ETV Bharat / city

Corona: నెల రోజుల్లో భారీగా తగ్గిన పాజిటివ్‌ కేసులు!

author img

By

Published : Jun 2, 2021, 9:18 AM IST

తెలంగాణలో నెల రోజుల్లో కొవిడ్‌ కేసులు భారీగా తగ్గినట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. మే 1న 9.73శాతం ఉన్న పాజిటివిటీ రేటు మే 29న 2.96శాతంగా నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇంటింటి సర్వే, ప్రత్యేక కొవిడ్‌ ఓపీ ద్వారా కరోనా బాధితులకు 6.57 లక్షల కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు హైకోర్టుకు ఆయన నివేదిక సమర్పించారు.

Corona cases
తగ్గిన పాజిటివ్‌ కేసులు

మే 1 నుంచి 29 వరకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా సగటు పాజిటివ్‌ రేటు 6.39 శాతం కాగా.. 25 జిల్లాల్లో అంతకంటే ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా మంచిర్యాల, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో అయితే 9 శాతానికంటే ఎక్కువగా పాజిటివ్‌ రేటు నమోదవడం గమనార్హం. అయితే గత నెల ఒకటో తేదీకీ.. 29వ తేదీనాటికి కేసుల శాతాన్ని పరిశీలిస్తే.. రాష్ట్రంలో పాజిటివ్‌ శాతం 9.73 శాతం నుంచి 2.96 శాతానికి తగ్గింది.

మొత్తంగా 29 రోజుల్లో 20 లక్షల 44,212 నమూనాలను పరీక్షిస్తే లక్షా 30 వేల 666 పాజిటివ్‌ (6.39 శాతం)లు నిర్ధరణ అయ్యాయి. మొత్తం పరీక్షల్లో ఆర్‌టీ పీసీఆర్‌ 6 లక్షల 31 వేల588 కాగా.. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు 14 లక్షల12వేల 624 ఉన్నాయి. ఈ మేరకు కొవిడ్‌ సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ మంగళవారం.. హైకోర్టుకు సమర్పించింది. దీనికి సంబంధించిన పలు అంశాలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు నివేదిక అందజేశారు.

క్రమంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

నివేదికలోని ముఖ్యాంశాలివి..

* మే నెలలో జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 5,68,405 నమూనాలను పరీక్షించగా.. అత్యల్పంగా నారాయణపేటలో 14,255 పరీక్షలు నిర్వహించారు.
* రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 86 కేంద్రాల్లో 6,479 కొవిడ్‌ కేర్‌ పడకలను నిర్వహిస్తున్నారు. 7 స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోనూ సెంటర్లు నడుస్తున్నాయి.
* 1,519 కొవిడ్‌ ప్రత్యేక ఓపీ కేంద్రాల ద్వారా మే 6 నుంచి 30వ తేదీ వరకూ 1.60 కోట్ల మందిని పరీక్షించి, 2,96,819 కిట్లను అందజేశారు.
* ఇంటింటి జ్వరసర్వే ద్వారా తొలిదశలో కోటి 6లక్షల 80వేల 499 ఇళ్లను పరిశీలించి 2,32,647 కిట్లను.. రెండోదశలో 68,56,613 ఇళ్లను పరిశీలించి 1,27,987 కిట్లను అందజేశారు. మొత్తంగా ఇప్పటి వరకూ కొవిడ్‌ ఓపీ, ఇంటింటి జ్వర సర్వే ద్వారా కలుపుకొని 6,57,453 మంది కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించి, వారందరికీ కూడా ఔషధ కిట్లను పంపిణీ చేశారు.
* గత నెల 30 నాటికి రాష్ట్రంలో 744 మ్యూకర్‌ మైకోసిస్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 380 కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 364 ప్రైవేటు వైద్యంలో చికిత్స పొందుతున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1500 పడకలను సిద్ధం చేశారు.
* రాష్ట్రంలో 14 ఆర్‌టీపీసీఆర్‌ కొత్త ల్యాబ్‌లను నెలకొల్పేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
* ప్రైవేటు ఆసుపత్రులపై అత్యధిక ఫిర్యాదులు హైదరాబాద్‌(48) జిల్లాలో రాగా, తర్వాత స్థానాల్లో రంగారెడ్డి(31), మేడ్చల్‌(22), వరంగల్‌ నగర(7), సంగారెడ్డి(4) జిల్లాలున్నాయి. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

