ETV Bharat / city

దగదర్తి నుంచి విమానాలు ఎగిరేదెప్పుడు?

author img

By

Published : Jun 25, 2022, 5:27 AM IST

నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో గుత్తేదారు సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని వైకాపా ప్రభుత్వం రద్దు చేసి సుమారు మూడేళ్లు పూర్తవుతోంది. కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఇప్పటికీ సిద్ధం కాలేదు. భూ వివాదాలు పరిష్కారానికి నోచుకోవటం లేదు. దీంతో దగదర్తి నుంచి విమానాలు ఎగిరేదెప్పుడని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Dagadarti Airport
దగదర్తి నుంచి విమానాలు

నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదన మూడేళ్లుగా ముందుకు కదలడం లేదు. దీంతో పాటు ప్రతిపాదించిన కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయ నిర్మాణ పనులు గత ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయ్యాయి. దీన్ని సీఎం జగన్‌ 2021లో ప్రారంభించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం నుంచి ఇప్పటికే సేవలు అందుబాటులోకి వచ్చాయి. దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో గుత్తేదారు సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని వైకాపా ప్రభుత్వం రద్దు చేసి సుమారు మూడేళ్లు పూర్తవుతోంది. కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఇప్పటికీ సిద్ధం కాలేదు. డీపీఆర్‌ తయారీ బాధ్యతను ఏపీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి రాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) అప్పగించింది. ఇది సిద్ధం కావడానికి మరికొన్ని నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. డీపీఆర్‌ను మంత్రి మండలి ఆమోదించిన తర్వాత.. రిక్వెస్ట్‌ ఫర్‌ సెలక్షన్‌ (ఆర్‌ఎఫ్‌ఎస్‌) ప్రకటన జారీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుందని అధికారులు అంటున్నారు.

తొలుత యాజమాన్య విధానం.. ఇప్పుడు పీపీపీ విధానం
దగదర్తి విమానాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో(పీపీపీ) రూ.368 కోట్లతో నిర్మించేలా నెల్లూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌కు (ఎన్‌ఐఏపీఎల్‌) గత ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. దీని కోసం 1,352 ఎకరాల భూములు సేకరించాల్సి ఉందని ప్రతిపాదించారు. ఇందులో సుమారు 1,100 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. రైతులకు పరిహారాన్ని కూడా చెల్లించారు. సుమారు 300 ఎకరాలకు సంబంధించి పరిహారం చెల్లింపులో వివాదం నెలకొంది. వైకాపా అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో పనులు దక్కించుకున్న ఎన్‌ఐఏపీఎల్‌ పరస్పర అంగీకారంతో 2019 ఆగస్టులో ఒప్పందం నుంచి వైదొలిగింది. ఆ తర్వాత యాజమాన్య విధానంలో విమానాశ్రయ నిర్మాణాన్ని చేపట్టాలని భావించి ప్రతిపాదనలను రూపొందించారు. ఇప్పుడు మళ్లీ పీపీపీ పద్ధతిలోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని అధికారులు నిర్ణయించి కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు.

భూముల వివాదం కొలిక్కి రాలేదు
విమానాశ్రయం కోసం సేకరించిన భూముల్లో ఇంకా సుమారు 252 ఎకరాలకు పరిహారం చెల్లించే విషయంలో నెలకొన్న వివాదం పరిష్కారం కాలేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూములు రైతుల పేరిట ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం వేరే వారి అధీనంలో ఉన్నాయి. ఈ వివాదం పరిష్కరించడంపై అధికారులు ఇప్పటి వరకు దృష్టి సారించలేదు.

ఇదీ చూడండి: హిందూపురం వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు.. ప్రెస్ క్లబ్​పై రాళ్ల దాడి

'సమస్యలు పరిష్కరించండి... లేకుంటే సమ్మె చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.