ETV Bharat / city

Lokesh letter to CM: సీఎం జగన్​కు నారా లోకేశ్​ లేఖ... ఎందుకోసమంటే..?

author img

By

Published : Oct 12, 2022, 5:05 PM IST

Nara Lokesh letter to CM Jagan: సర్పంచ్​లపై కేసులు ఎత్తివేయాలని సీఎం జగన్​కు నారా లోకేశ్​ లేఖ రాశారు. ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లించిన పంచాయతీ నిధులను వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని లేఖలో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు.

Nara Lokesh
నారా లోకేశ్​

Nara Lokesh letter to CM Jagan: సర్పంచ్​లపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తి వేయాలంటూ సీఎంకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ లేఖ రాశారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు అక్రమంగా మ‌ళ్లించుకున్న వైకాపా స‌ర్కారు దోపిడీపైనే సర్పంచ్​లు ఆందోళ‌న‌కు దిగారని లోకేశ్​ లేఖలో పేర్కొన్నారు. మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న స్థానిక సంస్థలను మూడున్నర సంవత్సరాలుగా నిర్వీర్యం చేశారని లోకేశ్ ధ్వజమెత్తారు. కేంద్రం విడుదల చేసిన రూ.7వేల 660 కోట్లను పంచాయతీల ఖాతాల నుంచి దారి మళ్లించారని పేర్కొన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.948 కోట్ల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అన్యాయమని లోకేశ్​ ఆక్షేపించారు. ఆ సొమ్మును విద్యుత్ బిల్లులకు చెల్లించామని పేర్కొనడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. 1984 నుంచి గ్రామ పంచాయతీలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులు విద్యుత్ బిల్లుల పేరుతో లాక్కోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సర్పంచులకు చెప్పకుండా, చెక్కులపై సర్పంచ్​ల సంతకాలు లేకుండా నిధులు లాక్కోవడం దొంగిలించడమేనని లోకేశ్ ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామాల్లోని విద్యుత్ దీపాలకు మీటర్లు, వాటి బిల్లుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఒక్కో పంచాయతీకి సగటున రూ.60 లక్షల బిల్లు సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల కారణంగా పంచాయతీల ఖాతాల్లో నిధులు లేక సర్పంచ్​లు పాల‌న‌ను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ వంటి ఎన్నో సమస్యలపై ప్రజలు నిలదీస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వందలాది మంది సర్పంచ్​లు చేసిన అప్పులు తీర్చలేక ప‌నుల‌కు వెళ్లి కుటుంబాలను పోషించుకుంటున్నారని వాపోయారు. రోడ్లు ఊడ్చేవారికి జీతాలు ఇవ్వలేక కొంతమంది తామే ముందుకు వచ్చి రోడ్లు ఊడుస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కోసం కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయన్నారు. పంచాయతీ ఖాతాల నుంచి దోచేసిన సొమ్మును తక్షణమే ఆయా ఖాతాల్లో జమ చేయాలని కోరారు.

పంచాయ‌తీల అభివృద్ధికి అద‌నంగా నిధులివ్వాల్సిన స‌ర్కారు... కేంద్రం విడుద‌ల చేస్తున్న ఆర్థిక సంఘం నిధులు దోచేయ‌డం నేరం కాదా అని లోకేశ్​ ప్రశ్నించారు. ఇప్పటికైనా ర‌క‌ర‌కాల పేర్లతో పంచాయ‌తీల నిధులు అక్రమ మ‌ళ్లింపును ఆపాలని కోరారు. సర్పంచులు న్యాయబద్దంగా డిమాండ్ చేస్తున్న గౌరవ వేతనం, హెల్త్ కార్డ్స్, బీమా, ప్రోటోకాల్ అంశాలు వెంటనే పరిష్కరించాలని నారా లోకేశ్​ లేఖ ద్వారా డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.