ETV Bharat / city

రాజధాని సాధనే లక్ష్యంగా అతివల ఉద్యమం

author img

By

Published : Mar 8, 2020, 9:35 AM IST

రాజధాని సాధనే లక్ష్యంగా అతివల ఉద్యమం
రాజధాని సాధనే లక్ష్యంగా అతివల ఉద్యమం

వంట చేసే చేతులు పిడికిలి బిగించాయి... ఇంటి బయట అడుగు పెట్టాలంటే తడబడే కాళ్లు పోరాటం వైపు నడిచాయి... సున్నితంగా మాట్లాడే ఆ నోళ్లలో జై అమరావతి నినాదం మారుమోగుతోంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతివలు రుద్రమదేవిలా ఉగ్రరూపం దాల్చారు. అమరావతినే రాజధాని కొనసాగించాలంటూ రణ నినాదాన్ని వినిపిస్తున్నారు. అమరావతి ఉద్యమానికి ఊపిరిగా మారిన నారీమణుల పోరుపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.

అమరావతి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

వారంతా సాధారణ గృహిణులు. భర్త, పిల్లలే వారి లోకం. కుటుంబమే సర్వస్వం. పిల్లల్ని సమయానికి స్కూల్​కి పంపించటం.. భర్తకు చేదోడువాదోడుగా ఉండటమే తెలుసు. అంతా ప్రశాంతంగా ఉన్న వారి జీవితంలో ఓ కుదుపు..! రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తామంటూ ప్రభుత్వం నుంచి వచ్చిందో ప్రకటన ..! అంతే.. వాళ్ల కాళ్ల కింద భూమి కంపించింది. రాష్ట్రం బాగు కోసం.. భవిష్యత్ తరాల కోసం.. తమ సర్వస్వంగా భావించే భూమిని రాజధాని అమరావతి కోసం అందించిన ఆ ప్రాంత ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రాష్ట్రం మొత్తం కూడా షాక్​కు గురైంది

తల్లడిల్లిన తల్లులు...

'మూడు రాజధానులా... ఏంటీ మూడు రాజధానులు.. కన్న తల్లిలా చూసుకున్న భూములిచ్చేశాం... ఎలా బతకాలి... బిడ్డల భవిష్యత్తేమిటి.. భూమి లేకపోతే ఎలా... ఏమి చేయాలి... అనాథలా మారిన రాష్ట్రానికి రాజధాని కావాలని భూములిచ్చి అనాథలమయ్యాం... ఎంటీ పరిస్థితి'- ఆ సాధారణ గృహిణుల్లో ఎన్నో ప్రశ్నలు... ఎంతో వేదన.. ఏమి చెయ్యాలో తెలియదు... వారి గోడు ఎవరితో చెప్పాలో తెలియదు...

ఇంట్లో ఉంటే కుదరదు.. బయటకు వెళ్లి నిరసన తెలియజేయాలని కదం తొక్కారు. వారి భర్తలు, కుమారులు, నాన్నలు అందరూ రోడ్డెక్కారు. అన్నింటిలోనూ అండగా ఉండే ఆ మహిళలు... అమరావతిని కాపాడుకోవడమే లక్ష్యంగా ముందడుగేశారు. ఉద్యమంలో భాగస్వాములయ్యారు. 82 రోజులుగా ఉద్యమాన్ని ఉద్ధృతంగా సాగిస్తున్నారు. అది రైతుల ఉద్యమమా?.. మహిళా ఉద్యమమా అనే స్థాయికి చేర్చారు. ఏ దీక్షాస్థలిలో చూసినా, ర్యాలీలు, ఆందోళనలు ఎక్కడ చూసినా ఎక్కువ శాతం మహిళలే కనిపిస్తున్నారు. రాజధాని దీక్షను ఓ రకంగా వారే ముందుండి నడిపిస్తున్నారు.

నమ్ముకున్న ఆ భగవంతుడే వారి కష్టం తీరుస్తారనుకున్నారా మహిళలు... ఏ దేవుడికి ముడుపు కట్టి మొక్కులు చెల్లించుకుంటే వారి కోరిక నెరవేరుతుందో తెలియదు. ప్రార్థనలు చేయాలా..? సహస్రనామాలు చదవాలా..? దండకాలు పాడాలా...? ఎలా ప్రసన్నం చేసుకోవాలి..?.. దుర్గమ్మనే నమ్ముకుని ముడుపులు చెల్లించాలనుకున్నారు. ఉద్యమ సంద్రంలా విజయవాడకు బయలుదేరారు.. దారిలో ఎన్నో అవాంతరాలు... లాఠీ దెబ్బలు.. నేలరాలిన రక్తపు బొట్లు... అన్ని అడ్డంకులు దాటి ఆ తల్లికి మొక్కులు చెల్లించారు.. కానీ వారి లక్ష్యం నెరవేరలేదు... వారి ఉద్యమ స్పూర్తి తగ్గలేదు.. ఇంకా ఎక్కువైంది.

ఈ ఉద్యమ ప్రయాణంలో... ఎన్నో ఆటుపోట్లు. మరెన్నో అవమానాలు. పోలీసుల లాఠీ దెబ్బలు... ఆ పోలీసులను ఎదిరించిన సందర్భాలూ ఉన్నాయి.. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా... వెన్ను చూపలేదు. లక్ష్య సాధనను మరువలేదు. పోరుబాట వదల్లేదు. ఉడుం పట్టు పట్టారు. బెదిరింపులు, కేసులు, వేధింపులు ఇలా... తమ ఉద్యమాన్ని అణచివేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నా... అన్నింటినీ తట్టుకొని నిలబడుతున్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తొన్న అమరావతి ప్రాంత నారీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఇదీ చూడండి: ఉమెన్స్ డే: ఈ హీరోయిన్లు గుర్తొస్తే కనిపించేవి ఆ పాత్రలే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.