ETV Bharat / city

Prathidwani: పాదయాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకే వికేంద్రీకరణపై చర్చ

author img

By

Published : Sep 16, 2022, 10:48 AM IST

Prathidwani: అసెంబ్లీలో సీఎం జగన్​ ప్రసంగం.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర నుంచి దృష్టి మళ్లించేందుకే వికేంద్రీకరణపై చర్చ పెట్టారని అంటున్నారు. రైతులను పెత్తందారులని అనటం దుర్మార్గమని... కోర్టు తీర్పు అమలు చేయకపోవటం ధిక్కరణే అని పలువురు వక్తలు అభిప్రాయపడుతున్నారు.

prathidwani
అమరావతి

పరిపాలన వికేంద్రీకరణపై చర్చ పేరిట ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డే పెద్ద పెత్తందారని.. అలాంటిది ఆయన సాధారణ రైతులను పెత్తందారులని అనటం అత్యంత దుర్మార్గం, హేయమని అన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించి, అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పు అమలు చేయకపోవటం కచ్చితంగా కోర్టు ధిక్కరణేనని చెప్పారు. ‘అమరావతి-మారని ప్రభుత్వ తీరు’ అనే అంశంపై ‘ఈటీవీ - ఆంధ్రప్రదేశ్‌’ ‘ప్రతిధ్వని’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో పాల్గొన్న సామాజికవేత్తలు, నిపుణులు, వక్తలు వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఆ వివరాలివి..

త్యాగం చేసినవారు పెత్తందారులా?-లక్ష్మీనారాయణ, సామాజిక విశ్లేషకులు

Prathidwani
లక్ష్మీనారాయణ

రాజధాని కోసం భూముల త్యాగం చేసిన 29 వేల మంది రైతులు పెత్తందారులా? ఇంతకంటే నీచమైన ఆరోపణ మరొకటి ఉంటుందా? కులాలు, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజల్ని చీల్చి రాజ్యాధికారాన్ని కొనసాగించాలనుకునే కుట్ర ముఖ్యమంత్రి ప్రసంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలవుతున్నా ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. అలాగని ఆ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లలేదు. రాజధానిని మారుస్తూ చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్కమాట కూడా మాట్లాడని ముఖ్యమంత్రి జగన్‌.. ఇప్పుడు అసెంబ్లీలో నోరు పారేసుకోవటం కోర్టు ధిక్కరణే. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టేందుకు, రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టసభలో ఏం మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుందని, కోర్టు ధిక్కారం కిందకు రాదనే ఉద్దేశంతో జగన్‌ ప్రసంగించారు. శాసనసభను ఆయన రక్షణ కవచంలా వాడుకున్నారు. సభాపతి, మంత్రులు చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకే వస్తాయి.

* ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తకుండా ఉండాలంటే రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలని అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్‌ మాట్లాడారు. శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉన్నదే రాజధాని అని పేర్కొన్నారు. 30 వేల ఎకరాలకు మించి భూములు కావాలని శాసనసభలో చెప్పారు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందా? మారుమూల ప్రాంతంలో ఉందా? కృష్ణా నది ఒడ్డున ఉందా? నీరు లేనిచోట ఉందా? హైకోర్టు ఎక్కడ ఉంది? ఇవేమీ తెలియకుండానే సీఎం మాట్లాడారా?

* అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వేసిన కేసులను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పును సమర్థించింది. తాజాగా సీఐడీ అయిదుగుర్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిస్తే.. ‘భూములు అమ్మింది ఎవరు.. కొన్నది ఎవరు.. అనేది చెప్పకపోతే ఎలా?’ అని ప్రశ్నించింది. తాము మోసపోయామని, తమ భూములు బలవంతంగా లాక్కున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? అవేవి తేల్చకుండా ఎన్ని ఆరోపణలు చేసినా నిష్ఫలం. కులాల ప్రస్తావనతో విద్వేషాలు రేపుతున్నారు.

అలా చేయటం అభివృద్ధి కేంద్రీకరణ కాదా? - ఇంద్రనీల్‌, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది

Prathidwani
ఇంద్రనీల్‌

మొదటి నుంచి వైకాపా ప్రభుత్వం అమరావతి పట్ల విద్వేషమే కనబరుస్తోంది. విభజన చట్టం ప్రకారం ఇప్పటికే రాజధానిగా అమరావతిని శాసనసభ నిర్ణయించింది. మళ్లీ మరోచోటకు మార్చేందుకు శాసనసభకు అధికారం లేదు. ముఖ్యమంత్రి శాసనసభలో ప్రస్తావించిన లెక్కలన్నీ తప్పు. రాష్ట్ర ప్రజలను భ్రాంతిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే.. చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

భూముల విలువ పడిపోయేలా చేసింది జగనే.. -కందుల రమేష్‌, సీనియర్‌ పాత్రికేయుడు, అమరావతిపై పరిశోధనకర్త

Prathidwani
కందుల రమేష్‌

అమరావతిని సర్వనాశనం చేసి, ఇక్కడ భూముల విలువ పడిపోయేలా చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. మరోమారు అసెంబ్లీలో వాస్తవాలు వక్రీకరించి మాట్లాడారు. ఆయన తీరు చూస్తుంటే అసలు హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. హైకోర్టు తీర్పును ఉల్లంఘించి పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం అంతా పరస్పర విరుద్ధంగా ఉంది. మూడేళ్ల కిందట చేసిన నిరాధార ఆరోపణలే మరోమారు చేశారు. న్యాయస్థానాలు కూడా ఆ ఆరోపణలను తోసిపుచ్చాయి. చంద్రబాబు హయాంలో జారీ అయిన జీవోలోని ఓ పేరా మాత్రమే జగన్‌ చదివి ప్రజలను తప్పదోవ పట్టించారు.

* విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే వికేంద్రీకరణ జరిగినట్టా? రాజధాని వికేంద్రీకరణకు, పాలన, అభివృద్ధి వికేంద్రీకరణలకు మధ్య సంబంధం లేదు. విజయవాడ- గుంటూరు నగరాలు అమరావతికి దూరమని సీఎం అన్నారు. నగరాల్లో రాజధాని పెట్టొద్దని శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టంగా చెప్పింది. దీనివల్ల పర్యావరణానికి నష్టంతోపాటు నగరాలపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. విశాఖ నగరంలో రాజధాని ఏర్పాటు సరికాదని ఆ కమిటీ తేల్చిచెప్పింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.