ETV Bharat / city

ఆర్టీసీ స్థలాల లీజుకు స్పందన కరవు.. 30 స్థలాలకు టెండర్లు పిలిస్తే.. ఒక్క చోటే..!

author img

By

Published : Apr 17, 2022, 5:30 AM IST

రాష్ట్రంలోని పలు బస్టాండ్లు, డిపోల ఆవరణలో ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే.. వ్యాపారులు, ప్రైవేటు సంస్థల నుంచి స్పందన కరవైంది. 30 స్థలాలకు టెండర్లు పిలిస్తే.. ఒక్క చోటే మాత్రమే బీవోటీ కింద తీసుకోవడానికి ముందుకు వచ్చారు.

apsrtc
apsrtc

టికెట్లపై వచ్చే రాబడితో పాటు ఇతర మార్గాల్లో కూడా అదనపు ఆదాయం పొందాలని చూస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్రంలోని పలు బస్టాండ్లు, డిపోల ఆవరణలో ఖాళీ స్థలాలను నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ) కింద లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే.. వ్యాపారులు, ప్రైవేటు సంస్థల నుంచి స్పందన లేకుండాపోయింది. ఫిబ్రవరిలో తొలి విడతలో 11 స్థలాలు, మార్చిలో రెండో విడతలో 19 స్థలాలు కలిపి మొత్తం 31.42 ఎకరాల విస్తీర్ణం మేర 30 స్థలాలు లీజుకిచ్చేందుకు టెండర్లు పిలిచారు. వ్యాపారులు, వివిధ సంస్థలతో దీనిపై సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే కేవలం నరసరావుపేటలోని ఓ స్థలాన్ని బీవోటీ కింద తీసుకోవడానికి ముందుకు వచ్చారు.

33 ఏళ్లు సరిపోవని ఎక్కువ అభ్యర్థనలు

ఆయా స్థలాలు 33 ఏళ్లకు లీజుకు ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే వాణిజ్య సముదాయం నిర్మించుకొని, వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు 33 ఏళ్లు సరిపోదని, మరింత ఎక్కువ కాలం లీజు గడువు ఉండాలని వ్యాపారులు, పలు సంస్థలు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ స్థలాలకు సబ్‌ రిజిస్ట్రార్‌ విలువ కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా పరిగణనలోకి తీసుకొని, ఆ మేరకు సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించాలని నిబంధనలు విధించారు. ఇది కూడా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీంతో ఆయా నిబంధనల్లో కొన్నింటిని మార్పులు చేయడంపై పరిశీలన చేస్తున్నారు. త్వరలో వీటిపై నిర్ణయం తీసుకొని మళ్లీ టెండర్లు పిలుస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ స్థలాలు లీజుకివ్వడం ద్వారా ఏటా రూ.10 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

టెండర్లు పిలిచిన స్థలాలు ఇవీ..

* తొలి విడత టెండర్లు పిలిచిన వాటిలో చిలకలూరిపేట, తెనాలి, బాపట్ల, గూడూరు, ఉరవకొండ, హిందూపురం బస్టాండ్ల ఆవరణలో ఒక్కో స్థలం, నరసరావుపేట బస్టాండ్‌ ఆవరణలో రెండు స్థలాలు, ఏలూరు డిపో మేనేజర్‌ కార్యాలయం పరిధిలో ఓ స్థలం కలిపి మొత్తం 9 చోట్ల 29,799 చదరపు గజాలు ఉన్నాయి.

* రెండో విడతలో రాజోలు డిపో ఆవరణలో 2 స్థలాలు, జగ్గయ్యపేట బస్‌ డిపో ఆవరణలో 3, బస్టాండ్‌ ఆవరణలో ఒకటి, రేపల్లె, గుంటూరు బస్టాండ్లలో ఒక్కొక్కటి, తెనాలి పాత బస్‌డిపోలో 2, పొదిలి డిపోలో ఒకటి, కనిగిరి బస్టాండ్‌లో 2, ఆత్మకూరు బస్టాండ్‌లో 2, చిత్తూరు బస్‌డిపోలో 2, అనంతపురం బస్‌స్టాండ్‌లో 3 స్థలాలు, ఏలూరు డీఎం క్వార్టర్‌ వద్ద ఓ స్థలం కలిపి 1.22 లక్షల చదరపు అడుగుల మేరకు 21 స్థలాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం.. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.