ETV Bharat / city

అలాంటి పిల్లలకు.. అమ్మగా మారిన సెల్వరాణి!

author img

By

Published : Mar 16, 2021, 4:29 PM IST

పదహారేళ్ల అమ్మాయి... పైకి వెళ్లిపోయిన తన స్కర్టుని  ఎలా సర్దుకోవాలో తెలియక ఇబ్బందిపడుతోంది. మానసిక దివ్యాంగురాలైన ఆ పిల్లకి సాయం చేయడానికి వాళ్లమ్మ కూడా అక్కడ లేదు. కూలీ పనికి వెళ్లింది.. దూరంగా ఉండి ఇదంతా గమనిస్తూ వచ్చిన సెల్వరాణి మాత్రం ఊరకనే ఉండలేకపోయింది. అప్పుడే తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకుంది. ఇంతకీ ఆ వారసత్వం ఆస్తి కాదు...సేవ. మానసిక దివ్యాంగులకు సాయంగా ఉండేందుకు ఆమె మొదలుపెట్టిన ఎన్జీవోలో నేడు 40 గ్రామాల నుంచి వచ్చిన అమ్మాయిలు ఆశ్రయం పొందుతున్నారు.

shree sellayya
తండ్రి సేవాగుణాన్ని పునికి పుచ్చుకున్న పుత్రిక

తిరుచ్చి, పెరంబళూరు ప్రాంతాల్లో సెల్లయ్య పేరు చెబితే చేతులెత్తి దండం పెడతారు. అందుకు కారణం నిత్యం కరవు తాండవించే ఆ ప్రాంతంలో ఆయన మొదలుపెట్టిన సేవాకార్యక్రమాలే. ఓ కుగ్రామంలో పుట్టి సాధారణ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన సెల్లయ్య ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌(ఐఎల్‌ఓ)లో కీలక పదవులు చేపట్టారు. సొంత ఊరికోసం ఏదో చేయాలన్న తపనతో మహిళా సాధికారత కోసం... స్వయం సహాయక సంఘాలని పోగుచేసి ఎన్నో ఉపాధి కార్యక్రమాలని మొదలుపెట్టారు.

కూతురు సెల్వరాణికి సామాజిక విలువలని ఉగ్గుపాలతో అందించి మంచి చదువులు చదివించారు. ఆమె బీఏబీఎల్‌ పూర్తిచేసి కార్డియాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ రాజారత్నాన్ని పెళ్లి చేసుకున్నారు. తర్వాత భర్తతో కలిసి దుబాయి వెళ్లి అక్కడే స్థిరపడి న్యాయవాదిగా తన కెరీర్‌ను కొనసాగించారు. కానీ సెల్వరాణి జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఎంతో ప్రేమించిన నాన్న, జీవిత భాగస్వామి.. ఒకరి తర్వాత మరొకరిని కోల్పోయారామె. ఆ జ్ఞాపకాలతో దుబాయిలో ఉండలేక తిరిగి స్వదేశానికి వచ్చేశారు. మహిళా ఆర్థిక సాధికారత కోసం తండ్రి పడ్డ తపన ఆమెని ఖాళీగా కూర్చోనివ్వలేదు. ఆయన మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలని నడిపించే క్రమంలో ఓ పల్లెటూరికి వెళ్లారు సెల్వరాణి.

అప్పుడే ఓ పదహారేళ్ల దివ్యాంగురాలు లోదుస్తుల్ని కూడా సరిగా సర్దుకోలేక ఇబ్బంది పడటం గమనించారు. ఆరాతీస్తే.. వాళ్ల అమ్మానాన్న కూలీపనికి వెళ్లారని.. కొందరైతే ఇలాంటి పిల్లలని ఇళ్లలో పెట్టి తాళం కూడా వేస్తారని తెలిసి బాధపడ్డారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి జ్ఞాపకాలే వెంటాడటంతో తండ్రి పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. అదే ‘శ్రీ సెల్లయ్య మెమోరియల్‌ స్పెషల్‌ స్కూల్‌ ఫర్‌ ఇంటెలెక్చ్యువల్లీ డిజేబుల్డ్‌ చిల్డ్రన్‌’. ఆ స్కూల్‌లో తాను మొదట చూసిన 16 ఏళ్ల అమ్మాయినే తొలి విద్యార్థినిగా చేర్చుకున్నారు.

shree sellayya
దివ్యాంగ చిన్నారులు

‘కానీ వాళ్ల అమ్మానాన్నలు ఇక్కడ చేర్చడానికి ఇష్టపడలేదు. వాళ్లని స్కూల్‌కి తీసుకురావడం, తీసుకెళ్లడం మావల్ల కాదంటూ గట్టిగానే చెప్పారు. అందుకని వారికోసం రవాణా సదుపాయం ఏర్పాటు చేసి ఒప్పించాను. ఐదుగురు పిల్లలతో మా పాఠశాల ప్రారంభమైంది. ఈ పిల్లలకి బిహేవియర్‌ థెరపీ, చదువు, వ్యాయామాలు వంటి సౌకర్యాలన్నీ అందేలా చేశాను. ఉదయాన్నే మా స్కూల్‌ నుంచి తిరుచ్చి, పెరంబళూరు ప్రాంతాలకు రెండు వాహనాలు వెళ్తాయి. సుమారు 40 గ్రామాల నుంచి దివ్యాంగులైన పిల్లలని మా బడికి తీసుకొస్తాం. కాగితం కవర్లు, పూలదండల తయారీ వంటి స్వయం ఉపాధి పనులు నేర్పుతున్నాం. ఇంతవరకూ వందలాదిమందికి ఇక్కడ శిక్షణ ఇచ్చాం. వీరిలో కొందరు క్రీడల్లో పాల్గొని జిల్లాస్థాయిలో పతకాలు తెచ్చుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాలు చేయడానికి స్నేహితులు, ఆన్‌లైన్‌ క్రౌడ్‌ ఫండ్‌ సాయం తీసుకుంటున్నా’ అంటున్నారు సెల్వరాణి.

ఇదీ చదవండీ.. శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.