ETV Bharat / city

PV Narasimaharao District: మళ్లీ తెరపైకి పీవీ జిల్లా.. కొత్తది ఏర్పాటు చేయాలని వినతులు

author img

By

Published : Jun 8, 2021, 12:18 PM IST

పీవీ నరసింహారావు జిల్లా.. ఇప్పుడు ఈ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో.. గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో హుజూరాబాద్‌ కేంద్రంగా ఈ జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. అది చేస్తే కరీంనగర్‌ జిల్లా పరిధి చాలా తగ్గుతుందని, హుజూరాబాద్‌ అటు కరీంనగర్‌కు, ఇటు వరంగల్‌కు సమీపంలో ఉందనే భావనతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. తాజాగా పీవీ శతజయంత్యుత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 28న పీవీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ పీవీ జిల్లాను ప్రకటించాలనే వినతులు మొదలయ్యాయి.

pv narsimha rao
మళ్లీ తెరపైకి పీవీ జిల్లా

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ నగర జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌తో పాటు కరీంనగర్‌ జిల్లాలో ఉన్న హుజూరాబాద్‌, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, సైదాపూర్‌, చిగురుమామిడి మండలాలను కలుపుతూ హుజూరాబాద్‌ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని సాధన సమితి నేతలు కోరుతున్నారు. కొంత మంది పీవీ అభిమానులు మాత్రం కొత్త జిల్లా ఏర్పాటు సాధ్యం కాదనుకుంటే వరంగల్‌ నగర, వరంగల్‌ గ్రామీణ, కరీంనగర్‌, పెద్దపల్లి.. వీటిల్లో ఒకదానికి ఆయన పేరు పెట్టాలని కోరుతున్నారు.

పీవీ స్వగ్రామం వంగర వరంగల్‌ నగర జిల్లా పరిధిలో ఉండగా.. ఆయన జన్మించిన ఊరు లక్నెపల్లి నర్సంపేట నియోజకవర్గంలోని వరంగల్‌ గ్రామీణ జిల్లాలో ఉంది. వరంగల్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలతో పీవీకి అనుబంధం ఉంది. 1957 నుంచి 77 వరకు ఆయన మంథని ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం అది పెద్దపల్లి జిల్లాలో ఉంది. 77 నుంచి 84 వరకు హన్మకొండ ఎంపీగా పనిచేశారు. ఈ పార్లమెంటు స్థానం వరంగల్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండేది.

కొత్తది ఏర్పాటు చేస్తే..

ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలుండగా మరో జిల్లా ఏర్పాటైతే జిల్లాల పరిధి ఇంకా తగ్గుతుంది. ప్రధానంగా జోనల్‌ వ్యవస్థ జిల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. దీని ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ దశలో మరో జిల్లా ఏర్పాటుకు పూనుకుంటే ఉద్యోగ నియామకాలలో తీవ్ర జాప్యం జరుగుతుందనే భావన అధికారవర్గాల్లో ఉంది. మంగళవారం జరిగే కేబినెట్‌ భేటీలో పీవీ జిల్లా ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి:

'ఈ పరీక్షలు మాకొద్దు': తెదేపా నేత వినూత్న నిరసన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.