ETV Bharat / city

Audio Tape: ఫ్లెక్సీ వివాదం..ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెదిరింపుల ఆడియో కలకలం!

author img

By

Published : Jul 6, 2021, 5:49 PM IST

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఫ్లెక్సీల వివాదం రేగింది. ఫ్లెక్సీలతో ప్రజలకు ఇబ్బందిగా ఉందంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెదిరించేలా మాట్లాడరని వైకాపా నేత నల్లమిల్లి వీర్రెడ్డి తెలిపారు. తనకు ఏమైనా జరిగితే తోట త్రిమూర్తులదే బాధ్యత అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Audio Tape
mlc thota trimurthulu

నల్లమిల్లి వీర్రెడ్డి

వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సంబంధించిన ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో తోట త్రిమూర్తులు ఫొటోతో ఫ్లెక్సీలు పెట్టారు. నెలలు గడుస్తున్నా వాటిని తొలగించలేదు. వర్షాకాలం నేపథ్యంలో కొన్ని ఫ్లెక్సీలతో ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. వాటిని తొలగించాలని స్థానిక నాయకుడు నల్లమిల్లి వీర్రెడ్డి.. పురపాలక సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తన మిత్రుడైన 7వ వార్డు కౌన్సిలర్ సవరపు సతీష్​కి త్రిమూర్తులు ఫోన్ చేసి బెదిరించారని వీర్రెడ్డి తెలిపారు. తనకు ఏదైనా జరిగితే తోట త్రిమూర్తులదే బాధ్యత అని అన్నారు.

ఆడియో కాల్​లో ఏముందంటే...!

ఆడియో టేప్

'వీర్రెడ్డికి చెప్పు. నేను అందరిలా కాదు. కాళ్లు, చేతులూ తీయించేస్తానని చెప్పు. ఫ్లెక్సీలు తీయించేయాలంటూ పిటిషన్లు ఇవ్వడమేంటి..? వాడికి పోయే కాలమేంటి..? సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు పెడుతున్నాడు.. ఏంటీ సంగతి..! పిలిపించి చెబుతాను వాడి సంగతి'

రాజకీయ ఉద్దేశ్యం లేదు: వీర్రెడ్డి

రెండో తేదీన మండపేటలో భారీ వర్షం కురిసిందని.. ఫలితంగా చాలా చోట్ల ఫ్లెక్సీలు తెగి విద్యుత్​కు అంతరాయం కలిగిందని వైకాపా నేత నల్లమిల్లి వీర్రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది ఉండొద్దనే ఫ్లెక్సీలపై పురపాలక సంఘం అధికారులకు ఫిర్యాదు చేశాను. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు. కానీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వేరేలా అర్థం చేసుకోని.. తన మిత్రుడు సతీష్​కి ఫోన్ బెదిరించారని పేర్కొన్నారు. సోమవారమే ఆ ఆడియో తన దృష్టికి వచ్చిందని వీర్రెడ్డి చెప్పారు. భయాందోళనతో పోలీసులను ఆశ్రయించానని.. తనకేమైనా జరిగితే తోట త్రిమూర్తులదే బాధ్యత అని వీర్రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి

ఇరు రాష్ట్రాల నీటి వివాదంపై కేంద్రమంత్రి షెకావత్‌కు ఎంపీ రఘురామ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.