ETV Bharat / city

FARMERS MAHA PADAYATRA: ఎన్ని అడ్డంకులు సృష్టించినా..రెట్టింపు ఉత్సాహంతో..

author img

By

Published : Nov 11, 2021, 12:07 PM IST

Updated : Nov 12, 2021, 4:37 AM IST

పాదయాత్రపై లాఠీఛార్జ్.. విరిగిన రైతు చేయి
పాదయాత్రపై లాఠీఛార్జ్.. విరిగిన రైతు చేయి

12:03 November 11

చెదలవాడలో రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత

అమరావతి పాదయాత్రపై లాఠీఛార్జ్.. విరిగిన రైతు చేయి!

ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర.. గురువారం పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం ఎదురుతిరగడంతో ఉద్రిక్తంగా మారింది. ఇన్ని కఠిన ఆంక్షలు, నిర్బంధాల్నీ తోసిరాజని పరిసర గ్రామాల నుంచి వేల మంది తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు. అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో బలగాల్ని మోహరించిన పోలీసులు.. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు. చెక్‌పోస్టులు పెట్టి వాహనాల్ని మళ్లించారు. కనిపించిన ప్రతిఒక్కరినీ ఎక్కడికి వెళుతున్నారో అడిగి, పాదయాత్రకు కాదని నమ్మకం కుదిరితేనే పంపించారు. వందల మంది పోలీసులు లాఠీలు పట్టుకుని, పాదయాత్ర ముందు సాగుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. వాహనాలపై తిరుగుతూ ప్రజల్ని అడ్డుకున్నారు. పాదయాత్రకు వెళ్లేందుకు వీల్లేదని, ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. హెచ్చరికల్ని కాదని ముందుకు వచ్చినవారిని తోసిపారేశారు. వందల మంది పోలీసులు రోప్‌పార్టీలతో ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు ఎదురుతిరిగి రైతుల దగ్గరకు   చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు. ఒకరి చెయ్యి విరిగింది. నిబంధనలకు లోబడి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రకు కొవిడ్‌ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ పేరుతో కావాలనే ఆంక్షలు సృష్టిస్తున్నారని రైతులు, ఐకాస నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లాఠీ ఛార్జ్

నాగులుప్పలపాడు అష్టదిగ్బంధం
పాదయాత్ర చేస్తున్న రైతులు బుధవారం రాత్రి నాగులుప్పలపాడులో ఒక శీతలగిడ్డంగి ఆవరణలో బస చేశారు. అర్ధరాత్రి నుంచి వర్షం కురవడంతో రైతులు నిద్రిస్తున్న టెంట్లలోకి నీళ్లు చేరి వారికి కంటిమీద కునుకు కరవైంది. ఓవైపు ఆగకుండా వర్షం పడుతున్నా రెయిన్‌కోట్లు ధరించి, గొడుగులు పట్టుకుని ఉదయం 9.30కి రైతులు పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం నుంచే నాగులుప్పలపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో పోలీసులు మోహరించార. నాగులుప్పలపాడు, కేశినేనివారిపాలెం, చదలవాడ, చీర్వానుప్పలపాడు కూడళ్లకు చేరుకున్న ప్రజల్ని వెనక్కు వెళ్లిపొమ్మని హెచ్చరించారు. చదలవాడ వద్ద తమతో వాగ్వాదానికి దిగిన ప్రజలు, రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. మహిళలు, రైతులు పరుగులు తీశారు. కొందరు కిందపడిపోయారు. లాఠీఛార్జిలో చీర్వానుప్పలపాడుకు చెందిన ఆళ్ల నాగార్జునకు చెయ్యి విరిగింది. ఆయన నొప్పి భరించలేక విలవిల్లాడుతూ కూలబడ్డారు. అదే గ్రామానికి చెందిన చుండూరు మూర్తికి మోకాలికి గాయమైంది. మరికొందరికీ దెబ్బలు తగిలాయి. పోలీసుల దాష్టీకంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులు అడ్డుగా పట్టుకున్న తాడును తోసుకుని, లాఠీలను తీసుకుని విసిరేసి, ఒక్కసారిగా పరుగులు తీశారు. పాదయాత్రకు ఎదురేగి, రైతులతో కలసి జై అమరావతి అంటూ నినదించారు. లాఠీఛార్జి విషయం తెలుసుకుని సమీప గ్రామాల ప్రజలూ ఉవ్వెత్తున తరలిరావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత యాత్ర ప్రశాంతంగా జరిగింది. పోలీసులు ఎంతగా రెచ్చగొట్టినా, కొట్టినా పాదయాత్రికులు, ప్రజలు సంయమనం పాటించాలని రైతు, అమరావతి ఐకాసల ప్రతినిధులు మైకులో పదేపదే చెప్పారు.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వద్ద వర్షం కురుస్తుండగా రెయిన్‌ కోట్లు ధరించి పాదయాత్ర చేస్తున్న మహిళా రైతులు


