌ రుణం, కార్పొరేషన్ల రుణం కొంతమేర తీర్చేసిన మొత్తాన్ని మినహాయించినా రాష్ట్రం చూపిన అప్పుల లెక్క సరిగా లేదనేది ఆర్థిక నిపుణుల వాదన. ఇక్కడ రెండు అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఏపీ బడ్జెట్‌ పుస్తకాల్లోనే కొన్ని పథకాలను కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటోంది. వాటిని ప్రభుత్వ లెక్కలుగా చూపడం లేదు. వాటికోసం తెచ్చిన అప్పులను ప్రభుత్వ అప్పులుగా చూపడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఖర్చులు కార్పొరేషన్ల ఖర్చుల్లో చూపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఫలితంగా బడ్జెట్‌ లెక్కల్లో ఖర్చు తగ్గిపోతోంది. ఫలితంగా రెవెన్యూ లోటు తగ్గించి చూపే ఆస్కారం కలుగుతోంది. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల కోసం తెస్తున్న అప్పులను కార్పొరేషన్ల అప్పులుగా చూపడం వల్ల ద్రవ్యలోటు తగ్గించి చూపే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది మరిన్ని అప్పులకు ఆజ్యం పోసే పరిస్థితికి దారి తీస్తోంది.

లెక్కల మాయాజాలంపై స్పందించిన ఆర్థికశాఖ విశ్రాంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌... రాష్ట్రాల్లో ట్రెజరీ ద్వారా ఖర్చుచేసిన లెక్కలనే కాగ్‌ ఆడిట్‌ చేస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి ఒకప్పుడు ఆడిట్‌ విభాగం ఆడిట్‌ చేసేదని.. 1995 తర్వాత నిబంధనలు మారిపోయాయని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల లెక్కలను ప్రైవేటుగా ఆడిట్‌ చేయించుకోవచ్చని నిర్దేశించారని...అప్పటినుంచి కార్పొరేషన్ల లెక్కలు అధికారికంగా ఆడిట్‌ కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఏపీఎస్‌ఐడీసీ, బెవరేజస్‌ కార్పొరేషన్‌ వంటి వాటిద్వారా రుణాలు తీసుకుని, ఖర్చు చేస్తున్నారని... అవి అకౌంటెంట్‌ జనరల్‌ పరిధిలోకి రావడం లేదని అలాంటిచోట అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోందని పి.వి.రమేష్‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి బాగుందంటే ఆదాయం పెరగాలని... కానీ ఎక్కడా పెరిగినట్లు కనిపించడం లేదని మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. జీతాలు, పింఛన్లనూ సరిగా ఇవ్వట్లేదన్న ఆయన... అన్ని చోట్ల నుంచి అప్పులు తెచ్చి పరిస్థితి ఎలా బాగుచేస్తారో, ఆ ఎకనామిక్స్‌ ఏమిటో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు. విశ్రాంత ఆర్థికశాఖ ఉన్నతాధికారులను, బ్యాంకింగ్‌ రంగ నిపుణులను కమిటీగా పిలిచి అంతర్గత లెక్కలన్నీ చెప్పాలని సీఎంను అభ్యర్థించారు. వాళ్లు పరిశీలించి అంతా బాగుందంటే శభాష్‌ అంటామని చెప్పారు.

సర్కారు లెక్కలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.