ETV Bharat / city

Ganja in Hyderabad: గంజాయిపై ఎక్కడికక్కడే చెక్.. హైదరాబాద్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

author img

By

Published : Oct 21, 2021, 4:24 AM IST

అటు పోలీసులు ఇటు ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా నిత్యం గంజాయి (Ganja in Hyderabad) పట్టుబడుతూనే ఉంది. గంజాయి సరఫరా చేసే మరో అంతర్ రాష్ట్ర నిందితుడి నుంచి పోలీసులు 40కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నిఘా పెరగడంతో సాధారణ ఫోన్లకు బదులు నిందితులు వాట్సాప్ కాల్స్ ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గంజాయి ట్రేడర్లు వాట్సాప్ గ్రూప్ ద్వారా దందాను కొనసాగిస్తున్నారు. మరోవైపు తెలంగాణ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు... రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గంజాయి సరఫరా, విక్రయం, వినియోగాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

Ganja in Hyderabad
గంజాయిపై హైదరాబాద్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్​ నగరంలో గంజాయి (Ganja in Hyderabad) అధికంగా పట్టుబడటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కీలక ప్రాంతాలైన దూల్​పేట్, మెహదీపట్నం, లంగర్ హౌస్, మంగళ్ హాట్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్​లు చేపట్టారు. మొదట నిర్వహించిన డ్రైవ్​లో 10 కేసులు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు. సెప్టెంబర్​లో నిర్వహించిన రెండో డ్రైవ్​లో మొత్తం 82 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 1,500 కిలోల గంజాయి పట్టుబడింది. ఇందులో 120 మందిని అరెస్టు చేయగా మరో 239 మంది పేర్లు బయటకు వచ్చాయి. 23 మందిపై ఇప్పటి వరకు పీడీ యాక్ట్ ప్రయోగించారు. మరో 13 మందిని గుర్తించారు. వీరిపై త్వరలో పీడీ యాక్ట్ ప్రయోగించనున్నారు.

20 మంది అరెస్టు

నిత్యం గంజాయి (Ganja in Hyderabad) సరఫరా చేయడం అలవాటుగా మారిన 60 మందిని పోలీసులు గుర్తించారు. వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. అడపాదడపా విక్రయించే 35 మందిని గుర్తించి... వీరికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గంజాయిని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు నిందితులకు సహకరిస్తున్న 17 లారీ ట్రాన్స్​పోర్ట్​లను గుర్తించారు. ఇందులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్నారు. నగరానికి ప్రధానంగా ఒడిశా సరిహద్దు, శ్రీకాకుళం సీలేరు, విశాఖపట్నంలోని నర్సీపట్నం, తుని, మహారాష్ట్ర సరిహద్దుల నుంచే గంజాయి నగరానికి వస్తున్నట్లు గుర్తించారు.

600 మందికి అవగాహన

గత మూడేళ్లలో 11 కేసుల్లో నిందితులకు జైలు శిక్ష ఖరారైనట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విక్రేతలు, సరఫరాదారుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఉంటే నిందితులకు త్వరగా శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. గంజాయి విక్రేతలపై ఉక్కుపాదం మోపడంతో పాటు వారికి సహకరిస్తున్న వారిని కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ గంజాయి సరఫరాతో సంబంధం ఉందన్న ప్రాథమిక సమాచారంతో 600 మందికి పైగా అవగాహన కల్పించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గంజాయి వల్ల కలిగే నష్టాలపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నారు. లారీ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దులపై దృష్టిపెట్టారు. నగరంలోకి గంజాయి రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కృషి చేస్తోంది.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.