ETV Bharat / city

Mosquitoes: హైదరాబాద్​లో దోమల విజృంభణ.. 34 వేల హాట్‌స్పాట్ల గుర్తింపు

author img

By

Published : Jul 29, 2021, 10:09 AM IST

ఓవైపు కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులతో భాగ్యనగర ప్రజలు వణికిపోతున్నారు. నగరంలో సాయంత్రం 5 అయితే చాలు బయట నిల్చులేని పరిస్థితి. పెద్దఎత్తున వృద్ధి చెందిన దోమల (Mosquitoes)తో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమకాటుతో రోగాల బారిన పడుతున్నారు.

Mosquitoes
Mosquitoes

హైదరాబాద్​లో దోమల (Mosquitoes) సమస్య ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచే చాలా ప్రాంతాల్లో బయట నిలబడలేని పరిస్థితి ఉత్పన్నమైంది. కిటికీలు, తలుపులు తెరవలేని దుస్థితి నెలకొంది. నాలాలు, చెరువులు, కుంటలు, నీరు నిలిచే ప్రాంతాల్లో దోమలు పెద్దఎత్తున వృద్ధి చెందుతున్నాయి. రోజురోజుకు పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతోంది. దోమ కాటుతో ప్రజలు డెంగీ, మలేరియా, ఇతరత్రా రోగాల బారిన పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ దోమల నివారణ విభాగం నిర్లక్ష్యమే అందుకు కారణమన్న విమర్శలొస్తున్నాయి.

ఫాగింగ్‌ కోసం అందజేసే డీజిల్‌ను కొందరు అధికారులు, సిబ్బంది నల్లబజారులో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రసాయనాలనూ పూర్తిస్థాయిలో దోమల(Mosquitoes) నివారణ చర్యలకు ఉపయోగించట్లేదు. ఇలాగే కొనసాగితే.. రెండేళ్ల క్రితం మాదిరి డెంగీ కేసులు నగరంలో పతాక స్థాయికి చేరే ప్రమాదముందని అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా పరిస్థితి నానాటికీ తీవ్రమవుతుండటంతో జీహెచ్‌ఎంసీ దోమల నివారణ విభాగం చర్యలను ముమ్మరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నగరవ్యాప్తంగా సర్వే చేపట్టిన అధికారులు.. డివిజన్లవారీగా అతి సమస్యాత్మక (వల్నరబుల్‌ ఏరియాలు) ప్రాంతాలను, దోమల వృద్ధికి కారణమయ్యే హాట్‌స్పాట్లను, ఖాళీ స్థలాలను గుర్తించారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దడమే లక్ష్యంగా బల్దియా 100రోజుల కార్యాచరణతో రంగంలోకి దిగుతోంది.

360 ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు..

గత కొన్నేళ్లలో డివిజన్లు, కాలనీల వారీగా నమోదైన డెంగీ, మలేరియా, చికెన్‌ గన్యా వ్యాధుల ఆధారంగా బల్దియా ఎంటమాలజీ విభాగం నగరంలో ఇటీవల సర్వే చేపట్టింది. దోమలతో సతమతమవుతున్న 360 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. అక్కడ దోమల వృద్ధికి దోహదపడే వాతావరణం ఉందని, ప్రజలు స్వీయ నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బల్దియా ఆధ్వర్యంలో అక్కడ తరచుగా జ్వరం సర్వే నిర్వహణ, దోమల నివారణ మందు పిచికారి జరుగుతున్నాయని చీఫ్‌ ఎంటమాలజిస్టు డాక్టర్‌ రాంబాబు తెలిపారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు నీటి కుంటల్లో గంబూసియా చేపలు వదలడం, నూనె బంతులు వేస్తున్నామన్నారు. నీటినిల్వలను తొలగిస్తున్నామన్నారు. ప్రజలు ఇళ్లలోని నీటి తొట్టెలను, పూలకుండీలను, ఇతరత్రా అపరిశుభ్ర పరిస్థితులను చక్కదిద్దుకుంటే ఇంట్లోకి దోమ ప్రవేశించదని ఆయన సూచించారు.

దోమలతో దద్దుర్లు

వణికిస్తోన్న ఖాళీ స్థలాలు..

జనావాసాల మధ్య ఉన్న 477 ఖాళీ స్థలాలు దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా మారుతున్నట్లు బల్దియా గుర్తించింది. వాటిపై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌ ఎంటమాలజిస్టు రాంబాబు గుర్తుచేస్తున్నారు. ఆయా ప్రాంతాలను సర్కిళ్ల వారీగా గుర్తించామని, అక్కడ రసాయనాలు పిచికారి చేసి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

34,286 హాట్‌స్పాట్లు..

నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో, సెల్లార్లలో, తాళం వేసిన ఇళ్లలో, తెరచిన నీటి ట్యాంకుల్లో, ఖాళీ స్థలాల్లోని నీటి మడుగుల్లో, పాఠశాలల్లో, ఫంక్షన్‌హాళ్లలో నీరు నిలిచి రోజుల తరబడి అలాగే ఉంటోంది. అందులో దోమలు గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేస్తున్నాయి. అలాంటి 34,286 హాట్‌స్పాట్లను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. అక్కడ నివారణ చర్యలు చేపట్టేలా సిబ్బందికి ఆదేశాలిచ్చింది.

రాబోయే రోజుల్లోనే..

గత రెండేళ్లలో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పెద్దయెత్తున డెంగీ, మలేరియా కేసులు నమోదయ్యాయి. 2019లో మొత్తం 3,300ల మందికి డెంగీ జ్వరం సోకగా, అందులో సగం కేసులు సెప్టెంబరులో వెలుగులోకి వచ్చినవి ఉన్నాయి. అక్టోబరులో సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినా తీవ్రత కొనసాగింది.

నీరు నిలవనివ్వొద్ధు..

" కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ ఆదేశాలతో వంద రోజుల కార్యాచరణ రూపొందించాం. 2,250 మంది సిబ్బందితో కూడిన వందలాది బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో జ్వరం సర్వే నిర్వహిస్తున్నాం. బాధితుల ఇళ్ల చుట్టూ ఉండే వంద ఇళ్లలో దోమల నివారణ మందు(పెరిత్రియం)ను పిచికారి చేస్తున్నాయి. చుట్టుపక్కలుండే ఖాళీ స్థలాలు, నీటి నిల్వ ప్రాంతాలలో మందు చల్లిస్తున్నాం. దోమల వృద్ధికి కారణమయ్యే వాతావరణాన్ని చక్కదిద్దుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఖాళీ స్థలాలు, నిర్మాణ పనులు జరిగే ప్రాంతాలు, సెల్లార్లు, బావులు, నీటి కుంటలు, చెరువులు, నాలాలు, ఇతరత్రా హాట్‌స్పాట్ల వద్ద అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఫాగింగ్‌ ముమ్మరంగా జరుగుతోంది. నాలాలు, చెరువులు, కుంటల్లో నూనె బంతులు వేసి లార్వా దశలోనే అంతం చేస్తున్నాం. గంబూసియా చేపలను దోమల నివారణకు ఉపయోగిస్తున్నాం."

- డాక్టర్‌.రాంబాబు, చీఫ్‌ ఎంటమాలజిస్టు, జీహెచ్‌ఎంసీ

ప్రమాదకర ప్రాంతాలు

ఇదీ చదవండి:

Covid: తస్మాత్ జాగ్రత్త... భాగ్యనగరంలోమళ్లీ విస్తరిస్తున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.