ETV Bharat / city

వికేంద్రీకృత పాలనే లక్ష్యం.. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్

author img

By

Published : Mar 7, 2022, 8:21 PM IST

Updated : Mar 8, 2022, 5:08 AM IST

Governor speech on AP Budget Session: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభోత్సవంలో.."రాజధాని వికేంద్రీకరణ" ప్రస్తావన లేకుండానే గవర్నర్‌ ప్రసంగం సాగింది. అయితే జిల్లాల విభజన అంశాన్ని ప్రస్తావించిన గవర్నర్‌.. గత మూడేళ్లుగా పాలన వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు చెప్పారు. రెండేళ్లుగా కొవిడ్‌ పరిస్థితులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా.. ప్రభుత్వ కృషితో రాష్ట్రం పూర్వ స్థితికి చేరుకుంటున్నట్లు గవర్నర్​ తన ప్రసంగంలో వెల్లడించినట్లు 'పీటీఐ' వార్త కథనాన్ని ప్రచురించింది.

బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్
బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్

Governor speech on AP Budget Session: రాష్ట్రంలో గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలనకు తన ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించిందన్నారు. రానున్న ఉగాది (ఏప్రిల్‌ 2న) నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని వెల్లడించారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర పౌరులందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేందుకు అవసరమైన ప్రతి చర్యనూ చేపట్టేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని... ఆ దిశగా మహత్మాగాంధీ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిందని వివరించారు. వివిధ సంక్షేమ పథకాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానంలో ఇప్పటివరకు రూ.1,32,126 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసినట్లు వివరించారు. గవర్నర్‌ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే...

  • రాష్ట్రంలో 54 సాగునీటి ప్రాజెక్టుల్లో 14 మొత్తంగా, 2 పాక్షికంగా పూర్తయ్యాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు 77.92% పూర్తయింది. 2023 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం వేగంగా పనులు చేస్తోంది.
  • సౌర విద్యుత్తు ప్రాజెక్టు నుంచి ఏడాదికి 15వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు సేకరణలో భాగంగా ప్రతి యూనిట్‌కు రూ.2.49 రేటు చొప్పున 25 ఏళ్ల కాలానికి ఎన్‌ఈసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ప్రతి యూనిట్‌కు రూ.2.50 ఆదా అవుతుంది. 25 ఏళ్ల కాలానికి రూ.3,750 కోట్ల పొదుపు సాధ్యమవుతుంది.
  • విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సంప్రదిస్తోంది.
  • నూతన అభివృద్ధి బ్యాంకు ఆర్థిక సాయంతో రూ.6,400 కోట్ల పెట్టుబడితో 3వేల కిలోమీటర్ల రెండు లైన్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు రోడ్లను అనుసంధానిస్తున్నాం. రూ.6,319 కోట్ల వ్యయంతో 8,715 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.1,073 కోట్లతో 9,200 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి.
  • గత మూడేళ్లలో రూ.36,304 కోట్ల పెట్టుబడితో 91 భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 56,611 మందికి ఉపాధి లభించింది.
  • రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.

కొవిడ్‌ పూర్వ స్థితికి ఆర్థిక వ్యవస్థ...

  • నిరుడు తక్కువ వృద్ధి నమోదైనప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌ పూర్వ స్థితికి పుంజుకుంది. ప్రభుత్వ ప్రభావవంతమైన చొరవతో 2020-21లో 0.22% వాస్తవ జీఎస్‌డీపీ వృద్ధి నమోదైంది. అదే కాల వ్యవధిలో దేశ వాస్తవ జీడీపీ 7.3% తగ్గింది.
  • 2021-22 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలతో 16.82% సమగ్ర వృద్ధిని చూపిస్తున్నాయి. తలసరి ఆదాయం గతేడాది 1,76,707గా ఉండగా.. 15.87% వృద్ధి రేటుతో ఇప్పుడు 2,04,758కి పెరిగింది.
  • ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. 5 విడతల కరవు భత్యం ఒకేసారి విడుదల చేశాం. 23% ఫిట్‌మెంట్‌తో 11వ వేతన సవరణ అమలు చేశాం. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం.

పురోగతిలో 16 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు

  • ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 16 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితంగా కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలన్నీ అవసరమైన వైద్య సంస్థలు, సదుపాయాల్ని కలిగి ఉంటాయి. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాల వంటి ఐటీడీఏ ప్రాంతాల్లో గిరిజన ఉప ప్రణాళిక కింద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని నెలకొల్పాలని నిర్ణయించాం.
  • వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కింద రైతులకు 3 వాయిదాల్లో ఏడాదికి రూ.13,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. 2019-20 నుంచి రూ.20,162 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అమలును ఇతర రాష్ట్రాలకు నమూనాగా నీతి ఆయోగ్‌ గుర్తించింది. పంట నష్ట పరిహారాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో అదే సీజన్‌లో జమ అయ్యేలా చూస్తున్నాం. తపాన్లు, వరదలతో పంట నష్టపోయిన 19.02 లక్షల మంది రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.1,541.80 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాం.
  • అమూల్‌ భాగస్వామ్యంతో రైతు భరోసా కేంద్రాల్లో పాల సేకరణ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నాం. పాడి రైతులు ప్రతి లీటరుకు అదనపు ఆదాయం పొందుతున్నారు.
  • పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో రూ.28,084.09 కోట్ల వ్యయంతో మొదటి దశలో 15.60 లక్షల గృహాల నిర్మాణం చేపట్టాం. రూ.22,860 కోట్ల వ్యయంతో రెండో దశలో 15 లక్షల ఇళ్లను ప్రతిపాదించాం.
  • వైఎస్‌ఆర్‌ పింఛను కానుక కింద నెలవారీ పింఛనను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం.
  • మన బడి నాడు-నేడు కింద రూ.3,669 కోట్ల వ్యయంతో తొలి దశలో 15,715 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తిచేశాం. రాబోయే రెండేళ్లలో 42వేల పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలను బాగు చేస్తాం. మూడు దశల్లో రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం.
  • సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నట్లుగా స్థూల నమోదు నిష్పత్తిని (జీఈఆర్‌) మెరుగుపరిచేందుకు జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.
పాలనా వికేంద్రీకరణపైనే దృష్టి

ఇదీ చదవండి:Achennaidu :' రాజధాని హైదరాబాదే అయితే... వెళ్లిపోమనండి..'

Last Updated :Mar 8, 2022, 5:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.