జైళ్లలోనూ టీకాలు

జైల్లోకి ప్రవేశించే సిబ్బందితో సహా అందరికీ అప్పటికప్పుడు ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, కొత్తగా జైల్లోకి వచ్చే ఖైదీలను ప్రత్యేక బ్యారెక్‌లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచుతున్నామని ఆశాఖ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ త్రివేదీ హైకోర్టుకు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేందుకు ఆక్సిజన్‌ సిలిండర్లతో పాటు ముఖ్యమైన ఔషధాలను జైళ్లలోనే అందుబాటులో ఉంచామనీ, ఇప్పటి వరకూ రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడ్డ ఖైదీల్లో 429 మందికి మొదటి డోసును, 254 మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ ఇచ్చామనీ, మరో 372 మందికి టీకాలు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. 18-44 ఏళ్ల వారిలో 760 మందికి మొదటి డోసు, 384 మందికి రెండో డోసు ఇవ్వగా.. ఇంకా 5405 మంది ఖైదీలకు ఈ కేటగిరీలో టీకాలు పంపిణీ చేయాల్సి ఉందని హైకోర్టుకు వివరించారు.

స్వస్థలాలకు వెళ్లిన కార్మికులు లక్ష మంది

* ప్రత్యేక రైళ్ల ద్వారా ఏప్రిల్‌ 20 నుంచి మే 28 నాటికి మొత్తం 1,04,243 మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లారు. మరో 27835 మంది వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సర్వే ద్వారా తేల్చారు.
* కార్మిక శాఖ బృందాలు 719 ఇటుక బట్టీ యూనిట్లు, 230 నిర్మాణరంగ స్థలాలు, 143 కర్మాగారాలను తనిఖీ చేసి, మే 20నాటికి ఆయా ప్రాంతాల్లో 45280 మంది వలస కార్మికులను గుర్తించి వసతి సదుపాయం కల్పించాయి.
* జీహెచ్‌ఎంసీ పరిధిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో 21 నైట్‌ షెల్టర్లలో 965 మంది కార్మికులకు వసతి కల్పించారు. కార్మికుల భోజనం కోసం ప్రస్తుతం 140 అన్నపూర్ణ క్యాంటీన్లు నిర్వహణలో ఉండగా.. మరో 102 ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు.
* కొవిడ్‌ మహమ్మారి కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సహాయక కేంద్రం(040-23733665) ఏర్పాటు చేశారు.
* ఇప్పటివరకు ఇలాంటి 143 మంది చిన్నారుల్ని గుర్తించి వారి సంరక్షకులకు నిత్యావసర సరకులు, పౌష్టికాహారం అందించారు. ప్రతీ జిల్లాకు రూ.1-5లక్షల వరకు అత్యవసర నిధిని కేటాయించారు.
* అర్హత కలిగిన అనాథ చిన్నారికి మూడేళ్లపాటు ప్రతీ నెల రూ.2వేల చొప్పున పరిహారం అందిస్తున్నారు.

7.49 లక్షల ఉల్లంఘన కేసులు
కరోనా నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించని వారిపై భారీగా జరిమానా విధించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి న్యాయస్థానానికి విన్నవించారు. ఈమేరకు పోలీసుశాఖ తరఫున దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మే 30వ తేదీ వరకూ మాస్కులు ధరించని వారిపై మొత్తంగా 4,18,525 కేసులు నమోదు చేసి.. రూ.35.81 లక్షలు జరిమానా విధించారు. సామాజిక దూరం పాటించని వారిపై 41,872 కేసులు, జనం గుమిగూడడానికి సంబంధించి 13,867, లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై 2,61,410, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌, గుట్కా నమలడంపై 14,012 కేసులు... మొత్తంగా 7,49,686 కేసులు నమోదు చేశారు. ప్రజల్లో అవగాహన కోసం కృషి చేస్తున్నామని, ఆసుపత్రుల్లోని సహాయ కేంద్రాల్లోనూ పోలీసులు సేవలందిస్తున్నారని డీజీపీ తెలిపారు. బ్లాక్‌ మార్కెట్‌లో కొవిడ్‌ ఔషధాలను విక్రయిస్తున్నవారిపైనా 150 కేసులు నమోదు చేశామన్నారు.

జిల్లాల వారీగా నమోదైన పాజటివిటీ

ఇదీ చూడండి:

covid vaccination: రాష్ట్రంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి టీకా పూర్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.