ETV Bharat / city

Gang Rape Case: 'ట్యాగ్‌ తెంచేసి.. ఫోన్ లాక్కొని.. బాలిక దిగ్బంధనం'

author img

By

Published : Jun 9, 2022, 12:42 PM IST

Jubilee hills Gang Rape Case : హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. బాధితురాలిని పకడ్బంధీగా దిగ్బంధనం చేయడానికి నిందితులు ముందుగానే పక్కా ప్లాన్ వేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె పబ్‌లోకి తిరిగి వెళ్లకుండా ట్యాగ్‌ను కట్‌ చేసి క్యాబ్ బుక్ చేస్తామంటూ బలవంతంగా ఆమె ఫోన్ లాక్కున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం మొబైల్‌లో డేటా లేదని సాకులు చెప్పి ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లారని చెప్పారు.

Gang Rape Case
బాలిక దిగ్బంధనం

Jubilee hills Gang Rape Case : ‘జూబ్లీహిల్స్‌లో అమ్నీషియా పబ్‌కు స్నేహితులతోపాటు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు అంతకుముందు ఆమె వస్తువులు లాక్కొని పథకం ప్రకారం దిగ్బంధించారు. పబ్‌ లోపలికి వెళ్లేందుకు వీలుగా యాజమాన్యం ఇచ్చిన ట్యాగ్‌ను ఆమెకు తెలియకుండా తెంచేశారు. ఆమె మళ్లీ పబ్‌లోకి వెళ్లలేని పరిస్థితి కల్పించారు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర దిగబెడతామంటూ బెంజి కారులో ఎక్కించుకున్నారు...’ జూబ్లీహిల్స్‌ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలు పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Jubilee hills Gang Rape Case Updates : మే 28న అత్యాచార ఘటన అనంతరం జూన్‌ 2న భరోసా కేంద్రంలో బాధితురాలితో ఒక మహిళా పోలీసు అధికారి మాట్లాడారు. ‘నాకు నిందితులెవరూ పరిచయం లేరు. నా స్నేహితురాలు ఇంటికి వెళ్తానంటే మేమిద్దరం బయటకు వచ్చాం.. ఆమె క్యాబ్‌లో వెళ్లిపోయింది. మాతోపాటు నలుగురు నిందితులు వచ్చార’ని బాధితురాలు చెప్పినట్టు తెలిసింది.

క్యాబ్‌ బుక్‌ చేస్తామని నటిస్తూ..
మే 28, సాయంత్రం పబ్‌ నుంచి బయటకు వచ్చిన బాలిక ఇంటికి వెళ్లేందుకు పబ్‌లో ఉన్న తన స్నేహితుడికి ఫోన్‌ చేస్తే, అతడు సమాధానం ఇవ్వలేదు. పక్కనే ఉన్న నిందితులు క్యాబ్‌ బుక్‌ చేస్తామంటూ ఆమె ఫోన్‌ లాక్కున్నారు. మొబైల్‌ డేటా సరిగా లేదు... మేం దిగబెడతామంటూ బెంజి కారులో ఆమెను ఎక్కించుకున్నారు. నిందితుల్లో ఒకడు ఆమె బ్యాగ్‌, కళ్లజోడు తీసుకున్నాడు. బంజారాహిల్స్‌వైపు కారులో వెళ్తుండగానే.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. కాన్సు బేకరీ వద్దకు వచ్చాక.. ఈ కారు ఇరుకుగా ఉందని, మరో కారు వస్తుందని చెప్పారు. తన ఫోన్‌, కళ్లజోడు, బ్యాగ్‌ ఇస్తే ఇంటికి వెళ్లిపోతానని ఆమె బతిమాలినా వినలేదు.. బెదిరించి మరోకారులో తీసుకెళ్లారు.

చిరునామా తెలియక... వస్తువులు దక్కక..
‘బేకరీ వద్ద ఇన్నోవాలో ఎక్కేందుకు 15 నిముషాల వ్యవధి ఉంది. ఆ సమయంలో బయటకు వచ్చి ఎవరినైనా సహాయం అడగవచ్చు.. లేదా ఎవరికైనా చెప్పి పోలీసులకు ఫోన్‌ చేయించవచ్చు కదా’ అని ఆ అధికారిణి బాలిక వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. అది తనకు తెలియని ప్రాంతం కావడంతో ఏమీ చేయలేకపోయానని బాధితురాలు చెప్పినట్టు తెలిసింది. పైగా తన కళ్లజోడు, ఫోన్‌, బ్యాగ్‌ వారు తిరిగి ఇవ్వకపోవడంతో వాటి కోసం తాను కారులోనే ఉన్నానని వివరించినట్టు సమాచారం.

నడిపినవారెవరు?
పబ్‌ నుంచి బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వరకు బెంజి కారును.. అత్యాచారానికి పాల్పడిన అయిదుగురు నిందితుల్లో చివరిగా పట్టుబడిన మైనరు (16) నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కారు నడిపిన అతడిపైన, కారు ఇచ్చిన కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కారు ఆ బాలుడి తల్లి పేరుతో ఉన్నట్లు గుర్తించారు. బేకరీ నుంచి వెళ్లే సమయంలో ఇన్నోవా కారును ప్రభుత్వ రంగ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు నడిపినట్లు అనుమానిస్తున్నారు. సనత్‌నగర్‌కు చెందిన ఒక మహిళ పేరిట 2019లో కొన్న ఇన్నోవా మూడేళ్లుగా తాత్కాలిక (టీఆర్‌) నంబరుతోనే ఉంది. ప్రభుత్వరంగ సంస్థ ఛైర్మన్‌ ఆ పదవిలోకి రాకముందే ఈ కారును వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాత దాన్నే ‘ప్రభుత్వ వాహనం’ స్టిక్కరు అతికించి వాడుతునట్లు సమాచారం.

నాలుగు రోజుల కస్టడీకి సాదుద్దీన్‌
జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్‌ మాలిక్‌ (18)ను ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. మిగిలిన అయిదుగురు మైనర్ల కస్టడీ కోరుతూ మంగళవారం జువైనల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు మైనర్ల కుటుంబ సభ్యులు బుధవారం జువైనల్‌ కోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యాచార ఘటనపై సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ సంఘటనలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఒక్కరే నిజాయతీపరుడిగా కనిపిస్తున్నారని, మిగిలిన వారంతా దృష్టి మరల్చేందుకు ప్రయత్నించారని తాను భావిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.