ETV Bharat / city

వైద్య అవసరాలు తగ్గినా..  కర్మాగారాలకు సరఫరా లేదు!

author img

By

Published : Jun 17, 2021, 7:23 AM IST

పరిశ్రమలకు ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో వైద్య సేవలకు మాత్రమే ఆక్సిజన్‌ సరఫరా చేయాలని గత ఏప్రిల్‌ 22న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఆసుపత్రులకు మాత్రమే అందిస్తున్నారు. రాష్ట్రానికి రోజుకు 750 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. ఇందులో ప్రస్తుత వైద్య అవసరాలకు రోజుకు 350 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అవసరం. మిగిలిన దాన్ని పరిశ్రమలకు అందిస్తే కోలుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

oxygen supply
oxygen supply

పరిశ్రమలకూ ఆక్సిజన్ కష్టాలు తప్పడం లేదు. వైద్య అవసరాలు తగ్గినా కర్మాగారాలకు సరఫరా లేదు. ప్రభుత్వం ఉత్తర్వుల కోసం నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. 2 నెలలుగా ఆక్సిజన్‌ సరఫరా లేక రాష్ట్రంలో సుమారు 20 వేల పరిశ్రమలు పూర్తిస్థాయిలో పని చేయలేకపోతున్నాయని, ఫలితంగా 50 శాతం ఉత్పత్తి పడిపోయిందని నిర్వాహకులు తెలిపారు. దీనివల్ల ఆయా పరిశ్రమల్లోని సుమారు 1.5 లక్షల మంది ఉపాధిపై ప్రభావం పడుతోంది.

రాష్ట్రంలో 46 ఆక్సిజన్‌ ప్లాంట్లు

ఇంజినీరింగ్‌, మెటల్‌, అల్యూమినియం, ఎంఎస్‌ స్టీలు తయారీ పరిశ్రమలు, ముడి పదార్థాల వేడి, కటింగ్‌ చేసే కర్మాగారాల్లో ఆక్సిజన్‌ వినియోగం ఎక్కువ. వీటి ఆక్సిజన్‌ అవసరాల కోసమే రాష్ట్ర వ్యాప్తంగా 46 యూనిట్లు ఉన్నాయి. సుమారు 600 టన్నుల ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం వీటికుంది. పరిశ్రమల ఉత్పత్తి ఆధారంగా రోజుకు 250-300 టన్నుల ఆక్సిజన్‌ వినియోగం ఉంటుందని అంచనా. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో కర్మాగారాల్లో ఆక్సిజన్‌ వినియోగాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం వైద్య అవసరాలకు డిమాండ్‌ తగ్గినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆయా ప్లాంట్ల నిర్వాహకులు పరిశ్రమలకు సిలిండర్లు సరఫరా చేయడం లేదు. దీంతో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు ప్లాంట్ల నిర్వాహకులు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. రూ.250కే దొరికే సిలిండర్‌ను రూ.1,500 పెట్టి కొనాల్సి వస్తోందని పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్పత్తిపై ప్రభావం

‘ఇనుప కమాన్‌ కట్టల తయారీపరిశ్రమ నిర్వహిస్తున్నా. గ్యాస్‌ కొరత కారణంగా 50 శాతం ఉత్పత్తి కూడా చేయలేకపోతున్నాం. సిలిండర్లను బ్లాక్‌లో కొంటున్నాం. దీనికితోడు ముడి పదార్థాల ధరలు పెరిగాయి. రెండు నెలల్లో టర్నోవర్‌ 10 శాతానికి మించలేదు. కార్మికులకు జీతాలు ఇవ్వటం కష్టంగా ఉంది.’-వినోద్‌బాబు, కమాన్‌ కట్టల తయారీ పరిశ్రమ నిర్వాహకుడు

పనుల్లేక కార్మికులూ తగ్గారు

‘గ్యాస్‌ కటింగ్‌, టింకరింగ్‌, ఇంజిన్‌ రీబోరింగ్‌ వంటి వివిధ పనులపై ఆధారపడి సుమారు లక్ష మంది విజయవాడ ఆటోనగర్‌లో ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం 50 వేల మంది కూడా రావటం లేదు. కర్ఫ్యూ కారణంగా పనిచేసే వ్యవధి తక్కువగా ఉంటోంది. మరమ్మతులకు వచ్చే వాహనాలూ తగ్గాయి. .జీతాలు ఇవ్వడం కష్టమవుతుంది. పనులకు వచ్చే వారు గతంలో రోజుకు రూ.600 సంపాదిస్తే.. ఇప్పుడు రూ.250 మించటం లేదు.’-సుంకర దుర్గాప్రసాద్‌, విజయవాడ ఇండస్ట్రియల్‌ ఏరియా ఛైర్మన్‌

ఇదీ చదవండి:

Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.