ETV Bharat / city

high court on appsc: తోక.. కుక్కను ఆడించలేదు.. కుక్క మాత్రమే తోకను ఆడించగలదు: హైకోర్టు

author img

By

Published : Aug 1, 2021, 4:42 AM IST

Updated : Aug 1, 2021, 8:17 AM IST

క్రీడా కోటా రిజర్వేషన్‌ వ్యవహారంలో ఏపీపీఎస్సీ తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఉద్యోగ ప్రధాన ప్రకటనలో పేర్కొనని అంశాల్ని అనుబంధంగా ఇచ్చిన ఫామ్‌ ఆధారంగా.. క్రీడా కోటా రిజర్వేషన్ నిరాకరించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. తోక కుక్కను ఆడించలేదని.. కుక్క మాత్రమే తోకను ఆడించగలదని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ను ప్రతిభావంతుల క్రీడా విభాగంలో పరిగణలోకి తీసుకోవాలని ఏపీపీఎస్సీని(APPSC) ఆదేశించింది.

High Court hearing on APPSC sports quota reservations
ఏపీపీఎస్సీ క్రీడల కోటాపై హైకోర్టులో విచారణ

ఏపీపీఎస్సీపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఉద్యోగ ప్రధాన ప్రకటనలో పేర్కొనని అంశాల్ని అనుబంధంగా జారీచేసిన ఫామ్-1 ఆధారంగా ఏపీపీఎస్సీ(APPSC) క్రీడల కోటా కింద రిజర్వేషన్ నిరాకరించడం సరికాదని హైకోర్టు స్పష్టంచేసింది. తోక కుక్కను ఆడించలేదని.. కుక్క మాత్రమే తోకను ఆడించగలదని తెలిపింది. అలాగే అనుబంధంగా ఇచ్చిన ఫామ్-1 లోని అంశాలకు అనుగుణంగా ఏపీపీఎస్సీ కమిటీ వ్యవహరించలేదని.. నోటిఫికేషన్‌, ప్రభుత్వ జీవోలోని నిబంధనల ప్రకారమే వ్యవహరించగలదని స్పష్టంచేసింది. పిటిషనర్‌ను ప్రతిభావంతుల క్రీడా కేటగిరి కింద పరిగణనలోకి తీసుకోవాలని కమీషన్​ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్డ్​ డీవీఎస్ఎస్ సోమయాజులు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

టెన్నిస్ క్రీడాకారుడు జే.వెంకట్ బాలాజీ క్రీడల కోటా కింద గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేశారు. సెంట్రల్ స్థాయి టెన్నిస్ పోటీల్లో పాల్గొన్న అర్హత ఉంది. గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్‌లో అర్హత సాధించారు. ఏపీపీఎస్సీ అడగడంతో క్రీడల ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించారు. కమీషన్​ ఏర్పాటు చేసిన కమిటీ వాటిని పరిశీలించి బాలాజీ అభ్యర్థనను తిరస్కరించింది. నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఉన్న ఫామ్-1లోని క్రీడాంశాలను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో భారతదేశం తరఫున పోటీల్లో పాల్గొనలేదనే కారణంతో రిజర్వేషన్ నిరాకరిస్తున్నట్లు తెలిపింది.


ఏపీపీఎస్సీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వారు మాత్రమే క్రీడల కోటా కింద గ్రూప్-1 పోస్టుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొనలేదన్నారు. అనుబంధంగా తెచ్చిన ఫామ్-1 రూపంలో అర్హతలను పేర్కొనడం చట్ట విరుద్దమన్నారు. జీవో 74 ప్రకారం.. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించినవారి దగ్గరినుంచి రాష్ట్ర, అంతర్‌ జిల్లాస్థాయి పాఠశాల క్రీడల్లో పాల్గొన్నవారూ క్రీడల కోటాకు అర్హులన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. రాష్ట్ర సబార్డినేట్ నిబంధనల్లో సైతం ప్రతిభావంతులైన క్రీడాకారులు అంటే కేవలం జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారేనని పరిమితి విధించలేదన్నారు. ప్రధాన నోటిఫికేషన్‌లో ఉన్న నిబనంధనలను APPSC ఇచ్చిన నోట్‌ లేదా ఫామ్‌లోని నిబంధనలు అధిగమించలేవన్నారు.


ఇదీ చదవండి..

'వివాహేతర సంబంధం చూశాడనే.. అంతమొందించారు '

Last Updated : Aug 1, 2021, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.