ETV Bharat / city

నిధులు లేవు.. కరోనా విధులెలా.!

author img

By

Published : May 16, 2021, 7:33 AM IST

 Municipalities struggling with a lack of funding
Municipalities struggling with a lack of funding

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత దశలో నిధుల కొరతతో పట్టణ స్థానిక సంస్థలు అల్లాడుతున్నాయి. కొవిడ్‌ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా కొన్ని చోట్ల పురపాలక, నగర పంచాయతీలు దిక్కులు చూస్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందక, కరోనా ప్రభావంతో స్థానికంగా వనరుల సమీకరణ నిలిచిపోవడంతో పారిశుద్ధ్య కార్మికులకు పలు చోట్ల రెండు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేదు.

రాష్ట్రంలోని 125 పట్టణ స్థానిక సంస్థల్లో నగరపాలక సంస్థలు, కొన్ని పురపాలక సంఘాలు ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉన్నా ప్రత్యేకించి మూడో గ్రేడు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఆదాయం కంటే వీటిలో పని చేసే కాంట్రాక్టు సిబ్బంది, కార్మికుల వేతనాలు, తాగునీటి సరఫరా, వీధి దీపాల విద్యుత్తు ఛార్జీల ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి.

రెండో విడతతో మరింత భారం..
రెండో దశ కరోనా వ్యాప్తి పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత దెబ్బ తీస్తోంది. పన్నుల వసూళ్లు 60 శాతానికి తగ్గాయి. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడంతో పన్నుయేతర ఆదాయం పడిపోయింది. ఈ నేపథ్యంలో కరోనా సహాయక కార్యక్రమాల్లోనూ స్థానిక సంస్థలను భాగస్వాములను చేయడంతో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న చోట్ల వీటి నిర్వహణ అధికారులకు సవాల్‌గా తయారైంది.

కరోనా బాధ్యతలివి...
* కొవిడ్‌ ఆసుపత్రులు, కేంద్రాల్లో పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించి నిరంతరాయంగా సేవలు అందేలా చూడాలి. ఇందుకోసం సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వాలి.
* కొవిడ్‌ ఆసుపత్రుల్లో మృతి చెందిన వారిని శ్మశాన వాటికలకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేయాలి. ఇందుకోసం ప్రత్యేక వాహనాలు, సిబ్బందిని కేటాయించాలి.
* కరోనా కేసులు ప్రబలిన చోట, మరణాలు సంభవించిన ప్రాంతాల్లోనూ ఎప్పటికప్పుడు హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని, బ్లీచింగ్‌ చల్లించాలి.
* కరోనా టీకా కేంద్రాల్లో ప్రజలకు అసౌకర్యం లేకుండా టెంట్లు, తాగునీరు, కుర్చీలు, అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలి.

ప్రతిపాదనలే.. సాయం లేదు
కొవిడ్‌ సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం పట్టణ స్థానిక సంస్థల నుంచి పురపాలకశాఖ ప్రతిపాదనలు తీసుకుంటోంది. గత ఏడాది, ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న 13 పురపాలక సంఘాలు, 20 నగర పంచాయతీలకు రూపాయి సాయం చేయలేదని అధికారులే చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొవిడ్‌ సహాయక కార్యక్రమాలకు సాధారణ నిధుల నుంచి ఖర్చు చేస్తున్న 25 పురపాలక, నగర పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు.

ఇదీ చదవండి

ప్రజారోగ్యంతో వ్యాపారం..నిబంధనలకు నీళ్లొదిలేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.