ETV Bharat / city

Rivers Interlinking: నదుల అనుసంధానంలో ముందడుగు

author img

By

Published : Feb 2, 2022, 7:28 AM IST

Rivers Interlinking: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​తో... నదుల అనుసంధానంలో ఓ ముందడుగు పడింది. బడ్జెట్​లో కెన్‌-బెట్వా నదులకు అనుసంధానానికి నిధులు కేటాయించారు.

నదుల అనుసంధానంలో ముందడుగు
నదుల అనుసంధానంలో ముందడుగు

Rivers Interlinking:నదుల అనుసంధానంలో ఓ ముందడుగు పడింది. రెండు దశాబ్దాలుగా చర్చలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు, సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇది పరిమితం కాగా, మొదటిసారిగా ఉత్తర్‌ప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే కెన్‌-బెట్వా నదుల అనుసంధానానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఉత్తర్‌ప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌లకు ప్రయోజనం కలిగించే కెన్‌-బెట్వా అనుసంధానం కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేశారు.

మొదటి దశ వల్ల 9.08 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుండగా, రూ.44,605 కోట్ల వ్యయమవుతుంది. ప్రస్తుత సంవత్సరం సవరించిన బడ్జెట్‌లో రూ.4300 కోట్లు , వచ్చే సంవత్సరం రూ.1400 కోట్లు కేటాయించారు. నిర్మాణ వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అనుసంధానానికి గతంలో నాబార్డు ద్వారా నిధులివ్వగా.. ఈ ప్రాజెక్టుకు నేరుగా బడ్జెట్‌లోనే కేటాయింపులు చేయడం గమనార్హం.

గోదావరి-కావేరిపై ముందుకెళ్లేనా?

నదుల అనుసంధానం ప్రతిపాదనలో ఒడిశాలోని మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి నదుల అనుసంధానం ఉంది. మహానదిలో నీటి లభ్యతపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రత్యామ్నాయంగా గోదావరి నుంచి కావేరి వరకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. మొదట గోదావరిపై జనంపేట నుంచి, తర్వాత అకినేపల్లి వద్ద నుంచి ప్రతిపాదించి చివరకు ఇచ్చంపల్లి నుంచి నీటిని మళ్లించేలా ఖరారు చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక ముసాయిదాను 2019లో భాగస్వామ్య రాష్ట్రాలకు పంపారు.

ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీలు మళ్లించి మధ్యలో తెలంగాణలోని ఆయకట్టుకు ఇస్తూ నాగార్జునసాగర్‌కు తీసుకెళ్లడం, సాగర్‌ నుంచి-పెన్నానదిపై ఉన్న సోమశిలకు మళ్లించి మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లో ఆయకట్టుకు ఇవ్వడం, తర్వాత సోమశిల నుంచి కావేరిపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్ట వరకు అనుసంధానం చేసి తమిళనాడుకు ఇవ్వడం లక్ష్యం. మొత్తం ఒకే అనుసంధానం కాగా, కేంద్రమంత్రి మూడు అనుసంధానాలుగా పేర్కొన్నారు. దీనిపట్ల రాష్ట్రాల నుంచి సానుకూలత లేదు.

ఇంద్రావతిలో తమ వాటా నీటిని తీసుకోవడానికి వీల్లేదని ఛత్తీస్‌గఢ్‌ అంటే, మొదట నీటి లభ్యతపై అంచనా వేసి తమ అవసరాలు తీరిన తర్వాతనే తీసుకెళ్లాలని తెలంగాణ, ఏపీలు అంటున్నాయి. తమకూ వాటా ఇవ్వాలని కర్ణాటక కోరుతోంది. తమిళనాడు మాత్రమే సానుకూలంగా ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా తమిళనాడులో కావేరిపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్ట వరకు అనుసంధానం గురించి కూడా బడ్జెట్‌లో ప్రస్తావించినా... రాష్ట్రాలతో సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాతనే అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

మళ్లీ మొండిచెయ్యే... బడ్జెట్‌ ప్రసంగంలో వినిపించని ఏపీ పేరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.