ETV Bharat / city

సచివాలయంలో ‘ప్రైవేటీకరణ?’.. సరికాదంటూ ఉద్యోగుల సంఘం నిరసన

author img

By

Published : May 18, 2022, 9:01 AM IST

Secretariat: రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కార్యాలయం సచివాలయం. అక్కడ నిబంధనల ప్రకారమే ప్రతి దస్త్రం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. విభాగాధిపతుల నుంచి వచ్చే ప్రతి అంశాన్నీ అక్కడ వివిధ స్థాయిల్లో క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను పేర్కొంటూ దానిని కార్యదర్శి స్థాయికి పంపిస్తారు. అక్కడ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆయా అవసరాలను బట్టి పంపి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి కీలక సచివాలయంలో ప్రస్తుతం ఆర్థికశాఖలో జాయింట్‌ సెక్రటరీ స్థాయిలో ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Privatization in the Secretariat
సచివాలయంలో ‘ప్రైవేటీకరణ?’.. సరికాదంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం నిరసన

Secretariat: రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కార్యాలయం సచివాలయం. అక్కడ నిబంధనల ప్రకారమే ప్రతి దస్త్రం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. విభాగాధిపతుల నుంచి వచ్చే ప్రతి అంశాన్నీ అక్కడ వివిధ స్థాయిల్లో క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను పేర్కొంటూ దానిని కార్యదర్శి స్థాయికి పంపిస్తారు. అక్కడ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆయా అవసరాలను బట్టి పంపి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి కీలక సచివాలయంలో ప్రస్తుతం ఆర్థికశాఖలో జాయింట్‌ సెక్రటరీ స్థాయిలో ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శాఖలో 5 జాయింట్‌ సెక్రటరీ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.

సాధారణంగా ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ తరహా పరీక్షల్లో ఎందరో పోటీపడి ఎంపికై సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్‌ స్థాయిలో లేదా ఆ పై స్థాయిలో నియమితులవుతుంటారు. ఆ తర్వాత 20ఏళ్ల పాటు ఆయా పోస్టుల్లో పని చేస్తూ పదోన్నతుల ద్వారా జాయింట్‌ సెక్రటరీ గ్రేడ్‌కు చేరుతుంటారు. అలాంటిది కేవలం నేరుగా ఈ పోస్టులో అదీ ఆర్థికశాఖలో ప్రైవేటు కంపెనీల్లో అనుభవం ఉన్న వారిని నియమిస్తుండటం వివాదాస్పదమవుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం రాష్ట్ర ఆర్థికశాఖలోని ఒక ఉన్నతాధికారిని కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ ప్రైవేటు వ్యక్తులను కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శులకు కన్సల్టెంట్లుగా లేదా ప్రత్యేకాధికారులుగా నియమించుకునే వారని, ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగించాలని కోరారు. దస్త్రం సర్కులేట్‌ చేసే అధికారం ఉన్న పోస్టులోకి ఇలా ప్రైవేటు వ్యక్తులను తీసుకురావడం సరికాదని వాదించారని సమాచారం.

తప్పులు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..!
రాష్ట్ర సచివాలయంలో ప్రతి శాఖలోనూ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఆ పైన సెక్షన్‌ ఆఫీసరు, తర్వాత వరుసగా అసిస్టెంటు, డిప్యూటీ, జాయింట్‌, అడిషనల్‌ సెక్రటరీ హోదాల్లో అధికారులు ఉంటారు. ఇందులో ప్రతి అధికారికి దస్త్రం సర్కులేట్‌ చేసే అధికారం ఉండదు. డిప్యూటీ, జాయింట్‌, అడిషనల్‌ సెక్రటరీలకే ఉంటుంది. ఈ ముగ్గురూ ఆయా శాఖల్లో అంశాలవారీగా దస్త్రాలను పరిశీలిస్తారు. కింది నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చిస్తారు. వాటిని ఆమోదించడం, తోసివేయడం వంటివి చేస్తూ వాటిని వీరు కార్యదర్శులకు (ఐఏఎస్‌ అధికారులు) పంపుతారు. ఇంతటి కీలకమైన స్థానంలో ఉన్న జాయింట్‌ సెక్రటరీ పోస్టులోకి కాంట్రాక్టు అధికారులను తీసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాంట్రాక్టు అధికారులుగా ఐఏఎస్‌లకు సహాయకులను నియమించుకుంటే తమకు అభ్యంతరం లేదని, దస్త్రం కీలక నిర్ణయం తీసుకునే స్థానంలో ప్రైవేటు వ్యక్తులను తీసుకుంటే ముఖ్యమైన నిర్ణయాల్లో తప్పులు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని సచివాలయ ఉద్యోగుల సంఘం ఆఫీసు బేరర్లు ఆర్థికశాఖ ఉన్నతాధికారిని మంగళవారం ప్రశ్నించారని సమాచారం.

రాజకీయంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేందుకు రాజకీయ పదవుల్లో ఉన్నవారు తమ ప్రైవేటు సంస్థల్లో పని చేసే వారిని ఇక్కడ నియమించుకునేందుకు ఇలాంటి దొడ్డిదోవ పోస్టింగులు ఉపకరిస్తాయని, దీనివల్ల ఆ తర్వాత నిర్ణయాల్లో జరిగే అవకతవకలకు ఎవరు జవాబుదారీ అవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి సచివాలయశాఖలోనూ, ప్రతి విభాగాధిపతి కార్యాలయంలోనూ ఇదే తరహా నియామకాలు జరిగితే మొత్తం వ్యవస్థే పక్కదోవ పట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో ముందుకే వెళ్లదలుచుకున్నామని సదరు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సచివాలయ సంఘం ఆఫీసు బేరర్లకు తెలియజేసినట్లు సమాచారం.

ఇవీ చదవండి:MP Raghurama News: 'రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ. 7.88 లక్షల కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.