 

మద్దిరాలపాడులో ఉద్రిక్తత
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందన్న కారణం చూపించి, పోలీసులు తెదేపా ఎమ్మెల్యేల్ని, ముఖ్య నాయకులను పాదయాత్రలో పాల్గొనకుండా బుధవారం అర్ధరాత్రి నుంచే గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌ విజయకుమార్‌లను గృహ నిర్బంధం చేశారు. మహా పాదయాత్రకు ప్రజల స్పందన చూశాకైనా వైకాపా ప్రభుత్వం అమరావతిపై కళ్లు తెరవాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి పేరుతో పోలీసులు తెదేపా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు. గురువారం మధ్యాహ్నానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తోపాటు, రవికుమార్‌, విజయకుమార్‌లు రైతులకు సంఘీభావం చెప్పడానికి మద్దిరాలపాడు చేరుకున్నారు. పోలీసులు వారిని చుట్టుముట్టడంతో ఇరువర్గాలకు వాగ్వాదం జరిగింది.

చదలవాడ వద్ద పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ముందుకు వెళ్తున్న ప్రజలు, రైతులు


 

కొడతారా.. కొట్టండి చూద్దాం
పాదయాత్రకు వెళ్లకుండా తమను అడ్డుకుంటున్న పోలీసులపై పలుచోట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొడతారా! కొట్టండి చూద్దాం. మేమేమీ రాజకీయ విమర్శలు చేయడం లేదు. మద్యం, బిర్యానీ పొట్లాలు తీసుకుని రాలేదు. జై అమరావతి అన్న   నినాదంతో దేవుడి దర్శనానికి వెళుతున్న రైతుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది భవిష్యత్తు తరాలకు స్ఫూర్తియాత్ర. దీన్ని అడ్డుకోకండి’ అని ధ్వజమెత్తారు.

దారి పొడవునా పాదయాత్రను అనుసరించిన పోలీసు బలగాలు  


 

పాదయాత్రను హైకోర్టు చూస్తోంది
పాదయాత్రలో గురువారం హైకోర్టు న్యాయవాదులు పాల్గొని సంఘీభావం తెలిపారు. హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడుతూ పాదయాత్ర రైతులకు సంబంధించినదని, స్థానిక ఎన్నికల కోడ్‌ ఈ యాత్రకు వర్తించదన్నారు. యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఏదో ఒక కారణంతో ఆపాలని చూస్తున్నారని పేర్కొన్నారు. లాఠీఛార్జీతో యువకుడి చేయి విరిగేలా కొట్టిన పోలీసులపై కేసు నమోదవుతుందని, మహాపాదయాత్రను హైకోర్టు గమనిస్తోందని చెప్పారు. బార్‌కౌన్సిల్‌, బార్‌ అసోసియేషన్‌ మహాపాదయాత్రలో పాల్గొంటుందని.. అవసరమైతే హైకోర్టు నుంచి ఒక న్యాయవాదిని పెట్టి పాదయాత్రను నడిపిస్తామని చెప్పారు.

చదలవాడ గ్రామం వద్ద పోలీసులు, రైతులకు మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలో కింద పడిపోయిన రైతు


 

పోలీసుల లాఠీఛార్జిలో చేయి విరిగిన చీర్వానుప్పలపాడుకు చెందిన ఆళ్ల నాగార్జున


 

నాగులుప్పలపాడులో బస చేసిన అమరావతి రైతులకు మా గ్రామస్తులు చందాలు వేసుకుని బుధవారం రాత్రి భోజనాలు ఏర్పాటు చేశాం. దాంతో పోలీసులు మాపై కక్షగట్టారు. పాదయాత్రలో పాల్గొనేందుకు గురువారం చీర్వానుప్పలపాడు నుంచి బయలుదేరాం. చదలవాడ వద్ద పోలీసులు ఆపేశారు. యాత్రలో పాల్గొని తీరతామనడంతో విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. దీంతో నా చేయి విరిగింది.-ఆళ్ల నాగార్జున, చీర్వానుప్పలపాడు

ఇదీచదవండి.

RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు

Last Updated :Nov 12, 2021, 4:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.