ETV Bharat / city

తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు పట్టే అవకాశం!

author img

By

Published : Mar 16, 2021, 12:15 AM IST

అసలే భారీ సంఖ్యలో అభ్యర్థులతో జంబో బ్యాలెట్.. ఆపై రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరు.. ఇప్పుడు ఓట్ల లెక్కింపునకు సవాల్​గా మారింది. ఒక్కో నియోజకవర్గంలో మూడున్నర లక్షలకు పైగా ఓట్లను ప్రాధాన్యతా క్రమంలో లెక్కించాలి. ఈ నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియ సుధీర్ఘంగా సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు పట్టే అవకాశం!
తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు రెండు రోజులు పట్టే అవకాశం!

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రెండు నియోజకవర్గాల్లో సగటున 71.83 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గతంలో కంటే దాదాపు 25 శాతానికి పైగా పోలింగ్ శాతం పెరిగిందని తెలిపారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గంలో 76.41 శాతం పోలింగ్​తో 3,86,320 ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ నియోజకవర్గంలో 67.26 శాతం పోలింగ్ నమోదైంది. 3,57,354 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుత ఎన్నికలకు పోలింగ్ శాతం ఏకంగా 30 శాతం పెరిగింది. ఫలితంగా ఓట్ల లెక్కింపు అధికారులకు సవాల్​గా మారనుంది.

ఇలా చేయాల్సి ఉంటుంది..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమంలో పోలైన ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. మొదటగా పోలైన ఓట్లలో సరిగ్గా ఉన్న వాటిని గుర్తిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓట్లను తిరస్కరిస్తారు. సక్రమమైన ఓట్లు ఉన్న బ్యాలెట్ పత్రాలన్నింటినీ కట్టలుగా కట్టి.. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పెడతారు. ఆ తర్వాత అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల లెక్కింపు చేపడతారు. ప్రస్తుతం పోలైన ఓట్లను పరిశీలిస్తే 7 రౌండ్లలో మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.

తక్కువ ఓట్లు వచ్చిన వారు ఎలిమినేట్​..

మూడున్నర లక్షలకు పైగా పోలైన వాటిలో సక్రమంగా వచ్చిన ఓట్లను గుర్తించి, వాటిని 25 చొప్పున కట్టలుగా కట్టేందుకే చాలా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక నియోజకవర్గంలో 93 మంది, మరో నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫలితంగా అభ్యర్థుల తొలగింపు ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఆరోహణా క్రమంలో ఎలిమినేట్​ చేస్తారు. వారికి వచ్చిన ఓట్లలో వచ్చిన రెండో ప్రాధాన్యతా ఓట్లను ఇతర అభ్యర్థులకు బదలాయిస్తారు. అలా పోలైన ఓట్లలో సగం వచ్చే వరకు ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా సుధీర్ఘంగానే సాగనుంది. దాదాపుగా రెండు రోజులు, ఆ పైగా లెక్కింపు జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

3 షిఫ్టుల్లోనూ సిబ్బంది..

లెక్కింపు కేంద్రంలో ఒక్కో టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్​వైజర్, ఇద్దరు అసిస్టెంట్లతో పాటు ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. నిరంతరాయంగా సుధీర్ఘంగా లెక్కింపు సాగనున్న నేపథ్యంలో 3 షిఫ్టుల్లోనూ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు మరో 20 శాతం సిబ్బందిని అదనంగా అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్​నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 806 మంది, నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.

ఇదీ చూడండి:మేయర్లు, ఛైర్మన్ల ఎంపికపై సీఎం సుదీర్ఘ కసరత్తు.. 18న ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.