ETV Bharat / city

ఆ పని చేసి భాజపా నేతలు క్రెడిట్ తీసుకోవచ్చు: సజ్జల

author img

By

Published : Jun 17, 2021, 6:18 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసేటప్పుడు తన గురించి తాను ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ధాన్యం సేకరణ అంశంలో భాజపా నేతల ఆరోపణలను తప్పుబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ.3 వేల కోట్లు ఉన్నాయని... వీటిని భాజపా నేతలు విడుదల చేయించి క్రెడిట్ తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి

సజ్జల రామకృష్ణారెడ్డి

రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్​కు చంద్రబాబు రాసిన లేఖ అసత్యాలమయం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలను సజ్జల ఖండించారు. తన హయాంలో 8 గంటల్లో రైతులకు ధాన్యం సేకరణ డబ్బులిచ్చానని చంద్రబాబు లేఖలో రాయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెదేపా హయాంలో రైతుల బకాయిలు వెయ్యి కోట్లు మిగిల్చితే... వైకాపా ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఎక్కడా గిట్టుబాటు ధర దక్కలేదని, కౌలు రైతులకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు.

వైకాపా ప్రభుత్వం వచ్చాకే...

వైకాపా ప్రభుత్వం వచ్చాక కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. రైతులు పండించిన ప్రతి గింజను సేకరించడం సహా గిట్టబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్​పుట్ సబ్సిడీ, బీమా మొత్తాన్ని క్యాలెండర్ ప్రకారం రైతులకు అందిస్తున్నామని వెల్లడించారు. ధాన్యం సేకరణ అంశంలో భాజపా నేతల ఆరోపణలను తప్పుబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ.3 వేల కోట్లు ఉన్నాయని... వీటిని భాజపా నేతలు విడుదల చేయించి క్రెడిట్ తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.

హేతుబద్ధంగా ఆస్తి పన్ను...

రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ లెక్కగట్టి హేతుబద్ధంగా ఆస్తి పన్ను విధిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. భాజపా పాలిత రాష్ట్రాలు కర్ణాటక, గుజరాత్​లోనూ ఆస్తి పన్ను పెంచిన విషయం గుర్తుచేశారు. ఆస్తిపన్ను పెంపు వల్ల కేవలం రూ.186 కోట్లు మాత్రమే ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. చంద్రబాబు చేస్తోన్న ఆరోపణలపై ఒకసారి తనను తాను ఆలోచించుకోవాలని హితవు పలికారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు నోటీసుల గురించి తెలియదన్న సజ్జల... విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారికి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేస్తామని చెప్పారు.

ఇదీ చదవండీ... Chandrababu: 'ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.