ETV Bharat / city

APPSC: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకాన్ని రద్దు చేయండి

author img

By

Published : Jun 19, 2022, 7:43 AM IST

APPSC: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌, ఎనిమిది మంది సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం కాకుండా.. సామర్థ్యం, అర్హత, యోగ్యత, నిష్పాక్షిక దృక్పథం, నైతిక నిష్ఠ లేనివారిని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులుగా నియమించారని, వారిలో ఎక్కువ మంది అధికార పార్టీ వైకాపాతో అనుబంధ కలిగి ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

pil filed in high court over appointing chairman and eight others in appsc
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకాన్ని రద్దు చేయండి

APPSC: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌, ఎనిమిది మంది సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ ..హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఎంపిక ప్రక్రియను చేపట్టకుండా రాజకీయ నాయకులు, ఔషధ దుకాణం యజమాని, ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్‌ అధికారి, పాస్టర్‌, రాజకీయ పార్టీ విద్యార్థి నేతను సభ్యులుగా నియమించారంటూ.. హైకోర్టు న్యాయవాది తాండవ యోగేశ్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అర్హత లేని కొందరిని ఏపీపీఎస్సీలో సభ్యులుగా నియమించి, దాన్ని రాజకీయ పునరావాస వేదికగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం కాకుండా.. సామర్థ్యం, అర్హత, యోగ్యత, నిష్పాక్షిక దృక్పథం, నైతిక నిష్ఠ లేనివారిని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులుగా నియమించారని, వారిలో ఎక్కువ మంది అధికార పార్టీ వైకాపాతో అనుబంధ కలిగి ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ నియామకాల జీవోలను రద్దు చేయాలని కోరారు. నియామక దస్త్రాలు, ఛైర్మన్‌, సభ్యుల దరఖాస్తులు, నోట్‌ ఫైల్స్‌, ఏ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నియమించారో ఆ వివరాల్ని కోర్టు ముందుంచేలా సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించాలని కోరారు.

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకం విషయంలో మెమొరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌, పరిపాలన సంబంధ మార్గదర్శకాలను రూపొందించి, అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌, సభ్యులు కె.విజయకుమార్‌, ప్రొ.కె.పద్మరాజు, డాక్టర్‌ జీవీ సుధాకర్‌రెడ్డి, ఎస్‌.సలాంబాబు, ఏవీ రమణరెడ్డి, పి.సుధీర్‌, నూతలపాటి సోనీవుడ్‌, ఎన్‌.సుధాకర్‌రెడ్డి, ఏపీపీఎస్సీ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ చేయనుంది.

పిటిషన్‌లోని వివరాలివీ.. ‘అధికరణ 316.. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఛైర్మన్‌, సభ్యుల నియామకాల్లో ఫలానా విధానాన్ని అనుసరించాలని, ఫలానా అర్హతలు ఉండాలని నిర్దిష్టంగా పేర్కొనలేదు. అయినప్పటికీ నియమితులయ్యేవారికి సమర్థత, నైతిక నిష్ఠ ఉండాలి. వారికి తగిన సామర్థ్యం ఉందా, అర్హులేనా అనే అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. 2021 నవంబర్‌ 17న జీఏడీ ముఖ్యకార్యదర్శికి సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేశాను.

ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు అనుసరిస్తున్న మెమొరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌, పరిపాలన సంబంధ మార్గదర్శకాలు, 2013 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు వచ్చిన దరఖాస్తులు, నోట్‌ ఫైల్స్‌ ఇవ్వాలని కోరాను. ఆ దరఖాస్తును జీఏడీ పౌరసమాచార అధికారి (పీఐవో).. ఏపీపీఎస్సీకి బదిలీ చేశారు. నియామకాలు అధికరణ 316(1)కి అనుగుణంగా జరిగాయని, ఫైళ్లు తమ వద్ద లేవని ఏపీపీఎస్సీ పీఐవో సమాచారం ఇచ్చారు.

వాటిని పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఛైర్మన్‌, సభ్యులుగా తనకు నచ్చినవారిని ప్రభుత్వం నియమించుకుందని తెలుస్తోంది. ఇది కమిషన్‌ పవిత్రతను, ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది.

  • ఛైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న గౌతం సవాంగ్‌ గతంలో వివిధ హోదాల్లో పోస్టులు నిర్వహించారు. ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం ఏపీపీఎస్సీ హుందాతనాన్ని పెంచుతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఆయన్ను ప్రతిభ, ట్రాక్‌ రికార్డు పరిశీలించి నియమించారా? ఇతర సభ్యుల మాదిరిగానే ఆయన్నూ నియమించారా అనేది స్పష్టత లేదు.
  • సభ్యులు కె.విజయకుమార్‌ వివరాలు, విద్యార్హతలు, గతంలో నిర్వహించిన పని అనుభవాలేవీ అందుబాటులో లేవు.
  • సభ్యులు ప్రొ.కె.పద్మరాజు గౌరవప్రదమైన విద్యార్హతలు కలిగి ఉన్నా ఆయన నియామకం ప్రతిభ, ట్రాక్‌ రికార్డు పరిశీలించాకే జరిగిందా లేదో తెలియదు.
  • సభ్యులు డాక్టర్‌ జీవీ సుధాకర్‌రెడ్డికి డాక్టరేట్‌ ఉంది. ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్‌ అధికారిగా పని చేశారు. పత్రికల వార్తల ప్రకారం ఆయన అధికార వైకాపాకు చెందినవారు.
  • సభ్యులు ఎస్‌.సలాంబాబు.. కాకతీయ వర్సిటీలో చదువుకున్నారు. వైకాపా విద్యార్థి విభాగం అధ్యక్షుడైన ఆయనకు రాజ్యాంగబద్ధ పోస్టు ఇవ్వడం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను రాజకీయ ఆశ్రయంగా మార్చడమే.
  • సభ్యులు ఏవీ రమణరెడ్డి.. వ్యవసాయశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు సమాచారం ఉంది. పత్రికల కథనాల ప్రకారం ఆయనకు విద్యాసంస్థలున్నాయి. వైకాపాతోనూ బలమైన అనుబంధం ఉంది.
  • సభ్యులు పి.శ్రీధర్‌.. గతంలో ఏపీపీఎస్సీపై పలు రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఆయన విద్యార్హతలు, పనిచేసిన అనుభవం వంటి వివరాలేవీ లభించలేదు. పత్రిక కథనాల ప్రకారం ఆయన వైకాపాకు చెందినవారు.
  • సభ్యులు నూతలపాటి సోనీవుడ్‌.. పాస్టర్‌, రాజకీయ నేత, వైకాపా సభ్యుడు.
  • సభ్యులు ఎన్‌.సుధాకర్‌రెడ్డి వైకాపా రాష్ట్ర కార్యదర్శి అని పత్రికల్లో వచ్చింది. ఆయన ఔషధ దుకాణం నడుపుతున్నారు. సుధాకర్‌ భార్య వైకాపా జడ్పీటీసీ సభ్యురాలు’ అని పిటిషన్‌లో వివరించారు. అనర్హులను, వైకాపాకు అనుబంధంగా ఉన్నవారిని సభ్యులుగా నియమించిన నేపథ్యంలో వారు నియామకాలను రద్దు చేయాలని కోరారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.