ETV Bharat / city

మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

author img

By

Published : Aug 28, 2020, 12:28 PM IST

Updated : Aug 29, 2020, 3:22 AM IST

achennaidu gets bail in esi scam case
మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

12:25 August 28

మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

మాజీమంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్‌ఐ సేవల ఒప్పందాలో అక్రమాలకు పాల్పడ్డారంటూ అనిశా ఆయనపై నమోదు చేసిన కేసులో షరతులతో న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. విచారణ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించారు. సాక్ష్యాలను తారుమారు చేసే యత్నం చేయొద్దన్నారు. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టంచేశారు. విజయవాడ అనిశా కోర్టులో రూ. 2 లక్షలతో ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలన్నారు.

టెలి హెల్త్‌ సర్వీసు (టీహెచ్ఎస్) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు పనులు అప్పగించేలా అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు .. ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేశ్ కుమార్‌ను ఒత్తిడి చేశారన్న ఆరోపణలతో ( రెండో నిందినతునిగా) అనిశా కేసు నమోదు చేసి జూన్ 12 న అరెస్ట్ చేసింది.  ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఆయన వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయమూర్తి శుక్రవారం నిర్ణయం వెల్లడించారు. టీహెచ్‌ఎస్‌కు పనులు అప్పగించాలని ఐఎంఎస్ డైరెక్టర్​కు అచ్చెన్నాయుడు లేఖలు రాశారని వాటిని కోర్టులో దాఖలు చేయడం తప్ప.. కేసు నమోదుకు ముందు విజిలెన్స్ అధికారులు ప్రాథమిక విచారణ జరిపినా.. కేసు నమోదు చేశాక విచారణ జరిపినా ప్రాసిక్యూషన్ ఇప్పటి వరకు చిన్న సాక్ష్యాన్ని సైతం కోర్టు ముందు ఉంచలేకపోయిందని న్యాయమూర్తి అన్నారు. కేసు నమోదు చేశాక రెండున్నర నెలల సుదీర్ఘ దర్యాప్తు చేశాక కూడా పిటిషనర్ ఆర్థిక లబ్ది పొందారనేందుకు సాక్ష్యాలను నిర్ధారించలేకపోయిందన్నారు. ఈ రెండున్నర నెలల్లో ప్రాసిక్యూషన్ విచారించిన ఏ సాక్షులు కూడా అచ్చెన్నాయుడు అక్రమ ఆర్థిక లబ్ధి పొందారని చెప్పలేదన్నారు.  

కాంట్రాక్ట్ పొందినందుకు మూడో నిందితుడు సైతం పిటిషనర్​కు లంచం ఇచ్చినట్లు ఏ సాక్షులు చెప్పలేదని తెలిపారు. అచ్చెన్నాయుడు సొమ్ము తీసుకున్నట్లు ఏ సాక్షి చెప్పలేదనే వ్యాఖ్య విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్  చెప్పారని గుర్తుచేశారు. ఈ వ్యవహారమై ఇప్పటి వరకు సాక్ష్యం లభ్యం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ నేర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనేందుకు ప్రాథమికంగా ఆధారాలు లేవన్నారు. ఆయన్ని మరికొన్ని రోజులు జ్యుడీషియల్ రిమాండ్​లో ఉంచలేమని చెప్పారు. ఐఎంఎస్ డైరెక్టర్​కు లేఖలు రాశారనే కారణంతో పిటిషనర్​ నేర బాధ్యులుగా పేర్కొంటూ బంధించి ఉంచలేమని తెలిపారు. అచ్చెన్నాయుడు లేఖలు రాయడం ద్వారా అక్రమ ఆర్థిక లబ్ధి పొందారనే కీలక విషయం ఈ కేసులో కనిపించడం లేదని చెప్పారు. ఆర్థిక నేరాన్ని దృష్టిలో పెట్టుకొని దర్యాప్తు ప్రారంభ దశలో అని కోర్టు మొదటి బెయిల్ పిటిషన్ను కొట్టేసిందని..,  హైకోర్టు సైతం మొదటి సారి చేసిన పిటిషన్​ను కొట్టేసిందని తెలిపారు. దీంతో దర్యాప్తు సంస్థకు విచారణ కొనసాగించడానికి తగిన సమయం దొరికిందన్నారు.  

ఇప్పటి వరకు పిటిషనర్ అక్రమంగా ఆర్థిక ప్రయోజనం పొందారనే విషయం నిరూపితం కాలేదని..., ఆరోపణలు ప్రాథమికంగా నిర్ధారించలేకపోయినందున ఇప్పటికే కస్టడీలో ఉన్న వ్యక్తిని మరికొన్ని రోజులు నిర్బంధంలో ఉంచి స్వేచ్ఛను హరించలేమని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్‌ను అరెస్ట్ చేశాక విచారణ నిమిత్తం మూడు రోజులు పోలీసు కస్టడీకి ఇచ్చారని అయినా పిటిషనర్ పై నేరారోపణకు సంబంధించిన వివరాలు రాబట్టినట్టు దస్త్రాలు లేవని పేర్కొంది. పిటిషనర్ ఇప్పటికే 77 రోజులు కారాగారంలో ఉన్నారని... పిటిషనర్ ప్రజాప్రతినిధిగా ఉన్నందున బెయిల్​ మంజూరు చేస్తే తప్పించుకునే అవకాశం లేదని తెలిపింది. ఏజీ సైతం ఈ కేసులో ప్రాథమిక అభియోగపత్రం సెప్టెంబర్ మొదటి వారంలో దాఖలు చేస్తున్నట్లు తెలిపారన్నారు. ఆ వివరాలను పరిశీలిస్తే ఈ కేసులో దర్యాప్తు చివరిదశకు వచ్చినట్లు సూచన కనిపిస్తోందని చెప్పారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 

'మంత్రి జయరాం రాజీనామా చేయాలి'

Last Updated : Aug 29, 2020, 3:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.