ETV Bharat / city

CM Jagan : ‘అన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిధి’.. సర్వం 'జగన్నాథం'!

author img

By

Published : Apr 13, 2022, 1:08 PM IST

జనం చచ్చిబతుకుతున్నా సరే, తెల్లబట్టలు నలగకుండా ఒడ్డున నిలబడి ‘ఏంకాదు... మరేంకాదు’ అంటూ చేతులూపుతూ చిరునవ్వులు చిందించగలిగిన వారే నేతలు కాగలరు. అయితే, అంతటి స్థితప్రజ్ఞులను సైతం చలింపజేయగలిగిన శక్తిస్వరూపిణి లేకపోలేదు! అదేమిటో కాదు... పదవి. ‘పెదవి దాటని మాటొకటి ఉంది... ఇస్తారని ఆశగ ఉంది’ అంటూ దానికోసం అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. చేతుల్లో చిడతలొక్కటే తక్కువ కానీ, మాటల్లో ఆ లోటు తెలియకుండా చూసుకుంటారు. అయ్యవారి దృష్టిలో పడటానికి అవసరమైన పాట్లన్నీ మహదానందంగా పడతారు. అవి ఫలించి కుర్చీ దక్కిందా... ‘అన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిధి’ అంటూ పరవశించిపోతారు.

CM Jagan
CM Jagan

రాజకీయ నాయకులకు కన్నీళ్లు ఎప్పుడొస్తాయి.. వాళ్ల గుండెలు ఏ రోజున మండిపోతాయి? ప్రజల కష్టాలను చూసినప్పుడా... వాటిని చూస్తూ కూడా తాము బెల్లంకొట్టిన రాళ్లలా మిగిలిపోతున్నామన్న స్పృహ కలిగినప్పుడా? అబ్బే... అటువంటి ఆలోచన కానీ, కనీసం దింపుడుకళ్లం ఆశ కానీ మనం పెట్టుకోకూడదు. జనం ఇక్కట్లు చూడవద్దు, వాటి గురించి వినవద్దు, మాట్లాడవద్దని ఇంట్లో అద్దం ముందు ప్రమాణస్వీకారం చేసిన తరవాత కానీ, వారు ప్రజాసేవకు అడుగు బయటపెట్టరు. అసలంత సున్నిత మనస్కులు రాజకీయాలకు పనికిరారండీ బాబూ... నానా ఈతిబాధలతో జనం చచ్చిబతుకుతున్నా సరే, తెల్లబట్టలు నలగకుండా ఒడ్డున నిలబడి ‘ఏంకాదు... మరేంకాదు’ అంటూ చేతులూపుతూ చిరునవ్వులు చిందించగలిగిన వారే నేతలు కాగలరు. అయితే, అంతటి స్థితప్రజ్ఞులను సైతం చలింపజేయగలిగిన శక్తిస్వరూపిణి లేకపోలేదు! అదేమిటో కాదు... పదవి. ‘పెదవి దాటని మాటొకటి ఉంది... ఇస్తారని ఆశగ ఉంది’ అంటూ దానికోసం అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. చేతుల్లో చిడతలొక్కటే తక్కువ కానీ, మాటల్లో ఆ లోటు తెలియకుండా చూసుకుంటారు. అయ్యవారి దృష్టిలో పడటానికి అవసరమైన పాట్లన్నీ మహదానందంగా పడతారు. అవి ఫలించి కుర్చీ దక్కిందా... ‘అన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిధి’ అంటూ పరవశించిపోతారు. లెక్కలు తిరగబడి అమాత్య యోగం ముఖం చాటేసిందా, అంతే- కళ్లు ఎర్రబడి, ముక్కుపుటాలు ఎగిరిపడి, పొగిడిన నోళ్లే శాపనార్థాలు పెడతాయి. ‘ఫ్యాన్‌’ మార్కు రాజకీయ ప్రహసనంలో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి దృశ్యాలన్నీ పరమ రోమాంచితంగా ప్రదర్శితమవుతున్నాయి.

