ETV Bharat / city

High Court: సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌కు హైకోర్టు నోటీసులు

author img

By

Published : Mar 9, 2022, 3:09 AM IST

అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని పేర్కొంటూ.. సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్​పై పెనుమాక సుబ్బారావు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. సునీల్​ కుమార్​తోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Harassment petition against CID ADG Sunil Kumar
సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై వేధింపుల పిటిషన్​

High Court on CID ADG Sunil Kumar: అధికారాన్ని అడ్డుపెట్టుకొని సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్.. తమ కుటుంబ సభ్యులను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పేర్కొంటూ విశ్రాంత ఉద్యోగి పెనుమాక సుబ్బారావు(సునీల్​కుమార్​ మామ, విశ్రాంత ఐఏఎస్ రమేశ్ తండ్రి) దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న సీవీ సునీల్ కుమార్​తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, రాష్ట్ర డీజీపీ, ఏపీ రాష్ట్ర భద్రత కమిషన్​కు నోటీసులు జారీచేసింది. విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎన్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్​.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని.. ఈ వ్యవహారంలో తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ పెనుమాక సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించారు. అదనపు డీజీ చట్ట విరుద్ధ కార్యక్రమాలపై సీబీఐ, సీవీసీతో దర్యాప్తు చేయించాలని కోరారు. పిటీషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అదనపు డీజీ ఉన్నత స్థానంలో ఉండటంతో వివిధ కేసులు నమోదు చేయించి పిటిషనర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నారన్నారు. సునీల్ కుమార్​పై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఏమిటో తెలుసుకోవాలన్నారు. ఆ తర్వాత సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. సునీల్ కుమార్​తోపాటు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర హోంశాఖ పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన కోర్టు.. విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

దిగువ కోర్టులు ఇష్టారీతిన రిమాండ్‍లు విధించడం కుదరదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.