ETV Bharat / city

'ఇకపై అలా జరగదు.. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ తింటారు'

author img

By

Published : Jul 16, 2022, 10:03 PM IST

ఇకపై అలా జరగదు
ఇకపై అలా జరగదు

Basara Students: బాసర ట్రిపుల్ ఐటీలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు, నిజామాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటివరకు 12 మంది విద్యార్థులను డిశ్చార్జి చేశారు. మరో ముగ్గురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఓ విద్యార్థిని ఐసీయూలో చికిత్స పొందుతోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను విపక్ష నేతలు పరామర్శించారు.

'ఇకపై అలా జరగదు.. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ తింటారు'

Basara Students: కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైన తెలంగాణలోని బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు చికిత్సతో కోలుకుంటున్నారు. దాదాపు 300 మంది కడుపు నొప్పి, తలనొప్పి ఇతర లక్షణాలతో ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో చాలా మంది పరిస్థితి మెరుగైంది. స్వల్ప లక్షణాలు ఉన్నవారిని శుక్రవారం రాత్రే డిశ్చార్జ్‌ చేశారు. ముగ్గురు విద్యార్థులు మాత్రం ఇంకా చికిత్స పొందుతున్నారు.

ట్రిపుల్‌ ఐటీలో 150 మంది అస్వస్థతకు గురయ్యారని ఉన్నత విద్యామండలి వైస్​ ఛైర్మన్ వెంకటరమణ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని ఆయన వెల్లడించారు. పద్నాలుగు వైద్య బృందాలతో వైద్య చికిత్సలు చేయించామని వెంకటరమణ పేర్కొన్నారు.

20 మందిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించాం. ఫుడ్ ఏజెన్సీలు, మెస్ ఇన్‌ఛార్జీలపై క్రిమినల్ కేసులు నమోదు. నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌ను విధుల నుంచి తప్పించాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు.- వెంకటరమణ, ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌

ఆర్జీయూకేటీలో ఫుడ్ పాయిజన్‌పై విచారణ జరుగుతోందని డైరెక్టర్‌ సతీశ్‌ వెల్లడించారు. రెండు మెస్‌ల కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రతి మెస్‌, ప్రతి హాస్టల్‌కు ఒక వార్డెన్‌ను నియమియిస్తున్నట్లు సతీశ్‌ వివరించారు.

విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. ఫుడ్ పాయిజన్‌పై విచారణ జరుగుతోంది. ప్రతిరోజు ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి తింటారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తాం. మెస్‌లో రూ.5 లక్షలతో శానిటేషన్ చేయించాం.

- సతీశ్, బాసర ఆర్జీయూకేటీ డైరెక్టర్

కొద్దిరోజుల క్రితం సమస్యల పరిష్కారానికి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల చేసిన పోరాటం... అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా మరోసారి వర్శిటీ ప్రాంగణంలో .. కలకలం రేగడంతో.. విపక్ష నేతలు తరలివచ్చారు. నిజామాబాద్ చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌, సీపీఐ నేత నారాయణ, ఎన్​ఎస్​యూఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పరామర్శించారు. వంటల్లో నాసిరకం నూనె వాడటం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బాసర ట్రిపుల్‌ ఐటీలో పదేపదే సమస్యలు వస్తున్నాయని... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.