ETV Bharat / city

'విభజన చట్టంలో బహుళ రాజధానుల ప్రస్తావనే లేదు'

author img

By

Published : Nov 25, 2020, 5:48 AM IST

బహుళ రాజధానుల ప్రస్తావన ఏపీ విభజన చట్టంలో లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిదీష్ గుప్తా వెల్లడించారు. రాజధాని వ్యాజ్యాలపై రైతుల తరఫున మంగళవారం హైకోర్టులో ఆయన వాదనలను వినిపించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, మంత్రులతో ఏర్పడ్డ కమిటీలకు విలువ ఉండదని స్పష్టం చేశారు.

ap high court
ap high court

ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని ఏర్పాటు గురించి ఏపీ విభజన చట్టంలో స్పష్టంగా ఉందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిదీష్‌ గుప్తా పేర్కొన్నారు. బహుళ రాజధానుల ప్రస్తావన ఆ చట్టంలో లేదని, శాసనకర్తల ఉద్దేశం ఒక రాజధానేనని స్పష్టం చేశారు. రాజధాని వ్యాజ్యాలపై రైతుల తరఫున మంగళవారం హైకోర్టులో ఆయన వాదనలను వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం కొత్తగా ఏర్పడనున్న ఏపీలో రాజ్‌భవన్‌, హైకోర్టులను ఒక్కొక్కటిగానే పేర్కొన్నారని తెలిపారు. పూర్తి స్థాయి వాదనలను వినిపించేందుకు సమయం లేకపోవటంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాజధానితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై రోజువారీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ రైతులు ఇడుపులపాటి రాంబాబు, ఎన్‌.రామకృష్ణ మరో ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యంలో సీనియర్‌ న్యాయవాది నిదీష్‌ గుప్తా వాదనలను వినిపించారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం అధికరణ 3 ప్రకారం పార్లమెంటుకు ఉందని, ఈ నేపథ్యంలోనే ఏపీ విభజన చట్టం తీసుకొచ్చారని తెలిపారు. ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో శివరామకృష్ణన్‌ కమిటీ ఏర్పడిందని దీనికి చట్టబద్ధత ఉంటుందని గుర్తు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, మంత్రులతో ఏర్పడ్డ కమిటీలకు విలువ ఉండదని స్పష్టం చేశారు. ఈ కమిటీల నివేదికల ఆధారంగా పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను చేసే అధికారం రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తెచ్చిందని వాదించారు.

రైతుల హక్కులకు భంగం కలిగే రీతిలో వ్యవహరించడం తగదు

ఏపీ సీఆర్‌డీఏ చట్టంలోని చాప్టర్‌-9లోని నిబంధనలు రాజధానికి భూములిచ్చిన రైతుల హక్కులకు రక్షణ కల్పిస్తున్నాయని నిదీష్‌ గుప్తా తెలిపారు. రైతులకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సీఆర్‌డీఏ చట్టంలోని అన్ని నిబంధనలనూ తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) చట్టాన్ని తీసుకొచ్చారని, ఆ చట్టం ప్రకారం రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లనే ఇస్తామని పేర్కొన్నారని తెలిపారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) ప్రకారం సమగ్రంగా అభివృద్ధి చేయకుండా రైతులకు కేవలం అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని పేర్కొనడం చట్ట విరుద్ధమని వాదించారు. రాజధాని కోసం భూములు తీసుకునేటప్పుడు రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం విస్మరించడానికి వీల్లేదని ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా 'స్టేట్‌' ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. హైకోర్టును మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు.

ఇదీ చదవండి

ఆస్తి పన్ను చట్టానికి సవరణ...రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.