ETV Bharat / city

24 మంది మంత్రుల రాజీనామా.. ఈనెల 11న కొత్త కేబినెట్

author img

By

Published : Apr 7, 2022, 5:17 PM IST

Updated : Apr 8, 2022, 5:16 AM IST

24 మంది మంత్రుల రాజీనామా
24 మంది మంత్రుల రాజీనామా

17:14 April 07

మంత్రుల రాజీనామా

మంత్రులుగా మంత్రిమండలి సమావేశానికి వచ్చారు.. అధికారిక ఎజెండాపై చర్చించారు. అంతా ఎప్పటిలాగే సాగింది. చివర్లో అధికారులంతా వెళ్లిపోయాక మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అప్పుడు మంత్రుల ముందుకు లేఖలు వచ్చాయి. వారంతా వాటిపై సంతకాలు చేశారు. ఆ లేఖలే వారి రాజీనామా పత్రాలు.. మంత్రులుగా మంత్రిమండలి భేటీకి వచ్చిన మంత్రులంతా సమావేశం ముగిసి బయటకొచ్చేసరికి దాదాపు మాజీలుగా మారినట్లయింది. ఆ రాజీనామా పత్రాలను సిద్ధం చేసేందుకు వీలుగా సమావేశానికి వచ్చేటపుడు మంత్రులంతా వారి వ్యక్తిగత లెటర్‌హెడ్‌లను తీసుకువచ్చి అధికారులకు అందజేశారు. ఆ లెటర్‌హెడ్‌లపై ఆయా మంత్రులు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ అధికారులు టైప్‌ చేసి, తీసుకువచ్చారు. వాటిపై మంత్రులు సంతకాలు చేశారు. గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం జరిగిన తీరు ఇది. మంత్రుల రాజీనామా లేఖలపై తేదీ వేయలేదని సమాచారం. గురువారం తేదీ వేసి గవర్నర్‌కు పంపుతారా? లేదా శుక్రవారం ఉదయం పంపే పనైతే శుక్రవారం తేదీని వేసి అందజేస్తారా అనేది స్పష్టత రాలేదు. మంత్రులందరి నుంచి అధికారిక వాహనాలను గురువారమే వెనక్కు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ప్రొటోకాల్‌ విభాగానికి మార్గదర్శకాలు అందాయి. గురువారం మంత్రిమండలి భేటీ పూర్తయ్యాక అధికారులు వారి నుంచి వాహనాలను తీసుకోలేకపోయారని సమాచారం.

రాజీనామా చేసిన మంత్రుల్లో అయిదుగురు లేదా ఆరుగురిని మళ్లీ ఈ నెల 11న కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ గురువారం కొందరు మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే వారి పేర్లు మాత్రం బయటపెట్టలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, శంకరనారాయణల్లో అయిదారుగురు మళ్లీ కేబినెట్‌లో చేరే అవకాశం ఉండొచ్చని.. వైకాపా, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. వీరిలో ముగ్గురో నలుగురినో తీసుకుంటే మిగిలిన మంత్రుల్లో నుంచి మరో ఇద్దరికి అవకాశం దక్కొచ్చంటున్నారు.

గవర్నర్‌కు దస్త్రం..: మంత్రుల రాజీనామా పత్రాలతో కూడిన దస్త్రాన్ని ప్రభుత్వం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు గురువారం రాత్రి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. వాటిని గవర్నర్‌ శుక్రవారం ఆమోదించి, ఆయా మంత్రి పదవులు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఖాళీ అయిన పదవుల్లో కొత్తగా తీసుకుంటున్న వారి జాబితాను 9న లేదా 10న ఉదయం గవర్నర్‌కు పంపి ఆమోదం పొందే అవకాశం ఉందంటున్నారు.

ఇదీ చదవండి: CM Jagan: వాలంటీర్ల సేవా భావానికి సెల్యూట్‌: సీఎం జగన్​

Last Updated :Apr 8, 2022, 5:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.