ETV Bharat / city

చమురు తెట్టును తినేస్తాయి.. సరికొత్త పరిజ్ఞానాన్ని ఆవిష్కరించిన ఎన్​ఐఒటీ

author img

By

Published : Aug 7, 2022, 9:29 AM IST

NEW TECHNOLOGY: సముద్ర జలాలపై పేరుకుపోయే చమురు తెట్టులను తొలగించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరిజ్ఞానాన్ని కనుగొన్నారు. సముద్ర జీవులపై పరిశోధనలు చేసే చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఐఒటీ) శాస్త్రవేత్తలు నాలుగేళ్లుగా పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు. సముద్ర అంతర్భాగాలకు చేరుకొనే ఎలాంటి హైడ్రోకార్బన్లను అయినా హానికారకం కాకుండా చేయవచ్చని కనుగొన్నారు.

MARESOLE
MARESOLE

MARESOLE: సముద్ర జలాలపై పేరుకుపోయే చమురు తెట్టులను తొలగించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరిజ్ఞానాన్ని కనుగొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను తినే సూక్ష్మజీవులను గుర్తించారు. దీంతో కాలుష్యకారక ఇంధనాలు వాటి హానికారక, విషపూరిత లక్షణాలను కోల్పోయి సాధారణ ద్రవాలుగా మారుతాయి. సముద్ర జీవులపై పరిశోధనలు చేసే చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ(ఎన్‌.ఐ.ఒ.టి.) శాస్త్రవేత్తలు నాలుగేళ్లుగా పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు. సముద్ర అంతర్భాగాలకు చేరుకొనే ఎలాంటి హైడ్రోకార్బన్లను అయినా హానికారకం కాకుండా చేయవచ్చని కనుగొన్నారు. దీనికి ‘మరేసోల్‌ బయో రెమిడియేషన్‌’గా నామకరణం చేశారు.

‘మరేసోల్‌’ ప్రత్యేకతలివే..
* సముద్రాల్లో లీకయ్యే ముడిచమురును ఈ పరిజ్ఞానం ఉపయోగించి సమర్థంగా తొలగించవచ్చు.

* సూక్ష్మజీవులను పొడి రూపంలో ఉంచుతారు. ఈ పొడిని ఉప్పు నీటిలో వేసిన వెంటనే అందులోని సూక్ష్మజీవులు ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి.

* టన్ను పెట్రోలియం ఉత్పత్తులను కిలో పొడితో సుమారు 60 రోజుల వ్యవధిలో హానిరహితంగా మార్చవచ్చు.

* ఈ సూక్ష్మజీవులకు పెట్రోలియం ఉత్పత్తులే ఆహారం. అందువల్ల పెట్రో ఉత్పత్తులను తినేసిన తరువాత ఆహారం దొరక్క చనిపోతాయి. అందువల్ల తరువాత రోజుల్లో వీటితో ఎలాంటి ప్రమాదం తలెత్తే అవకాశం ఉండదు.

ఈ పరిజ్ఞానం పర్యావరణహితం: డాక్టర్‌ ధరణి, శాస్త్రవేత్త, ఎన్‌.ఐ.ఒ.టి., చెన్నై

సముద్ర కాలుష్యాలను నియంత్రించడానికి మేం అభివృద్ధి చేసిన పరిజ్ఞానం పూర్తిగా పర్యావరణ హితమైంది. పొడిని చల్లిన నిర్ణీత వ్యవధి తరువాత హానికారక ఇంధనాలు సాధారణ ద్రవాలుగా మారుతాయి. దీన్ని ‘బయోరెమిడియేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం హైడ్రోకార్బన్‌ ఇన్‌ మెరైన్‌ ఎన్విరాన్‌మెంట్‌’గా పేర్కొంటాం. దీనిపై మేధోసంపత్తి హక్కులకు పంపాం.

అంతర్జాతీయ సంస్థకు బదలాయిస్తున్నాం: డాక్టర్‌ బి.కె.సాహు, ప్రాంతీయ మేనేజర్‌, జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్‌, విశాఖపట్నం

ముంబయికి చెందిన ‘ఆయిల్‌ స్పిల్‌ కంబాట్‌ టీం ఎల్‌.ఎల్‌.పి.’ అనే సంస్థ ఈ పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. సముద్ర కాలుష్య నియంత్రణ సేవలందించే ఆ అంతర్జాతీయ సంస్థ పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.