ETV Bharat / city

దినపత్రిక కొనుగోలుకు ..వాలంటీర్లకు డబ్బులు

author img

By

Published : Jul 3, 2022, 3:32 AM IST

రాష్ట్రంలో దినపత్రిక కొనుగోలుకు గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రతి నెల 200 రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 29న వైకాపా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు సమకాలీన అంశాలపై మరింత అవగాహన, పరిజ్ఞానం పెంచుకునేందుకు వీలుగా విస్తృతమైన సర్క్యులేషన్‌ కలిగిన దినపత్రిక కొనుక్కొనేందుకు 200 రూపాయలు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

newspaper
newspaper

ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు, సమకాలీన అంశాలపై మరింత అవగాహన, పరిజ్ఞానం పెంచుకునేందుకు వీలుగా.. విస్తృతమైన సర్క్యులేషన్‌ కలిగిన దినపత్రిక కొనుక్కునేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రతి నెలా రూ.200 చొప్పున ఇవ్వనున్నారు. ఈ మేరకు జూన్‌ 29న ప్రభుత్వం ఇచ్చిన జీవో శనివారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పథకాలు, సేవలపై ఏదైనా మీడియాగానీ, వ్యక్తులుగానీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, ఆ విషయాన్ని ప్రజలకు వివరించేందుకు వారికి దినపత్రిక కొనేందుకు డబ్బులు ఇస్తున్నట్టు తెలిపింది. ‘సంక్షేమ పథకాలు ప్రతి పౌరుడికీ చేరేందుకు, ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, వాటి ప్రయోజనాల గురించి తెలియజెప్పేందుకు ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. కాబట్టి వాలంటీర్లంతా ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, పథకాల్లో చేసే మార్పుల గురించి క్షుణ్నంగా తెలుసుకోవలసిన అవసరం ఉంది. అప్పుడే వారు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజల్లో ఉన్న భయాల్నీ, ఆందోళనల్నీ తొలగించగలరు’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రూ.250 ఇవ్వాలని ప్రతిపాదన..
వాలంటీర్లు దినపత్రిక కొనుక్కునేందుకు నెలకు రూ.250 చొప్పున అదనంగా చెల్లించాలని గ్రామ/ వార్డు వాలంటీర్లు, సచివాలయాల విభాగం డైరెక్టర్‌ ప్రతిపాదించారని.. ప్రభుత్వం పరిశీలించాక నెలకు రూ.200 చొప్పున ఇవ్వాలని నిర్ణయించిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022 జులై నుంచి 2023 మార్చి వరకు ఆ సదుపాయంవర్తింపజేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.66 లక్షల మంది వాలంటీర్లున్నారు. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున నెలకు రూ.5.32 కోట్లు, 9 నెలలకు ప్రభుత్వంపై రూ.47.88 కోట్ల అదనపు భారం పడుతుంది. మార్చి తర్వాత ఈ సదుపాయాన్ని మరింత కాలం పొడిగిస్తూ జీవో ఇవ్వనున్నారు.

మొదట్లో గౌరవ వేతనమే అన్నారు..
వాలంటీర్లకు నెలకు రూ.5 వేలు గౌరవవేతనం ఇస్తామని ప్రభుత్వం మొదట చెప్పింది. రెండేళ్ల కిందట వేతనాలు పెంచాలని ఆందోళనకు దిగడంతో అప్పటి నుంచి వారికి ఏటా సత్కార కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆ పేరుతో దాదాపు వాలంటీర్లందరికీ రూ.10వేల చొప్పున అక్టోబరు 2న నగదు పురస్కారం అందజేస్తోంది. పనితీరు ఆధారంగా నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర పేరుతో రూ.30వేల చొప్పున, మరో 20మందికి సేవా రత్న పేరుతో రూ.20వేల చొప్పున నగదు అందిస్తోంది. దీనికి ఏటా రూ.250 కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది.

..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.