ETV Bharat / city

కరోనా కాటేయకుండా.. ఆవిష్కరణలు చేశారిలా!

author img

By

Published : Apr 28, 2020, 5:49 PM IST

'నమస్తే.. శానిటైజర్‌తో చేతులు కడుక్కుని లోపలికి రండి’ అంటూ గేటు బయటే హెచ్చరిక! డబ్బా వద్ద చేతులు పెట్టగానే దానంతటదే శానిటైజర్‌ చేతుల్లో పడుతుంది. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకొని.. ఇంట్లో వాళ్లతో కరచాలనం చేద్దామనుకుంటే చేతికున్న వాచీ తాకొద్దని హెచ్చరిస్తుంది... పలకరిద్దామని కాస్త దగ్గరికెళ్తే చాలు వారి మెడలో ఉన్న ఐడెంటిటీ కార్డు దూరంగా జరగాలంటూ చప్పుడు చేస్తుంది. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా! ఈ పరికరాలన్నీ కరోనాని తరమడానికే ప్రత్యేకంగా తయారైనవని. వీటి ఆవిష్కర్తలు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల పట్టణానికి చెందిన అక్కాచెల్లెళ్లు బుధవారపు శ్వేత, స్నేహ. ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం.

sisters from siricilla  town invented instruments to alert corona
కరోనాకి గేటు వేస్తున్నారు.. ఆ అక్కాచెల్లెళ్లు

ప్రపంచమంతా కొవిడ్‌-19 భయంతో వణికిపోతోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం మొత్తుకుంటోంది. అయినా చాలా మంది పట్టించుకోవడం లేదు. ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ చదివే శ్వేత, బీఎస్సీ విద్యార్థి స్నేహ సైతం ఈ దిశగా ఆలోచించారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావడం వల్ల బోలెడంత సమయం కలిసొచ్చింది. ప్రయోగాలు మొదలుపెట్టారు. అహర్నిశలు కష్టపడ్డారు.

వైఫల్యాలు ఎదురైనా పట్టు వదల్లేదు. కరోనా వ్యాప్తిని అరికట్టేలా సరికొత్త ఆవిష్కరణలు చేయాలని ప్రయత్నించి.. ప్రయత్నించి.. చివరికి విజయం సాధించారు. 3 వోల్టుల బ్యాటరీ, బజర్‌, స్విచ్‌, బోల్ట్‌ సెన్సర్లతో స్నేహ వంద రూపాయల్లోనే చేతి గడియారం తయారు చేసింది. దీన్ని ధరిస్తే ఎవరికైనా కరచాలనం ఇచ్చేందుకు ప్రయత్నించినా, చేతులు ముఖాన్ని సమీపించినా 'బీప్‌' మోత మోగుతుంది.

ఎవరైనా దగ్గరికొస్తే..

ఇది కాకుండా సామాజిక దూరం పాటించేలా మరో ఆవిష్కరణ చేశారు. ఐఆర్‌ సెన్సర్‌, రిలే, స్పీకర్‌, స్విచ్‌, ఇన్‌కోర్‌ పరికరాల్ని వాడి ఒక ఐడీ కార్డు రూపొందించింది. దీన్ని మెడలో ధరించిన వ్యక్తికి మీటరు సమీపంలోకి ఎవరైనా వస్తే పెద్ద శబ్దంతో హెచ్చరిస్తుంది. దీంతో ఆ వ్యక్తి వెంటనే అప్రమత్తం కావొచ్చు. ఈ పరికరం తయారీకైన వ్యయం మూడొందల రూపాయలే.

గేట్​ దగ్గరే హెచ్చరిక..

శ్వేత కూడా రెండు ఉపయుక్తమైన ఆవిష్కరణలు చేసింది. కొవిడ్‌-19 ఆటోమేటిక్‌ శానిటైజర్‌- గేట్ ఇండికేటర్‌ అనే పరికరం రూపొందించింది. దీనికైన ఖర్చు రూ.1,200. ఎవరైనా వ్యక్తులు ఇంటి గేటు సమీపంలోకి రాగానే సెన్సర్‌ పసిగట్టి సంకేతాలు పంపిస్తుంది. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలంటూ ఆడియో వినిపిస్తుంది. శానిటైజర్‌ దగ్గర చేతులు పెట్టగానే అందులోనుంచి ద్రావణం దానికదే చేతుల్లో పడుతుంది.

ప్రశంసల జల్లు..

సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖానికి చేతులు తాకించకుండా ఉండటం... ఇవన్నీ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే మార్గాలు. ఇదే లక్ష్యంతో అతి తక్కువ ఖర్చుతో ఈ అక్కాచెల్లెళ్లు రూపొందించిన పరికరాల్ని అంతా ప్రశంసిస్తున్నారు. తండ్రి మల్లేశం సహకారం, ప్రోత్సాహంతోనే వీటిని తయారు చేశామనీ, భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేస్తామంటున్నారు అక్కాచెల్లెళ్లిద్దరూ.

ఇవీ చూడండి:

వైరస్​ పుట్టినిల్లు చైనాలో ఆసుపత్రులు బంద్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.