ETV Bharat / city

నత్తనడకన ప్రాంతీయ రింగు రోడ్డు పనులు.. అదే కారణమా?

author img

By

Published : Jul 7, 2022, 9:04 AM IST

తెలంగాణలో ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణ పనులు నెమ్మదించాయి. రెండు, మూడు నెలలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. భూసేకరణ ప్రక్రియ మొదలైనవి పూర్తయి.. అన్నీ కొలిక్కివచ్చి రహదారి పనులు ఎప్పటికి ముందడుగు పడతాయన్నది చర్చనీయాంశమైంది.

regional ring road
ప్రాంతీయ రింగు రోడ్డు

తెలంగాణలో ప్రాంతీయ రింగు రోడ్డు పురోగతి ప్రస్తుతం మందగమనంలో సాగుతోంది. సంగారెడ్డి - నర్సాపూర్‌ - తూప్రాన్‌ - గజ్వేల్‌ - జగ్‌దేవ్‌పూర్‌ - భువనగిరి - చౌటుప్పల్‌ మార్గంలో 158.645 కిలోమీటర్ల మేర తొలుత నిర్మించ తలపెట్టిన ఉత్తర భాగానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఏడాది క్రితం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత చకచకా సాగిన ప్రక్రియ కొంతకాలంగా నెమ్మదించింది. రెండు, మూడు నెలలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విభేదాలే అందుకు కారణమా? అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

  • తొలి భాగానికి భారీగా భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో భూ సేకరణ చేపడితే గ్రామాల్లో వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
  • తొలిదశ రహదారి నిర్మాణానికి 4,760 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉంది. ఆ మార్గం వెళ్లే గ్రామాల ప్రాథమిక జాబితాకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడినప్పటికీ తుది జాబితా ఇంతవరకు ఖరారు కాలేదు.
  • భూసేకరణ కోసం అధికారుల నియామకం పూర్తయి 3నెలలు కావస్తోంది. ముందుకెళ్లేందుకు గెజిట్‌ నోటిఫికేషన్లు, అనుమతులు రాక వారు ఇతర పనుల్లో తలమునకలయ్యారు.
  • భూమిని కోల్పోయినవారికి ఎంత నష్టపరిహారం చెల్లించాలన్నదీ ఖరారు కాలేదు.

భూసేకరణకు ఎంత సమయం పట్టొచ్చు?
అన్నీ సజావుగా సాగుతాయనుకున్నా భూ సేకరణ ప్రారంభించేందుకు కనీసం మరో నెలన్నర పడుతుందని అంచనా. గతంలో జాతీయ రహదారుల సంస్థ నియమించిన కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయిలో రహదారిని గుర్తిస్తూ మార్కింగ్‌ చేసింది. ఆపై తుది అలైన్‌మెంట్‌ అధికారులు ఆయా గుర్తులు సక్రమంగా ఉన్నాయా? లేదా? అన్నది మరోదఫా నిర్ధారించాలి. అనంతరం రెవెన్యూ అధికారులు ఆయా భూముల హక్కుదారులెవరు? ప్రస్తుతం అవి ఎవరి నియంత్రణలో ఉన్నాయి? తదితర సమాచారాన్ని సేకరించి నివేదిక రూపొందించాలి. అప్పుడు భూయజమానులకు నోటీసులు ఇవ్వాలి. వారి అభ్యంతరాలను స్వీకరించటంతోపాటు పరిష్కరించాల్సి ఉంటుంది. భూనిర్వాసితులు కోర్టును ఆశ్రయిస్తే సంబంధిత దస్త్రాలు రూపొందించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకోవటంతో అన్ని ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రింగురోడ్డు వస్తుందన్న ప్రచారంతో ఉత్తర భాగంలో ధరలు మరింత పెరిగాయి. దీంతో భూసేకరణకు చిక్కులు తప్పవన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. రింగురోడ్డు వెళ్లే గ్రామాల పేర్లను కేంద్రం గతంలో ప్రకటించింది. 11 ప్రాంతాల్లో జంక్షన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. వాటి పరిధిలో ఎంత భూమి సేకరించాలన్నదీ గుర్తించారు. ఈ నేపథ్యంలో గ్రామాల పరిధిలో ఇప్పటికే 150కి పైగా ఫిర్యాదులు వచ్చినటు సమాచారం. అన్నీ కొలిక్కివచ్చి రహదారి పనులు ఎప్పటికి ముందడుగు పడతాయన్నది చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.