‘ఎంతటివాడోయి చిన్నిదేవుడు’ అంటూ మొన్నటి వరకు కొండంత రాగాలు తీస్తూ కోటి కీర్తనలు ఆలపించిన వీరవిధేయ భక్తాగ్రేసరులే నేడు భగ్న పదవీ ప్రేమికులయ్యారు. ‘దేవుడయ్యా దేవుడూ మాయదారి దేవుడూ... నమ్మినోళ్ల గొంతునులిమే దేవుడూ’ అని ఎవరికివారు కన్నీటి గీతికలు పాడుకొంటున్నారు. రాజీనామాలు చేసేవారు చేస్తుంటే- అలిగి ఇంట్లో కూర్చుని అనుచరులతో అల్లరి చేయిస్తున్న వారు చేయిస్తున్నారు. ఆ మాత్రం ధైర్యం లేని వారు నాలుగు గోడల నడుమ గుడ్లనీరు కుక్కుకుంటున్నారు. మంత్రుల ఎంపికకు ప్రమాణాలేమిటో బుర్ర చించుకున్నా బోధపడక మొత్తానికి అందరూ (తాత్కాలిక) రాజకీయ వైరాగ్యంతో కుమిలిపోతున్నారు. ప్రజలకు ఎలాగూ చెప్పరు... అమాత్యులయ్యేందుకు అర్హతలేమిటో అయ్యవారు కనీసం తమ అంతేవాసులకైనా చెప్పి, వారిని తరింపజేయవచ్చు కదా! అరివీర భయంకర బూతులతో ప్రతిపక్షాలపై బోరవిరుచుకు పడటమేనా ప్రమాణం? అందులో పరిశోధక పట్టా పుచ్చుకోనివారు ఆ పార్టీలో ఎవరైనా ఉన్నారంటారా! కాబట్టి అదొక్కటే సరిపోదు, ఇంకేదో కావాలి. సారుగారి మాటకు ఎదురాడకపోవడమా? అబ్బెబ్బే... ఇప్పుడంటే కూర్చున్న కుర్చీలను లాగేశారని కొందరు, తమకు పస్తులుపెట్టి ఎవరికో విస్తర్లు వేశారన్న కడుపు మంటతో మరికొందరు మాట్లాడుతున్నారు కానీ, ఆయన అడుగులకు మడుగులొత్తీ ఒత్తీ వెన్నెముకలు అరిగిపోయినవారే కదా అందరూ! ఆ అందరిలోంచి కొందరికి మాత్రమే కొసరికొసరి ఎలా వడ్డించారబ్బా అంటే ఏమో- లోగుట్టు ఆ జగన్నాథుడికే తెలియాలి!

బంతిభోజనంలో అడుగూబొడుగు కూడా దక్కించుకోలేకపోయిన వారి విలాపాగ్నులకు నడిరోడ్ల మీద టైర్లు, బండ్లు కాలి బూడిదవుతున్నాయి కదా... మరి పదవీ పరమాన్నాన్ని రుచిచూసిన అదృష్టవంతుల అమేయ అసమాన అపూర్వ స్వామిభక్తినీ ఓమారు తిలకిద్దాం. పెద్దలకు పాదనమస్కారం చేయడం మన సంప్రదాయం. పిన్నలకు చేస్తే ఆయుక్షీణమని నమ్మకం. దాని సంగతి దేవుడెరుగు... అధినాయకుడి పాదారవిందాలను తాకి తన్మయులం కాకపోతే, కనీసం అయినట్లు అయినా కనిపించకపోతే- తమ రాజకీయ భవిష్యత్తుకు రోజులు మూడతాయన్న భయం మాత్రం కొత్తమంత్రుల్లో చాలామందికి ఉన్నట్లుంది. అందుకే ప్రమాణస్వీకారం చేసిన పెద్దలూ పిన్నల్లో అత్యధికులు మొహమాటమేమీ లేకుండా అధినేతకు మోకరిల్లారు. ముసిముసి నవ్వులతో ఆయన వారిని ఆశీర్వదించారు. జయలలిత రోజుల్లో తమిళనాడు నేతాగణాలు ఇలాగే ‘అమ్మ దయ’ కోసం సాష్టాంగపడేవి. ఆ అద్భుత రాజకీయ చాతుర్యాన్ని వీరూ అమితంగా అందిపుచ్చుకోవడం చూస్తే- అధినాయకస్వామ్యమే అనాదిగా ప్రజాస్వామ్యంగా చలామణీ అవుతోందన్న అనుమానం కలగడం లేదూ! ఆసేతుహిమాచలం అదే పోకడ కదా అంటారా... అంతే కానీ, బహిరంగ పాదసేవలతో ఇప్పుడది మరింతగా వెర్రితలలు వేస్తోందంతే!

‘మేం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు... సీఎంసారే అన్నీ అమలు చేసేస్తున్నారు’ అన్నారొక మంత్రివర్యులు. అటువంటప్పుడు క్యాబినెట్టు ఎందుకు... సకల శాఖామాత్యులుగా ఆయనే సరిపోతారు కదా! పదవులిచ్చినా తమకు పనులేవీ ఇవ్వరని, తమ మీద ఆశలేమీ పెట్టుకోకండని కొంపదీసి ఆ మంత్రిగారు పరోక్షంగా చెబుతున్నారా ఏమిటి? ఏమో... ఏమైనా కావచ్చు! నేతల మాటలకు అర్థాలు, వాటి వెనక పరమార్థాలు ఎన్నయినా ఉండవచ్చు. సామాన్యులకు అవేమి అర్థమవుతాయి... ఒకవేళ అర్థమైనా జరుగుతున్న జగన్నాటకానికి కళ్లప్పగించి చూడటం తప్ప చేసేదేముంది? - ఎన్‌.కె.శరణ్‌

ఇదీ చదవండి : 'కాదేది బాదుడుకు అనర్హం' అన్నట్లుంది వైకాపా తీరు: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.