ETV Bharat / city

Power Cuts: ఎడాపెడా విద్యుత్​ కోతలు.. ప్రతి జిల్లాలోనూ రెండు మూడు గంటలు

author img

By

Published : Apr 1, 2022, 6:01 AM IST

Updated : Apr 1, 2022, 6:34 AM IST

power cuts: రాష్ట్రంలో డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరా చేయడంలో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు చేతులెత్తేశాయి.లోడ్‌ సర్దుబాటు పేరుతో డిస్కంలు ప్రతి జిల్లాలోనూ 2,3 గంటల కోత విధిస్తున్నాయి. కోతలను మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. దీంతో ఏ సమయంలో విద్యుత్‌ సరఫరా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

power cuts
power cuts

power cuts: వేసవి ఉష్ణోగ్రతలు పెరగటంతో డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరా చేయడంలో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు చేతులెత్తేశాయి. డిమాండ్‌, సరఫరా మధ్య బుధ, గురువారాల్లో సుమారు 20 మిలియన్‌ యూనిట్ల వ్యత్యాసమేర్పడింది. లోడ్‌ సర్దుబాటు పేరుతో డిస్కంలు ప్రతి జిల్లాలోనూ 2,3 గంటల కోత విధిస్తున్నాయి. కోతలను మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. దీంతో ఏ సమయంలో విద్యుత్‌ సరఫరా ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఏప్రిల్‌ ఆరంభంలోనే విద్యుత్‌ డిమాండ్‌ 235 ఎంయూలకు చేరింది. వారంలోగానే 240 ఎంయూలు దాటుతుందని అంచనా. దేశవ్యాప్తంగా గిరాకీ పెరగటంతో బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ విద్యుత్‌ ధరలు భారీగా పెరిగాయి. పీక్‌ డిమాండ్‌ (సాయంత్రం6 నుంచి రాత్రి 10గంటలు) సమయంలో యూనిట్‌ ధర రూ.20పెట్టి కొనాల్సి వస్తోంది. రాష్ట్రంలో మార్చి 1న 207.72 ఎంయూల విద్యుత్తు వినియోగం ఉంది. తాజా డిమాండ్‌ సర్దుబాటు కోసం బహిరంగ మార్కెట్‌నుంచి రోజూ 45-50 ఎంయూలు కొనాల్సి వస్తోంది. నెలకిందటి వరకు బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ సగటున రూ.4-5 మధ్య చెల్లించిన విద్యుత్‌ సంస్థలు ఇప్పుడు రూ.7 చెల్లించాల్సి వస్తోంది. ఏపీఈఆర్‌సీ అనుమతించిన రూ.3.86కంటే దాదాపు రెట్టింపు మొత్తం ఇది. గరిష్ఠ వినియోగం సమయంలో యూనిట్‌ రూ.20పెట్టి కొందామన్నా దొరకటం లేదు.

మరో వారం ఇంతే?: జెన్‌కో థర్మల్‌ యూనిట్లనుంచి బుధవారం 75.15 ఎంయూలు, జలవిద్యుత్‌ 9.23, పవన విద్యుత్‌ 9.21, సౌరవిద్యుత్‌ 13.11, ఇతర ఉత్పత్తి సంస్థల నుంచి 6.5 ఎంయూల విద్యుత్‌ వచ్చింది. కేంద్ర విద్యుత్‌ సంస్థలు, బహిరంగ మార్కెట్‌నుంచి 95.95 ఎంయూల విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి. జాతీయ గ్రిడ్‌నుంచి 6 ఎంయూలను అదనంగా తీసుకున్నాయి. అయినప్పటికీ అప్రకటిత కోతలు తప్పడం లేదు. ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగించే విద్యుత్‌ 20 ఎంయూల వరకుంది. మరో వారంపాటు వ్యవసాయానికి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ వినియోగం తగ్గేవరకు అప్రకటిత కోతలు తప్పవని ఒక అధికారి తెలిపారు.

ఇదీ చదవండి: పలు జిల్లాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా... ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు

Last Updated : Apr 1, 2022, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.