ETV Bharat / city

LAL DARWAJA BONALU: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ మంత్రులు

author img

By

Published : Aug 1, 2021, 12:23 PM IST

హైదరాబాద్​లోని పాతబస్తీ లాల్‌దర్వాజ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకలకు ఆ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డిలు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ministers
ministers

LAL DARWAJA BONALU: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ మంత్రులు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తలపించేలా... బోనాల ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ అని ఆ రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. పాతబస్తీ లాల్‌దర్వాజ అమ్మవారికి మంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. వేడుకలను మరింత వైభవంగా జరిపేందుకు మొదటిసారి ప్రైవేటు ఆలయాలకు నిధులు ఇచ్చామన్న మంత్రి.... ఇతర రాష్ట్రాల నుంచి బోనాల ఉత్సవాలకు భక్తులు వస్తున్నారని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

రేపు రంగం కార్యక్రమం తర్వాత వైభవంగా అంబారీ ఊరేగింపు ఉంటుందని పేర్కొన్నారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ఆలయం వద్ద ప్రత్యేక క్యూ, పాతబస్తీలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా... పలుచోట్ల వన్‌వే ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు 8 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు.. శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, దాంతోపాటు భారతదేశంలో మొట్టమొదటి సారి మరి ప్రైవేటు దేవాలయాలకు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో డబ్బులిచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ దేశంలో మొదటి సారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశ పెట్టడం జరిగింది. ఎందుకంటే దేవాలయాలు, పండుగలు జరిగేటప్పుడు అలంకరణ జరుగుతది. చాలా ఖర్చులతో కూడుకున్నటువంటి అంశాలు. మరి గతంలో కొంతమంది దాతల సహకారంతోని ఈ కార్యక్రమాలు జరుగుతుండె. గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఇవన్నీ ప్రభుత్వ పక్షాన్నే చేయాలనే ఒక గొప్ప సంకల్పంతోని ఆ కార్యక్రమాలు నిర్వహించడమనేది శుభ పరిణామం అని నేను తెలియజేస్తా ఉన్నాను. - తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి

లాల్ దర్వాజ అమ్మవారిని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి దర్శించుకున్నారు. అక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం తరఫున ఈరోజు పట్టువస్త్రాలు సమర్పించామన్నారు. కరోనా మహమ్మారి త్వరలోనే అంతమవ్వాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో హాయిగా జీవించాలని మొక్కుకున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా ఆలయాల అలంకరణ కోసం 15 కోట్ల రూపాయలను అందిస్తోంది. ప్రభుత్వం తరఫున ఈరోజు లాల్ దర్వాజ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాం. రాష్ట్రంలో కరోనా రాకుండా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నాను. - ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు బోనాల పండుగను అంత ఘనంగా నిర్వహించలేరని... తెలంగాణ వచ్చాకే... సీఎం కేసీఆర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దేవాలయాలకు 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం హర్షణీయమన్నారు. కరోనా థర్డ్ వేవ్ రాకూడదని భక్తులు కోరుకోవాలని సూచించారు.

తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగ బాగా సెలబ్రేట్ చేస్తున్నరు. ఇది ప్యూర్ తెలంగాణ పండుగ. ఆంధ్రప్రదేశ్​లో ఉన్నప్పుడు బాగా చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మన సీఎం గారు బోనాల్ పండుగకు 15 కరోడ్ రూపాయ్ సాంక్షన్ చేస్తున్నరు.

- మహమూద్ అలీ, మంత్రి

తరలివచ్చిన ప్రముఖులు

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుతూ... అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గాయని మధుప్రియ లాల్ దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించారు. కోరనా థర్డ్ వేవ్ రాకుండా ఉండాలని.. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.

ఇదీ చూడండి:RRR movie: ఆర్​ఆర్​ఆర్​ ట్రీట్​.. 'దోస్తీ' సాంగ్​ వచ్చేసింది​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.